సర్కార్‌ భూమి..కనిపిస్తే కబ్జా!

ABN , First Publish Date - 2022-08-18T05:02:34+05:30 IST

ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.

సర్కార్‌ భూమి..కనిపిస్తే కబ్జా!

  • ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న ప్రజాప్రతినిధుల బంధువులు
  • అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణం 
  • పట్టించుకోని రెవెన్యూ అధికారులు


శంకర్‌పల్లి ఆగస్టు 17 : ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. కొందరు బడాబాబులు ఇష్టానుసారంగా సర్కార్‌ భూములను కబ్జా చేసి అక్రమ కట్టాడాలు నిర్మిస్తున్నారు. ఇంతజరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శంకర్‌పల్లి మండలంలోని పలు గ్రామాలలో రాజకీయ నాయకులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంతాన్‌పల్లి గ్రామ శివారులో 197 సర్వే నెంబర్‌లోని సుమారు 20 గుంటల భూమిని కబ్జాచేసి సర్పంచ్‌ అశ్విని సుధాకర్‌ సోదరుడు అశోక్‌ ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టినా స్థానిక నాయకులు, అధికారులు పట్టించుకోక పోవడంపై విమర్శలకు తావిస్తోంది. గతంలో 197 సర్వే నెంబర్‌లో అక్రమ నిర్మాణాలు చేపడితే అప్పటి శంకర్‌పల్లి తహసీల్దార్‌ వసంతకుమారి వాటిని కూల్చివేయించి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా వారిపై కేసు  కూడా నమోదు చేయించారు. అయినా వాటిని బేఖాతరు చేస్తూ ప్రజాప్రతినిధి బంధువు అశోక్‌ మళ్లీ ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఈ విషయం పలుమార్లు పత్రికల్లో ‘ప్రభుత్వ స్థలాలు కబ్జా’ అని కథనాలు ప్రచురితమైనా రెవెన్యూ అధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితమయ్యారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అధికారులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని తెలుస్తోంది. గ్రామపంచాయతీ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఇళ్లు నిర్మించినా సర్పంచ్‌ అశ్విని, గ్రామ కార్యదర్శి ఉమామహేశ్వరి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్‌ కుటుంబ సభ్యులకు ఒక న్యాయం.. గ్రామప్రజలకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తి సర్పంచ్‌ బంధువు కావడం వల్లనే అధికారులు, నాయకులు నోరు మెదపడం లేదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ స్థలాలను కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు నిర్మిస్తుంటే... అక్రమార్కులు కబ్జాలు చేస్తూ తమ పని తాము చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన సర్పంచులే ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేయించి అక్రమార్కులకు అండగా నిలిస్తే ఎలా అని గ్రామస్థులు నిలదీస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ స్థలాలలో మట్టిని తవ్వి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. 


ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే చర్యలు 

ప్రభుత్వ స్థలాలను కాపాడే బాధ్యత ప్రతీఒక్కరిది. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. గ్రామాలలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైతే తమ దృష్టికి తీసుకురావాలి. ప్రభుత్వ స్థలాలలో నిర్మాణాలు చేపడితే గ్రామ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలి.

- నయీముద్దీన్‌, శంకర్‌పల్లి తహసీల్దార్‌


Updated Date - 2022-08-18T05:02:34+05:30 IST