దేశానికే తెలంగాణ ఆదర్శం

ABN , First Publish Date - 2022-11-28T00:03:15+05:30 IST

రైతు సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ అన్నారు.

దేశానికే తెలంగాణ ఆదర్శం
ఆమనగల్లు: ఎమ్మెల్యేను సన్మానిస్తున్న మార్కెట్‌ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, పాలకవర్గం

ఆమనగల్లు/మాడ్గుల, నవంబరు 27: రైతు సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ అన్నారు. ఆమనగల్లు మార్కెట్‌ పాలకవర్గంతో ధాన్యం కొనుగోళ్లు, మార్కెట్‌యార్డు అభివృద్ధిపై ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు. మార్కెట్‌యార్డు అభివృద్ధి అధ్యయనంలో భాగంగా ఏపీలోని వివిధ మార్కెట్‌ యార్డులను సందర్శించి వచ్చిన చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, పాలక వర్గం సభ్యులను ఎమ్మెల్యే సత్కరించారు. అధ్యయన యాత్రకు, మార్కెట్‌ అభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యేను పాలకవర్గం సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ వైస్‌చైర్మన్‌ తోట గిరియాదవ్‌, రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, వైస్‌ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు జోగు వీరయ్య, డైరెక్టర్లు లాయక్‌అలీ, సుభాష్‌, రమేశ్‌ నాయక్‌, నూకం శేఖర్‌, నిరంజన్‌, నర్సింహగౌడ్‌ పాల్గొన్నారు. కాగా, మాడ్గుల మండలంలోని కొత్తబ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 20మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-28T00:03:16+05:30 IST