చెరువులో ముగ్గురు గల్లంతు

ABN , First Publish Date - 2022-09-29T05:22:52+05:30 IST

చెరువులో ముగ్గురు గల్లంతు

చెరువులో ముగ్గురు గల్లంతు
నీటిలో మునుగుతున్న విద్యార్థులు

  •  ఈతకు వెళ్లిన విద్యార్థులు
  •  గజ ఈతగాళ్లతో గాలింపు..  ఒకరి మృతదేహం లభ్యం 
  •  మిగతావారి కోసం గాలింపు 

కీసర రూరల్‌, సెప్టెంబరు 28: చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటన బుధవారం కీసర పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  అందులో ఒకరి మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో వెలికి తీయగా, మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే  నగరంలోని తీగల కృష్ణారెడ్డి కళాశాలలో డిప్లొమా మూడో సంవత్సరం చదువుతున్న ఉబేద్‌(18), హరిహరన్‌(18)ల పుట్టిన రోజు కావడంతో తోటి మిత్రులతో కలిసి మొత్తం తొమ్మిది మంది విద్యార్థులు కీసరమండలం చీర్యాల్‌ గ్రామంలోని లక్ష్మీనారసింహస్వామిని దర్శించుకునేందుకు బుధవారం ఉదయం వెళ్లారు. స్వామివారి దర్శనానంతరం ఈత కొట్టేందుకు ఆలయం ఎదుట గల నాటికన్‌ చెరువులోకి తొమ్మిది మంది దిగారు. వారిలో చంపాపేటకు చెందిన ఉబేద్‌(18), హయత్‌నగర్‌కు చెందిన హరిహరన్‌(18),  రామోజీ ఫిలింసిటీ ఏరియాకు చెందిన బాలు(18) నీటమునిగారు. అయితే, వారు కావాలని చేస్తున్నారా! లేక ఈదటం రాదా! అని మిగతా వారు పసిగట్టేలోపే వారు నీట మునిగారు. తోటిమిత్రులు కంగారుతో కేకలు  వేస్తూ రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. స్థానికులు కీసర పోలీసులకు సమాచారమివ్వగా వారు అక్కడికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గజఈతగాళ్లతో వెతికించారు. గంటల తరబడి శ్రమించి ఉబేద్‌ మృతదేహాన్ని వెలికి తీశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెరువులో ఈతకొట్టే సమయంలో విద్యార్థులు తీసుకున్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. వాటిని చూస్తూ మిగతా విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.

Read more