గ్రామసభలు పెట్టాలంటేనే భయమేస్తోంది

ABN , First Publish Date - 2022-12-06T23:56:49+05:30 IST

ప్రజల సమస్యలు పరిష్కరించలేక, వారికి సమాధానం చెప్పలేక గ్రామాల్లో సర్పంచ్‌లు భయంతో గ్రామసభలు నిర్వహించలేకపోతున్నారని ఎదులాబాద్‌ ఎంపీటీసీ రవి, కో-అప్షన్‌ సభ్యుడు ఇక్బాల్‌లు మండల సమావేశంలో వాపోయారు.

గ్రామసభలు పెట్టాలంటేనే భయమేస్తోంది
మాట్లాడుతున్న శరత్‌చంద్రారెడ్డి

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 6 : ప్రజల సమస్యలు పరిష్కరించలేక, వారికి సమాధానం చెప్పలేక గ్రామాల్లో సర్పంచ్‌లు భయంతో గ్రామసభలు నిర్వహించలేకపోతున్నారని ఎదులాబాద్‌ ఎంపీటీసీ రవి, కో-అప్షన్‌ సభ్యుడు ఇక్బాల్‌లు మండల సమావేశంలో వాపోయారు. మంగళవారం ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి జడ్పీ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. గ్రామ కార్యదర్శులు ఇళ్ళ ముందు చావుడప్పులు కొట్టించి మరీ ఇంటిపన్నులు వసూలు చేస్తున్నారని, గడిచిన నాలుగేళ్ళలో మండల పరిషత్‌ నుంచి ఒక్క రూపాయి పని చేయించలేని పరిస్థితిలో ఉన్నామని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీల నిర్వహణ కష్టంగా ఉందని సర్పంచ్‌ కొంతం వెంకట్‌రెడ్డి ఆరోపించారు. గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలున్నాయని ఎంపీటీసీ, సర్పంచ్‌లు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధికి కృషిచేయనున్నట్లు తెలిపారు. అధికారుల సమన్వయంతో జిల్లాను, మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్‌ ఎంపీపీ జంగమ్మ, ఎంపీడీవో అరుణ, డిప్యూటీ తహసీల్దారు భాస్కర్‌రెడ్డి, సభ్యులు తదితరులున్నారు.

Updated Date - 2022-12-06T23:56:50+05:30 IST