అరకొర సిబ్బంది.. సేవల్లో జాప్యం

ABN , First Publish Date - 2022-12-13T23:36:19+05:30 IST

తాండూరు తహసీల్దార్‌ కార్యాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తుంది. సిబ్బంది పూర్తిస్థాయిలో లేక ఉన్నవారిపై పని ఒత్తిడి పెరిగింది. ప్రజలకూ సకాలంలో సేవలు అందడం లేదు. అధికారులు, సిబ్బంది చేయాల్సిన పనుల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి.

అరకొర సిబ్బంది.. సేవల్లో జాప్యం
తాండూరు రెవెన్యూ కార్యాలయం

తాండూరు రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది కొరత

పది మందికి ఐదుగురితో సరి!

డిప్యూటేషన్‌పై కొనసాగుతున్న ఆర్‌ఐ

రెవెన్యూ సేవల్లో ఆటంకం

ఇబ్బంది పడుతున్న మండల ప్రజలు

ఉద్యోగుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి ప్రజల వేడుకోలు

తాండూరు రూరల్‌, నవంబరు 13: తాండూరు తహసీల్దార్‌ కార్యాలయాన్ని సిబ్బంది కొరత వేధిస్తుంది. సిబ్బంది పూర్తిస్థాయిలో లేక ఉన్నవారిపై పని ఒత్తిడి పెరిగింది. ప్రజలకూ సకాలంలో సేవలు అందడం లేదు. అధికారులు, సిబ్బంది చేయాల్సిన పనుల్లో చాలా వరకు పెండింగ్‌లో ఉంటున్నాయి. సిబ్బంది కొరత కారణంగాను పనులు జరగడం లేదని ఉన్న సిబ్బంది అంటున్నారు. పది మంది ఉద్యోగులు చేయాల్సిన పనిని ఐదుగురే చేస్తున్నారు. వారిపై పరిభారం ఎక్కువవుతోంది. తహసీల్దార్‌ కార్యాలయంలో 10 నుంచి 12 మంది వరకు సిబ్బంది పోస్టులు ఉన్నాయి. ఆరుగురే ఉన్నారు. మండలంలోని 33 గ్రామపంచాయతీల్లో గ్రామాలు, తాండూరు మున్సిపాలిటీ 36 వార్డుల ప్రజలకు రెవెన్యూ సేవలకు తహసీల్దార్‌ ఆఫీసే దిక్కు. తహసీల్దార్‌ కార్యాలయంలో రోజూ 200 నుంచి 300 వరకు కుల, ఆదాయ సర్టిఫికెట్లకు దరఖాస్తులు వస్తుంటాయి. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ దరఖాస్తులు సైతం 300 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఫ్యామిలీ మెంబర్స్‌ సర్టిఫికెట్ల కోసం రోజూ 50మంది వరకు వస్తుంటారు. అన్నింటి విచారణకు ఆర్‌ఐపై పని ఒత్తిడి పెరిగిపోయింది. వీఆర్వో పోస్టుల రద్దుతో గ్రామస్థాయి సమాచారం కోసం వీఆర్‌ఏలపై ఆధారపడాల్సి వస్తోంది.

భూముల సర్వే కోసం రైతుల ఎదురుచూపు

తాండూరు మండలంలో భూముల సర్వేకు ఒకే సర్వేయర్‌ ఉన్నారు. వ్యవసాయ భూముల సర్వేకు దరఖాస్తు చేసుకున్న రైతులకు నెలల తరబడి సమయం పడుతోంది. ఏళ్లుగా చూస్తున్న వారూ ఉన్నారు. మండల సర్వేయర్‌ శ్రీహరినాయక్‌కు పెద్దేముల్‌ మండలాన్ని అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో రెండు మండలాల బాధ్యత ఒక్కడిపైనే పడింది. సర్వే కాక కమతాల హద్దుల విషయంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. చాలాచోట్ల గెట్టు పంచాయితీలు జరుగుతున్నాయి. ఆర్‌ఐ రాజిరెడ్డి ఒక్కరే రెవెన్యూ సంబంధిత పనులు చేస్తుండడంతో కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం అవుతోంది. మల్కాపూర్‌, సంగెంకలాన్‌, ఓగిపూర్‌, కరన్‌కోట్‌, సిరిగిరిపేట్‌, కోటబాస్పల్లి గ్రామాల్లో నాపరాతి గనులపై వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయి విచారణ, తనిఖీలకు వెళ్లాల్సి ఉంటుంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు వచ్చి న దరఖాస్తులపైనా వారి వివరాలను గ్రామాల్లో విచారణ చేయాలి. రెండో ఆర్‌ఐ ఖాజా కుల్కచర్ల మండలానికి డిప్యూటేషన్‌పై వెళ్లడంతో పనిభారమంతా ఒక్క ఆర్‌ఐపైనే పడింది. దీంతో ప్రజాసేవల్లో జాప్యం ఏర్పడుతోంది. జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఏడాదిగా ఖాళీగానే ఉన్నాయి. ఎన్నికల విధులు నిర్వహించే సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టూ ఖాళీగానే ఉంది. కీలక సహాయ గణాంక అధికారీ లేడు. జూనియర్‌ అసిస్టెంట్‌, ఒక సీనియ ర్‌ అసిస్టెంట్‌, ఒక ఆర్‌ఐ, ఒక సర్వేయర్‌తోనే కార్యాలయ నిర్వహణను నెట్టుకొస్తున్నారు. కార్యాలయంలో పనిభారం తలనొప్పిగా మారిందని సిబ్బంది పేర్కొంటున్నారు. జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా చూడాలని కోరుతున్నారు.

పని భారం పెరిగింది: రాజిరెడ్డి, ఆర్‌ఐ, తహసీల్దార్‌ కార్యాలయం

తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది తక్కువవడం వల్ల పనిభారం పెరిగింది. మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రజలు రోజూ 300 నుంచి 400 వరకు కుల, ఆదాయ సర్టిఫికెట్ల కోసం వస్తుంటాయి. ఆర్‌ఐగా నేను ఒక్కడినే విధులు నిర్వహిస్తున్నాను. దరఖాస్తుల పరిశీలనకు సమయం సరిపోవడం లేదు. దీంతో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ చేయలేకపోతున్నాను. ప్రభుత్వం త్వరగా సరి పడా సిబ్బందిని నియమిస్తే మాకు పనిభారం తప్పి ప్రజలకు సత్వర సేవలు అందుతాయి.

సిబ్బంది కొరతతో పనుల పెండింగ్‌: చిన్నప్పలనాయుడు, తహసీల్దార్‌, తాండూరు

రెవెన్యూ కార్యాలయంలో సిబ్బంది కొరతతో ఇబ్బందులు తప్పడం లేదు. తహసీల్దార్‌, డిప్యుటీ తహసీల్దార్‌, జూనియ ర్‌ అసిస్టెంట్‌, ఆర్‌ఐ నలుగురే ఉండటంతో సర్టిఫికెట్లు ఇచ్చేందుకు ఆలస్యం అవుతోంది. చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. ఉన్నవారిపై పని ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం కావాల్సిన సంఖ్యలో సిబ్బందిని కేటాయిస్తే ప్రజా సేవల్లో నెలకొన్న ఇబ్బందులు తొలగుతాయి.

Updated Date - 2022-12-13T23:36:19+05:30 IST

Read more