ఫలించిన బుజ్జగింపులు

ABN , First Publish Date - 2022-11-23T23:41:50+05:30 IST

అలిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌ బుజ్జగించారు.

ఫలించిన బుజ్జగింపులు
బొక్క నర్సింహారెడ్డితో ఆచారి, వీరేందర్‌గౌడ్‌

అలిగిన బొక్క నర్సింహారెడ్డిని సముదాయించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌

పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని భరోసా

నర్సింహారెడ్డి ఇంటికి వెళ్లిన రాష్ట్ర, జిల్లా నాయకులు

రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 23 : అలిగిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌ బుజ్జగించారు. రెండోసారి ఫోన్‌లో మాట్లాడి ఆయనకు సర్దిచెప్పారు. పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో రాజీనామా చేయాలన్న ఆలోచనను నర్సింహారెడ్డి విరమించుకున్నారు. బుధవారం బీజేపీ జాతీయ బీసీ కమిషన్‌ మాజీ మెంబర్‌ ఆచారి, పార్టీ సీనియర్‌ నాయకులు వీరేందర్‌గౌడ్‌తోపాటు జిల్లా పార్టీ నేతలంతా బొక్క నర్సింహారెడ్డి ఇంటికి తరలివెళ్లారు. పార్టీలో మునుపటిలా పనిచేయాలని సూచించారు. తనకు తెలియకుండా మహేశ్వరం నియోజకవర్గ కన్వీనర్‌గా ఎలిమినేటి దేవేందర్‌రెడ్డిని నియమించడం పట్ల తాను మనస్థాపానికి గురైనట్లు బొక్క నర్సింహారెడ్డి తెలిపారు.

బొక్క నర్సింహారెడ్డి నివాసంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో అవకతవకలు సరిచేయాలని డిమాండ్‌ చేశారు. భూ సమస్యల కారణంగా రైతులు చనిపోతున్నా సర్కార్‌ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈనెల 25న కడ్తాలలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు బొక్క నర్సింహారెడ్డి తెలిపారు. జిల్లాకు సంబంధించిన రాష్ట్రనాయకులు, జిల్లా పదాధికారులు, మండలాధ్యక్షులు, జిల్లా కార్యవర్గసభ్యులు పాల్గొంటారని తెలిపారు. జిల్లా సమస్యలపై చర్చించి భవిష్యత్‌లో చేపట్టే కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అంజన్‌కుమార్‌గౌడ్‌, కొప్పు భాష, పొరెడ్డి నర్సింహారెడ్డి, నెల్లి శ్రీవర్ధన్‌రెడ్డి, పాపయ్యగౌడ్‌, జంగయ్య యాదవ్‌, బోసుపల్లి ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T23:41:50+05:30 IST

Read more