పరిహారం జాడేది?

ABN , First Publish Date - 2022-09-24T05:13:05+05:30 IST

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వ నిర్మాణానికి

పరిహారం జాడేది?
పిచ్చిమొక్కలతో నిండిన కెఎల్‌ఐ డీ-82 కాల్వ

  • ఐదేళ్లుగా గోస తీస్తున్న సింగంగపల్లి, పోలెపల్లి నిర్వాసిత రైతాంగం 
  • భూసేకరణ చేయకుండానే కేఎల్‌ఐ డీ-82 కాల్వ నిర్మాణం
  • 94.09 ఎకరాల భూములు కోల్పోయిన 283 మంది రైతులు
  • కాల్వ నిర్మించి ఐదేళ్లవుతున్నా అందని సాగునీరు
  • పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షి ణలు
  • ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ తీరుపై నిర్వాసితుల ఆగ్రహం


ఆమనగల్లు ,సెప్టెంబర్‌ 23: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వ నిర్మాణానికి భూములు కోల్పోయిన ఆమనగల్లు మండలం పోలెపల్లి, సింగంపల్లి గ్రామాల నిర్వాసిత రైతులు పరిహారం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పంటలు పండించుకునే భూమిలో కాల్వ నిర్మాణం జరగడంతో సాగుకు దూరమై రైతులు ఉపాధి కోల్పోయారు. ఇటు పరిహారమందక, అటు సాగునీరు రాక భూనిర్వాసితులు వేదనకు లోనవుతున్నారు. అసంపూర్తి పనులు పూర్తి చేయాలని, పరిహారం డబ్బు ఇప్పించి తమను ఆదుకోవాలని రైతులు ఏళ్లకాలంగా గోస పడుతున్న ఎవరూ కనికరించడం లేదు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పగా చెప్పుకునే అధికార పార్టీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌, ఆ పార్టీ నేతల చుట్టూ నిర్వాసిత రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడాను, అదిగో వచ్చే... ఇదిగో వచ్చే అంటూ రెండేళ్లుగా కాలయాపన సాగిస్తున్నారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ప్రభుత్వం దృష్టికి నిర్వాసిత రైతుల గోడు తీసుకుపోవడంలో పాలక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే, అధికారుల ఉదాసీనత తో విసిగిపోయిన రైతులు కడకు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. 


2017 ఫిబ్రవరి లో కాల్వ నిర్మాణం

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండలాల పరిధిలోని 35వేల ఎకరాలకు సాగునీరందించడానికి డీ-82 కాల్వ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2017లో రూ.178 కోట్లు విడుదల చేసింది. దీంతో కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు కాల్వ నిర్మాణం చేపట్టారు. ఆమనగల్లు మండలం పోలెపల్లి, సింగంపల్లి గ్రామాల పరిధిలో సుమారు 8 కిలోమీటర్ల మేర రైతుల పట్టా భూముల్లో కాల్వ నిర్మాణం చేపట్టారు. మూడేళ్ల క్రితమే 90శాతం పనులు పూర్తయ్యాయి. కాగా  సకాలంలో నిధులు విడుదల కాక, కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం, కొన్నిచోట్ల భూ వివాదాలతో కాల్వ నిర్మాణం చివరి దశలో అసంపూర్తిగా నిలిచిపోయింది. కేవలం 5 శాతం పనులు మూడేళ్లుగా ముందుకు సాగడం లేదు. 


283మంది బాధిత రైతులు

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వ నిర్మాణం మూలంగా పోలెపల్లిలో 142 మంది రైతులకు చెందిన 59.24 ఎకరాలు, సింగంపల్లి కి చెందిన 141 మంది రైతుల 35.25 ఎకరాలు భూములు కోల్పోయారు. 2017లో భూసేకరణ చేయకుండానే కాల్వ నిర్మాణం చేయడంతో అప్పట్లో రైతుల పొలాల్లో కోతకొచ్చిన పంటలు కూడ చాలావరకు దెబ్బతిన్నాయి. అయినా ఉన్న పొలానికైనా సాగునీరు అందుతుందని భావించిన రైతులు కాల్వ నిర్మాణానికి సహకరించారు. 


ఎకరాకు రూ. 8లక్షలు ధర నిర్ణయం

కెఎల్‌ఐ డీ-82 కాల్వ నిర్మాణంతో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.8 లక్షలు పరిహారంగా ధర నిర్ణయించారు. 2017 ఫిబ్రవరిలో కాల్వ నిర్మాణం చేపట్టిన అధికారులు రెండేళ్ల తర్వాత కొలతలు వేసి రైతులవారీగా కోల్పోయిన భూముల వివరాలు సేకరించారు. రెండు గ్రామాల రైతుల జాబితాను రూపొందించి రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. 2019 నవంబర్‌ 25న కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో అప్పటి జాయింట్‌కలెక్టర్‌ హరీశ్‌, రైతులు, ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖ అధికారులు సమావేశమై ఎకరాకు రూ.8 లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. 2020 జూలై 30న ప్రభుత్వం అందుకనుగుణంగా ఆర్డర్‌ పాస్‌ చేసింది. రైతుల బ్యాంకు వివరాలు సేకరించిన అధికారులు ప్రభుత్వం డబ్బు విడుదల చేయగానే ఖాతాలలో వేస్తామని నిర్వాసితులకు భరోసా కల్పించారు. 27నెలలైనా పరిహారం అందలేదు. 


నివేదికతో నిలిచిన రైతుబంధు సాయం

పోలెపల్లి, సింగంపల్లిలలో కాల్వ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతుల వివరాలు గతేడాది అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అప్పటినుంచి ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం నిలిచిపోయింది. కాల్వ నిర్మాణానికి కోల్పోయిన భూములకే కాకుండా.. అధికారుల తప్పిదంతో అదే సర్వే నెంబర్‌లోని మిగతా భూమికి కూడ ఓ విడత రైతుబంధు నిలిచిపోయింది. రైతుల ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ తర్వాత కాల్వకు పోయిన భూమికి మినహా మిగతా భూములకు రైతుబంధు సాయం యథావిధిగా అందిస్తున్నారు.


ఏళ్ల కాలంగా గోస తీస్తున్నాం

కేఎల్‌ఐ డీ-82 కాల్వ నిర్మాణానికి భూములు కోల్పోయిన తాము పరిహారం కోసం ఏళ్ల కాలంగా గోస తీస్తున్నాం. సాగునీరందుతుందని భూసేకరణ చేయకున్న కాల్వ నిర్మాణానికి అడ్డు చెప్పకుండా సహకరించాం. మిగులు పనుల పూర్తి, సాగునీటి కల్పన, పరిహారం అందజేత విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోని న్యాయం చేయాలి.

- వరికుప్పల ఎల్లయ్య, రైతు, పోలెపల్లి 


త్వరలో పరిహారం

భూములు కోల్పోయిన రైతులకు పరిహారం గురించి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయాం. వీలైనంత త్వరగా పరిహారం విడుదల కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా కారణంగా ఆలస్యమైంది. ఇప్పటికే పరిహారం చెల్లింపు కు సంబందిత అధికారులకు సిఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

- అనురాధ పత్యనాయక్‌, జడ్పీటీసీ, ఆమనగల్లు Read more