నలుగుతున్న నేతలు

ABN , First Publish Date - 2022-11-25T00:16:38+05:30 IST

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎ్‌సల మధ్య వైషమ్యాల కారణంగా ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు దర్యాప్తు సంస్థల భయంతో వణికిపోతున్నారు.

నలుగుతున్న నేతలు

  • ఐటీ దాడులతో దడదడ

  • ఉమ్మడి జిల్లాలో మరికొందరిపై గురి

  • వ్యాపారాలు చేస్తున్న వారే టార్గెట్‌

  • రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉండే యోచన

కేంద్ర, రాష్ట్రం ప్రభుత్వాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వీరి వైరం వల్ల గులాబీ నేతల్లో గుబులు పట్టుకుంది. మంత్రి మల్లారెడ్డి సంస్థలపైన జరిగిన ఐటీ దాడులు తల్చుకుని గజ్జున వణికిపోతున్నారు. ఉమ్మడి జిల్లా నేతల్లో కొందరైతే ఈ రాజకీయాలు మాకొద్దు బాబోయ్‌ అనే స్థితికి వచ్చారు. ఈ రాజకీయ వేడి మాకెక్కడ తాకుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, నవంబరు 24) : కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎ్‌సల మధ్య వైషమ్యాల కారణంగా ఈ రెండు పార్టీలకు చెందిన నేతలు దర్యాప్తు సంస్థల భయంతో వణికిపోతున్నారు. రెండు పార్టీల మధ్య ఘర్షణలతో ఇరుపార్టీలకు చెందిన నేతలు నలిగిపోతున్నారు. ఎప్పుడు ఏ ఆపద ఎలా ముంచుకు వస్తుందోననని బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మధ్య తలెత్తిన విభేదాల్లో తాము బలిపశువులమవుతున్నామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఐటీ, ఈడీలను రంగంలో దింపగా రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ఏసీబీని ప్రయోగించే యోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు చెందిన బడా నేతలు కొందరు బతికి ఉంటే బలుసాకు తినొచ్చనే రీతిలో కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండే యోచనచేస్తున్నారు. వరుసగా రెండు రోజులపాటు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి ఆయన కుటుంబీకులు, బంధువుల ఇళ్లపై ఆదాయపన్నుశాఖ రెండు రోజులపాటు దాదాపు 60 బృందాలతో ఏకకాలంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దాడుల సమయంలో ఆయన కుమారుడు ఒత్తిడికి లోనై ఛాతినొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఇదే సమయంలో ఇంటి పనిమనిషి కూడా ఆసుపత్రిలో చేరారు. వరుస పరిణామాలతో దిగ్ర్భాంతికిలోనైన మంత్రి మల్లారెడ్డి ఒక సమయంలో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మా కుమారుడిని కొట్టారు... కొన్ని దశాబ్ధాలుగా వ్యాపారం చేసుకుంటున్న మాపై రాజకీయ కక్షలతో ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా? అని మల్లారెడ్డి ప్రశ్నించారు. దాడుల సమయంలో తన కుమారుడు తీవ్ర అస్వస్థతకు లోనైన విషయం టీవీలో చూసిన మల్లారెడ్డి భార్య షాక్‌కు గురయ్యారు. ఏం తీసుకుంటారో తీసుకొండి.. మా దారిన మమ్మల్ని వదిలేయాలంటూ ఆమె ప్రాఽధేయపడినట్లు తెలిసింది. దాడులు జరిగిన తీరు, ఆ తరువాత పరిణామాలతో మంత్రితోపాటు కుటుంబీకులు తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. పార్టీ నాయకత్వం నుంచి కూడా ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదనే భావనతో కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం. అయితే మంత్రి మల్లారెడ్డి మాత్రం బయట కొంత గంభీరంగా కనిపించే యత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవలే రాష్ట్రంలో ఒక మంత్రి సంస్థలపై ఐటీశాఖ దాడులు నిర్వహించి రికార్డులను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి మల్లారెడ్డి సంస్థలపై దాడులు నిర్వహించడంతో ఇక్కడ అధికార టీఆర్‌ఎస్‌ నేతలు బిక్కుబిక్కుమంటున్నారు. రాజకీయ లక్ష్యంతో ఈ దాడులు జరుగుతున్నాయని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఆరోపిస్తున్నప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేస్తే కేంద్రం మరో రెండడుగులు ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఐటీ సోదాలు జరుగుతున్న తీరు చూస్తే చివరకు మరికొందరు రాజకీయనేతలు, వ్యాపారవేత్తలపై త్వరలో దాడులు జరగవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తూ టీఆర్‌ఎస్‌ నాయకత్వానికి అతి దగ్గరగా ఉన్న నేతలను టార్గెట్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మరికొందరు టీఆర్‌ఎస్‌ నేతల్లో కలవరం మొదలైంది.

కొన్నాళ్లు దూరంగా ఉంటే మేలు!

ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలను త్వరలో టార్గెట్‌ చేయవచ్చని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు టీఆర్‌ఎస్‌ నేతలకు దేశంలోనే కాక దక్షిణాఫ్రికా, అరబ్‌ దేశాలతోపాటు పలు దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. వీరిని బీజేపీ టార్గెట్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ అధినాయకత్వం నుంచి సదరు నేతలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వెళ్లాయి. దర్యాప్తు సంస్థల భయంతో కొందరు టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు ఇప్పటికే రాజకీయ కార్యక్రమాలు తగ్గించుకున్నారు. ఐటీ, ఈడీ రాడర్‌లో ఉన్న కొందరు నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు తగ్గించుకోవడమే కాక, బీజేపీ ఊసు కూడా ఎత్తడం లేదు. నిన్నమొన్నటి వరకు సోషల్‌ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా రోజూ పోస్టులు పెట్టిన నేతలు ఇపుడు మౌనంగా ఉంటున్నారు. కొందరైతే రాజకీయాలకు కొన్నాళ్లు దూరంగా ఉంటే మంచిదనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపు ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ కూడా బీజేపీ నేతలను కొందరిని టార్గెట్‌ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలకు చెందిన కొందరు నేతలు కొన్నాళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉండే యోచన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మనకు రాజకీయాలు వద్దంటూ కొందరు నేతలకు వారి కుటుంబ సభ్యుల నుంచి వత్తిళ్లు కూడా వస్తున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉండి హాయిగా వ్యాపారాలు చేసుకుందామని కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు తెలిసింది.

Updated Date - 2022-11-25T00:20:03+05:30 IST

Read more