దొంగతనాలే వృత్తి.. ఆలయాలే టార్గెట్‌

ABN , First Publish Date - 2022-09-20T05:24:53+05:30 IST

దొంగతనాలే వృత్తి.. ఆలయాలే టార్గెట్‌

దొంగతనాలే వృత్తి.. ఆలయాలే టార్గెట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ కుషాల్కర్‌

  • వరుస చోరీలు చేస్తున్న దొంగ అరెస్టు
  • నగదు స్వాధీనం 


షాద్‌నగర్‌అర్బన్‌, సెప్టెంబర్‌ 19: దొంగతనాలే వృత్తిగా ఎంచుకుని ఆలయాలను టార్గెట్‌ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను పట్టుకొని సోమవారం కోర్టులో హాజరు పరిచినట్లు షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌ తెలిపారు. షాద్‌నగర్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. జడ్చర్లలోని నిమ్మబావిగడ్డకు చెందిన మొండి కృష్ణ అలియాస్‌ కిచ్చుగాడు అనే వ్యక్తి షాద్‌నగర్‌లోని ఇంద్రానగర్‌ కాలనీలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ దొంగతనాలు చేశాడు. ఈనెల 13న రాత్రి స్థానిక ఆర్డీసీ కాలనీలోని జగన్నాథస్వామి ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, శివాలయాల తాళాలను పగలగొట్టి, నగదును దొంగిలిచాడు. తాళాలు పగలగొట్టేందుకు మాంసాన్ని కొట్టే కత్తిని తీసుకుని వచ్చి దొంగతనం చేసిన అనంతరం ఆలయంలోనే వదిలాడు. కత్తి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు దొంగ పాత నేరసుడు  మొండికృష్ణగా గుర్తించారు. ఈ మేరకు అతడి నుంచి రూ.9,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొండికృష్ణ గతంలో మహబూబ్‌నగర్‌, జడ్చర్ల ప్రాంతాల్లో పలు దొంగతనాలు చేశాడని, అతడిపై 14కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. అదేవిధంగా ఎలికట్ట భవాని మాత ఆలయంలో, చౌదరిగూడ ఆలయంలో జరిగిన చోరీలను కూడా ఛేదిస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్‌లో చోరీలపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. షాద్‌నగర్‌ సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు నేతృత్వంలో విచారణ చేపట్టి దొంగతనాన్ని ఛేదించిన కానిస్టేబుళ్లు యాదగిరి, రవికుమార్‌, జాకీర్‌, రాజు, రవిలను ఏసీపీ అభినందించారు.  

Read more