బువ్వేది?

ABN , First Publish Date - 2022-09-20T05:12:02+05:30 IST

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నవిద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ ఇంకా కార్యరూపం దాల్చడం లేదు.

బువ్వేది?
ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తింటున్న వికారాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు


  • ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం  అమలు ఎప్పుడో?
  •  అర్ధాకలితో పాఠాలు వింటున్న విద్యార్థులు
  •  సీఎం ప్రకటన చేసి రెండేళ్లయినా కార్యరూపం దాల్చని వైనం 
  •  అమలైతే  వికారాబాద్‌ జిల్లాలో15 వేల మందికి ప్రయోజనం 

 ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్నవిద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి  కల్పిస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చే య      నున్నట్లు రెండేళ్ల కిందట సీఎం కేసీఆర్‌ ప్రకటించినా ఇంత వరకూ అమలుకు నోచుకోవం లేదు. లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోలేని విద్యార్థులు సాయంత్రం వరకు తమ కడుపు మాడ్చుకుని పాఠాలు  వింటున్నారు.

వికారాబాద్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : రెండేళ్ల పాటు ఇబ్బందులకు గురిచేసిన కరోనా సంక్షోభాన్ని అధిగమించి విద్యాసంస్థలు ఎప్పటి మాదిరిగానే కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మాదిరిగానే ప్రభుత్వ జూనియర్‌, మోడల్‌ కళాశాలల్లోని ఇంటర్‌ విద్యార్థులకు, డిగ్రీ, డీఎడ్‌, బీఎడ్‌, డీఎడ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కళాశాలల్లో చ దువుతున్న విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలన్న డిమాండ్‌ చాలా కాలంగా ఉంది. ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ఇంత వరకు కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసే విషయమై అప్పటి రాష్ట్ర డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు, కళాశాల, సాంకేతిక విద్యా శాఖల ఉన్నతాధికారులు సమావేశమై  ఆయా కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రతిపాదించారు. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద తెలిపినా ఇంత వరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుపైన సీఎం కేసీఆర్‌ రెండేళ్ల కిందట ప్రకటన చేశారు. సీఎం చేసిన ప్రకటన ప్రకారం గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కళాశాలల్లో కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కావాలి. అయితే కరోనా కారణంగా రెండేళ్ల పాటు సమస్యలు ఎదుర్కొన్నా.. ఆ విపత్కర పరిస్థితులను అధిగ మించి జూన్‌ నెల నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై కేజీ నుంచి పీజీ వరకు తరగతులు పూర్తిస్థాయిలో కొనసాగుతున్నాయి. 

15 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం

వికారాబాద్‌ జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ జూనియర్‌, తొమ్మిది మోడల్‌ కళాశాలలు, నాలుగు ప్రభుత్వ, రెండు ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, ప్రభుత్వ డైట్‌, ప్రభుత్వ ఐటీఐ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 15 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యార్థుల్లో అధికంగా ప్రభుత్వ జూనియర్‌, మోడల్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌, డైట్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు అధిక సంఖ్యలో ఉంటారు. ఏటేటా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్యాహ్న భోజనం అమలు చేస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. చుట్టు పక్కల గ్రామాల నుంచి కళాశాలలకు వచ్చే విద్యార్థుల్లో కొందరు భోజనం చేసి మధ్యాహ్నానికి లంచ్‌ బాక్సు తీసుకుని వస్తుండగా, మరికొందరు ఉదయం తమ ఇళ్ల వద్ద భోజనం చేసి వస్తున్నారు. బాక్సు తెచ్చుకోని విద్యార్థులు కళాశాల ముగిసేవరకు ఆకలితోనే ఆలమటిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం చేయక విద్యార్థులు అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలను  సక్రమంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. 

అమలైతే ప్రభుత్వ కళాశాలలకు మరింత ఆదరణ

ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలా వరకు పేద విద్యార్థులు ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థుల్లో కొందరు తమ వెంట లంచ్‌ బాక్సు తెచ్చుకుంటే, మరికొందరు భోజనం తెచ్చుకోకుండా కళాశాలలకు హాజరవుతున్నారు. లంచ్‌ బాక్స్‌ తెచ్చుకోని విద్యార్థులు సాయంత్రం వరకు తమ కడుపు మాడ్చుకుని పాఠాలు వింటున్నారు. కొందరు విద్యార్థులు భోజనం చేసే సమయంలో కర్రీపప్‌, సమోసా వంటివి తిని ఆకలిని కొంత వరకు నియంత్రించుకుంటున్నారు. మధ్యాహ్నం భోజనం చేయని విద్యార్థులు అధ్యాపకులు చెప్పే పాఠ్యాంశాలపై సక్రమంగా దృష్టి సారించలేక పోతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచైనా ప్రభుత్వ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పేద విద్యార్థులకు ప్రయోజనం కలగడమే కాకుండా ప్రభుత్వ కళాశాలలకు మరింత ఆదరణ పెరిగే పెరిగే  అవకాశం ఉంది. 

Read more