స్వయం ఉపాధికి రుణాలు

ABN , First Publish Date - 2022-07-19T05:15:37+05:30 IST

చిన్న, సూక్ష్మ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంతో నిరుద్యోగులకు స్వయం ఉపాధికి రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.

స్వయం ఉపాధికి రుణాలు
పథకంపై ఇబ్రహీంపట్నంలో యువతకు అవగాహన కల్పిస్తున్న అధికారులు(ఫైల్‌)

 • నిరుద్యోగులకు భరోసా
 • ఉత్పత్తి పరిశ్రమకు రూ.50లక్షలు, సేవా పరిశ్రమకు రూ.20లక్షల ప్రోత్సాహం
 • ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం పెట్టుబడి భరించే అర్హత ఉంటే చాలు..
 • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులు, రిటైర్డ్‌ సైనికులైతే 5 శాతం మార్జిన్‌ మనీ
 • కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాజెక్టు
 • పథకంపై అవగాహన కల్పిస్తున్న పరిశ్రమల శాఖ అధికారులు


చిన్న, సూక్ష్మ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంతో నిరుద్యోగులకు స్వయం ఉపాధికి రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగ యువత ఉత్పత్తి పరిశ్రమ స్థాపిస్తే గరిష్టంగా రూ.50లక్షలు, అలాగే సేవా పరిశ్రమకు గరిష్టంగా రూ.20లక్షల రుణాన్ని అందజేస్తారు. యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించడంతో పాటు మరింత మందికి పని కల్పించి వారి జీవన ప్రమాణస్థాయిని పెంపొందించడం, వృత్తి నిపుణుల నైపుణ్యాలను వినియోగంలోకి తెచ్చి గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలను నియంత్రించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.  ఈ పథకంపై అధికారులు అవగాహన సమావేశాలు  నిర్వహిస్తున్నారు.


రంగారెడ్డి అర్బన్‌, జూలై 18: ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధికి భరోసా ఇస్తోంది. ఈ పథకం ద్వారా ఉత్పత్తి పరిశ్రమకు గరిష్టంగా రూ.50లక్షలు, సేవా పరిశ్రమకు గరిష్టంగా రూ.20లక్షలు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందజేస్తారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమ ల మంత్రిత్వ శాఖతో పాటు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ ద్వారా ఈ పథకం అమలవుతోంది. జిల్లాలో గత మూడేళ్లలో 330 ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకో సం రూ.978.35 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఈ మూడేళ్లలో 546 ప్రాజెక్టులకు రూ .2,241.34 లక్షలు ఇచ్చారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం కంటే.. అధికంగా ప్రగతి సాధించారు. ఈ ఏ డాది కూడా నిరుద్యోగ యువత నుంచి పీఎంఈజీ పీ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈసారి 80 ప్రాజెక్టులకు సంబంధించి రూ.252.25లక్షల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో డీఐసీ ద్వారా 32 ప్రాజెక్టులకు రూ.100.9లక్షలు, కేవీఐసీ ద్వారా 16 ప్రాజెక్టులకు రూ.50.45లక్షలు, కేవీఐబీ ద్వారా 32 ప్రాజెక్టులకు రూ. 100.9లక్షలు ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీనిపై జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు నిరుద్యోగులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. 


 • పథకం లక్ష్యాలు, ఉద్దేశాలు ఇవీ..

కుటీర, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం. వివిధ వృత్తి నిపుణులకు ఉపాధి చూపడం. వలసలను నియంత్రిస్తూ, నిరుద్యోగులు తమ గ్రామం, తమ సొంత ప్రాంతాల్లోనే జీవనోపాధి పొందుతూ చుట్టూ ఉన్న పది మందికి ఉపాధి కల్పించేలా చేయడం. గ్రామీణ ప్రాంతా ల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటు కు ప్రోత్సాహమివ్వడం. ప్రజ ల, యువత జీవన ప్రమాణస్థాయిలను మెరుగుపర్చడం వంటివి ఈ ప్రాజెక్టులో లక్ష్యాలుగా తీసుకున్నారు.


 • ఈ స్కీం కింద లబ్ధి పొందాలంటే..

ప్రాజెక్టు వ్యయంలో కనీసం 10శాతం పెట్టుబడి (మార్జిన్‌ మనీ) భరించే స్థోమత ఉండాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన దివ్యాంగు లు, రిటైర్డ్‌ సైనికులకు మార్జిన్‌ మనీ 5శాతం ఉంటే చాలు. మిగిలిన మొత్తం బ్యాంకు రుణం ఇస్తారు. ఈ మొత్తం పెట్టుబడి మంజూరైన తర్వాత పెట్టుబడి రుణ మొదటి వాయిదా విడుదల చేసే ముం దు రెండు వారాల పాటు ఈడీపీ ట్రైనింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలి. దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని కూడా ఈడీపీ శిక్షణ పొందవచ్చు. 


 • ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం

ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాన్ని ఎంపిక చేసుకొని ప్రింట్‌ తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతానికి చెందిన నిరుద్యోగులైతే కేవీఐసీ, పట్టణం ప్రాంతం వారైతే డీఐసీలో వివరాలు నింపాలి. పాస్‌పోర్టు సైజు ఫొటో, ఆధార్‌ కార్డు, విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం(అవసరమైనచోట) ఈడీపీ శిక్షణ పత్రం, (రెండు వారాల శిక్షణ పూర్తిచేసుకున్న దరఖాస్తుదారులు), ప్రాజెక్టు వివరాలు, గ్రామీణ ప్రాంతమైతే గ్రామ జనాభా ధ్రువీకరణ పత్రం, వీటన్నింటినీ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేయాలి.


 • టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ద్వారా ఎంపిక

దరఖాస్తు చేసిన వారిలో లబ్ధిదారుల ఎంపిక జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ద్వారా జరుగుతుంది. పథకానికి దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా 18ఏళ్లు నిండిన వారై అలాగే విద్యార్హత కనీసం 8వ తరగతి పాసై ఉండాలి. అంతేకాకుండా ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలు, వివిధ ఇతర కేంద్ర పథకాల ద్వారా లబ్ధిపొందని వారు మాత్రమే ఇందుకు అర్హులు.


 • నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి : రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌

నిరుద్యోగ యువత ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకాన్ని వినియోగించుకోవాలి. గత ఏడాది ఉత్పత్తి పరిశ్రమకు గరిష్టంగా రూ.25లక్షలు ఉంటే.. ఈసారి 50లక్షల వరకు పెంచాం. అలాగే సేవా పరిశ్రమకు గరిష్టంగా రూ.10లక్షలు ఉంటే దానిని రూ.20లక్షలు చేశాం. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకంపై జిల్లాలో నిరుద్యోగులకు అవగాహన కల్పిస్తున్నాం. అర్హులైన నిరుద్యో గ యువత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Read more