అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

ABN , First Publish Date - 2022-08-11T05:18:42+05:30 IST

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

ఆమనగల్లు, ఆగస్టు 10: ప్రజా స్వామ్యంలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు సూచించారు. పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ భవనంలో బుధవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అనితవిజయ్‌ అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ రాములు, ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం సభ ప్రారంభం కాగానే విద్యుత్‌ సమస్యలపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మన ఊరు- మన బడిలో తొలివిడత పాఠశాలల ఎంపిక ఎలా చేశారని ఎంపీటీసీ దోనాదుల కుమార్‌, సర్పంచ్‌ శ్రీనయ్య లు ప్రశ్నించారు. పాఠశాలల్లో స్వీపర్లు లేకపోవడంతో సొంత డబ్బులు వెచ్చించి పాఠశాలను శుభ్రం చేయిస్తున్నామని పోలెపల్లి సర్పంచ్‌ బాల్‌రామ్‌ సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆమనగల్లు బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని జడ్పీటీసీ అనురాధ పత్యనాయక్‌ సభలో ప్రస్తావించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు సరిగ్గా పనిచేయడం లేదని, కేంద్రాలను తెరవడం లేదని, బాలామృతం ఆహారాన్ని బయడ విక్రయిస్తున్నారని ఎంపీపీ అనిత, సర్పంచ్‌ శ్రీనివాస్‌ ఆరోపించారు. ఆమనగల్లు పంచాయతీ రాజ్‌ డీఈ తిరుపతి రెడ్డి అందుబాటులో ఉండడం లేదని, ప్రజాప్రతినిధులకు విలువ ఇవ్వడం లేదని సర్పంచ్‌ శ్రీనయ్య ఆరోపించారు. మేడిగడ్డ సమీపంలో వాగుపై బ్రిడ్జికి నిధులు మంజూరైన పనులు చేపట్డడం లేదని సర్పంచ్‌ ఆమర్‌సింగ్‌ సమస్యను లేవనెత్తారు. గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మండలంలో వెలసిన వెంచర్లపై విచారణ జరిపి అక్రమ వెంచర్లు ఉంటే చర్యలు తీసుకోవాలని, దీనిపై పూర్తి నివేదికను తమకు అందించాలని ఎంపీవో శ్రీలతను ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌లు ఆదేశించారు. అనంతరం సర్పంచ్‌లకు స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ జెండాలను ప్రదర్శించారు. సమావేశంలో ఆమనగల్లు సీఐ ఉపేందర్‌, తహాసీల్దార్‌ పాండు నాయక్‌, ఎంపీడీవో వెంకట్రాములు, మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, సర్పంచ్‌లు, మంజుల, అమర్‌సింగ్‌, మల్లమ్మ, ఎంపీటీసీ నిట్టమంగమ్మ, అధికారులు సర్దార్‌నాయక్‌, కృష్ణయ్య, విజయ్‌కుమార్‌, దశరథ్‌, వాగ్దేవి, కృష్ణయ్య పాల్గొన్నారు. 

నందీశ్వర, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనోత్సవాల్లో ఎంపీ, ఎమ్మెల్యే పూజలు 

తలకొండపల్లి, ఆగస్టు 8: చుక్కాపూర్‌ గ్రామ సమీపంలో ఉన్న కలికిదోన వేణుగోపాల స్వామి ఆలయంలో ధ్వజస్తంభ, శిఖర, నందీశ్వర విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నాగర్‌ కర్నూల్‌ ఎంపీ రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌, మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు కృష్ణమూర్తి, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ తోట గిరియాదవ్‌, స్థానిక సర్పంచ్‌ కిష్టమ్మ, ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్‌, భక్తులు శ్యామ్‌సుందర్‌ ఉన్నారు.  

Read more