వేర్వేరుగా ముగ్గురి అదృశ్యం

ABN , First Publish Date - 2022-04-25T05:19:49+05:30 IST

వేర్వేరుగా ముగ్గురి అదృశ్యం

వేర్వేరుగా ముగ్గురి అదృశ్యం

మొయినాబాద్‌/చేవెళ్ల, ఏప్రిల్‌ 24: ముగ్గురు అదృశ్యమైన ఘటనలు వేర్వేరు చోట్ల చోటుచేసుకున్నాయి. మొయినాబాద్‌లో తల్లీకూతుళ్లు, చేవెళ్లలో ఓ విద్యార్థిని అదృశ్యమయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం భూనిడు గ్రామానికి చెందిన లాలమ్మ ఆమె కూతురుతో కలిసి 15రోజుల క్రితం తమగ్రామం నుంచి మొయినాబాద్‌లోని తమ బంధువు అయిన లాలప్ప ఇంటికి వచ్చారు. కాగా లాలమ్మ భర్త హనుమంతు తన భార్య, కూతురును తీసుకెళ్లేందుకు శనివారం మొయినాబాద్‌ వచ్చాడు. అయితే అతడు వచ్చేసరికి తన భార్య, కూతురు చెప్పకుండా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లి పోయారని పోలీసులకు హన్మంతు ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా చేవెళ్లలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఓవిద్యార్థిని అదృశ్యమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా బాలాపూర్‌ మండలం రాజాపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థిని చేవెళ్ల ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఉండటంతో పాఠశాలగేటు తెలిచిఉంచారు. అదే సమయంలో విద్యార్థిని బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాత్రి వరకు వసతిగృహానికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఆమె తల్లిదండ్రులు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు ఇన్‌స్పెక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. 

Read more