పాపం.. పార్వతమ్మ !

ABN , First Publish Date - 2022-10-12T04:19:44+05:30 IST

పాపం.. పార్వతమ్మ !

పాపం.. పార్వతమ్మ !
బషీరాబాద్‌ ఎంపీడీవో కార్యాలయానికి తల్లితో కలిసి పింఛన్‌ కోసం వచ్చిన మానసిక దివ్యాంగురాలు పార్వతమ్మ

  •  మానసిక దివ్యాంగురాలికి పింఛన్‌ మంజూరైనా డబ్బులు అందని వైనం
  •  డిజిటల్‌ స్మార్ట్‌ కార్డు ఉన్నా ఆన్‌లైన్‌లో పేరు మాయం
  •  నిత్యం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చివెళ్తున్న తల్లీకూతుళ్లు

బషీరాబాద్‌, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి) : ఆ యువతి పుట్టుకతో మానసిక దివ్యాంగురాలు.. ఇటీవల ఆమెకు ఆసరా పింఛన్‌ మంజూరైంది. దీంతో పింఛన్‌ మంజూరి పత్రంతో పాటు డిజిటల్‌ స్మార్ట్‌ కార్డు అధికారులు ఆమెకు అందజేశారు. ఈక్రమంలో పింఛన్‌ కోసం వెళితే.. ఆన్‌లైన్‌లో పేరు చూపించడం లేదని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యింది. చేసేదేమీలేక ఆ దివ్యాంగురాలు, ఆమె తల్లితో కలిసి నిత్యం ఎంపీడీవో కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్‌ మండలం నవాల్గ గ్రామానికి చెందిన దామర్‌చెడ్‌ పార్వతమ్మ(31) మానసిక దివ్యాంగురాలు, దీంతో ఆమె తల్లి మాణెమ్మ అన్నీ తానై కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. కాగా, ఆమెకు సదరం క్యాంపులో 90శాతం డిజబిలిటీ ఉన్నట్లు ఇచ్చిన సర్టిఫికెట్‌ కూడా ఉంది. అయితే, కొన్నిరోజుల క్రితం ఆమె పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగా.. సెప్టెంబరులో పింఛన్‌ మంజూరైంది. అధికారులు పింఛన్‌ మంజూరైనట్లు డిజిటల్‌ స్మార్ట్‌ కార్డు కూడా ఇచ్చారు. ఈక్రమంలో ఆమె పింఛన్‌ కోసం వెళ్లగా.. ఆన్‌లైన్‌లో పేరు చూపడం లేదని బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ తిరస్కరించారు. అనంతరం బషీరాబాద్‌ ఎంపీడీవో కార్యాలయానికి దివ్యాంగురాలు, తల్లి కలిసి ఆరా తీశారు. ఆన్‌లైన్‌లో పరిశీలించిన అధికారులు సమగ్ర కుటుంబ సర్వేలో యువతి కుటుంబీకుల పేరుమీద భూమి ఎక్కువగా ఉండటంతో పింఛన్‌ రద్దయిచి ఉండోచ్చని చెప్పారు. అయితే, తన కూతురు పేరిట రెండెకరాల భూమి మాత్రమే ఉందని, గతంలో పింఛన్‌ వచ్చేదని ఆ యువతి తల్లి చెబుతోంది. పింఛన్‌ ఇవ్వకపోతే నా కూతురు ఎలా  బతకాలని, అధికారులు వాస్తవ పరిస్థితులపై విచారణ జరిపి పింఛన్‌ వచ్చేలా చూడాలని ఆమె వేడుకుంటోంది. ఉన్నతాధికారులు స్పందించి తన కూతురికి న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమవుతోంది. 

Updated Date - 2022-10-12T04:19:44+05:30 IST