కళాశాలల గుర్తింపు ఆలస్యం!

ABN , First Publish Date - 2022-11-18T23:09:44+05:30 IST

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు గడువు ముగిసినా ఇప్పటి వరకు వికారాబాద్‌ జిల్లాలో జూనియర్‌ కళాశాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కిరాలేదు. కళాశాలలు పున:ప్రారంభమయ్యే నాటికి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికావాలి. ఆ తర్వాతనే ప్రవేశాలకు అనుమతించాల్సి ఉంది. అయితే ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ విషయంలో తీవ్ర జాప్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి.

కళాశాలల గుర్తింపు ఆలస్యం!
ఇంకా అనుబంధ గుర్తింపు రాని పెద్దేముల్‌ కేజీబీవీ జూనియర్‌ కళాశాల

విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం

వికారాబాద్‌ జిల్లాలో 17 జూనియర్‌ కళాశాలు

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర ప్రవేశాలకు గడువు ముగిసినా ఇప్పటి వరకు వికారాబాద్‌ జిల్లాలో జూనియర్‌ కళాశాల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొలిక్కిరాలేదు. కళాశాలలు పున:ప్రారంభమయ్యే నాటికి అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తికావాలి. ఆ తర్వాతనే ప్రవేశాలకు అనుమతించాల్సి ఉంది. అయితే ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ఈ విషయంలో తీవ్ర జాప్యం చేసిందనే విమర్శలు ఉన్నాయి. ప్రవేశాల షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో అనుబంధ గుర్తింపు రాని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది.

వికారాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ జిల్లాలో అనుబంధ గుర్తింపు రాని జూనియర్‌ కళాశాలల్లో ప్రైవేట్‌ కాలేజీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే గురుకుల, కేజీబీవీ కళాశాలలూ ఉన్నాయి. బోర్డు గుర్తింపు రాకుంటే ఈ కళాశాలల్లో చేరిన విద్యార్థుల అకడమిక్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. జూన్‌ ఒకటిన ఇంటర్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కాగా.. అడ్మిషన్ల గడువును ఐదు సార్లు పొడిగించారు. జిల్లాలో ఇంటర్‌ బోర్డు గుర్తింపు రాని కాలేజీల్లో చాలా వరకు మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీవే ఉన్నాయి. అగ్నిమాపక శాఖ నిరభ్యంతర సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడం, విద్యా సంవత్సరంలో ఆలస్యంగా కలాశాలలు మంజూరు కావడం ప్రధాన కారణమని తెలుస్తోంది. గురుకుల జూనియర్‌ కళాశాలల్లో అగ్నిమాపక ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ లేక, అనుమతి లేకుండా భవనాల మార్పిడి, భవనాల్లో సదుపాయాలు లేకపోవడం వంటి కారణాలున్నట్లు తెలుస్తోంది. వివిధ కారణాలతో మూడేళ్లుగా ప్రభుత్వం అనుమతుల్లో ఆలస్యం చేస్తోంది. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు చివరి నిమిషంలో షరతులతో కూడిన అనుమతిచ్చింది. ఈ ఏడాదీ అలాగే చేస్తారనే ఆశతో జూనియర్‌ కళాశాలల నిర్వాహకులున్నారు. గురుకుల సొసైటీ, ఇంటర్మీడియెట్‌ విద్యా మండలి మధ్య సమన్వయ లోపం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. ఇంటర్‌ బోర్డు నిబంధనల మేరకు జూనియర్‌ కాలేజీకి గుర్తింపు ఇవ్వాలంటే విద్యార్థులకు వసతులున్న భవనం ఉండాలి. అలాగే అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలు జారీ చేయాలి. ఇవి లేకే అనుమతులు రావడంలేదని తెలుస్తోంది.

ఆ కళాశాలలకు గుర్తింపు వచ్చేనా?

జిల్లాలో మొత్తం 76 జూనియర్‌ కళాశాలలు ఉండగా, వాటిలో ప్రభుత్వ కళాశాలలు 9, గురుకుల కళాశాలలు 2, మోడల్‌ కళాశాలలు 9, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కళాశాలలు 6, టీఎంఆర్‌జేసీ 6, టీఎ్‌సడబ్ల్యూఆర్‌జేసీ 8, టీఎ్‌సటీడబ్ల్యూజేసీ 6, కేజీబీవీ కళాశాలలు 8, ప్రైవేట్‌ కళాశాలలు 22 ఉన్నాయి. మొత్తం 76 కళాశాలల్లో 59 కళాశాలలకు అనుబంధ గుర్తింపు రాగా, 17 కళాశాలకు రాలేదు. ప్రభుత్వ, గురుకుల, మోడల్‌, మహాత్మా జ్యోతిబా పూలే, టీఎంఆర్‌జే కళాశాలలకు అనుబంధ గుర్తింపు లభించింది. కాగా, టీఎ్‌సడబ్ల్యూఆర్‌జేసీ పరిధిలో 8 కళాశాలలు ఉండగా, వాటిలో 4 కళాశాలలకు గుర్తింపు ఉండగా, కొడంగల్‌, పెద్దేముల్‌, మోమిన్‌పేట్‌, బంట్వారంలో కొత్తగా మంజూరైన 4 కళాశాలలకు గుర్తింపు రావాల్సి ఉంది. టీఎ్‌సటీడబ్ల్యూఆర్‌జేసీ ఆధ్వర్యంలో 6 కళాశాలలు ఉండగా, వాటిలో 2 కళాశాలలకు గుర్తింపు ఉండగా, కొత్తగా కులకచర్ల, కొడంగల్‌లలో ఏర్పాటైన 2కళాశాలలకు గుర్తింపు రాలేదు. 8 కేజీబీవీ కళాశాలల్లో 6 గుర్తింపు ఉండగా, ఇది వరకే ఉన్న దోమ, కొత్తగా పెద్దేముల్‌లో ఏర్పాటు చేసిన కళాశాలకు గుర్తింపు రాలేదు. 22 ప్రైవేట్‌ కళాశాలల్లో 13 కళాశాలలకు గుర్తింపు ఉండగా, 9కళాశాలలకు ఇవ్వలేదు. గుర్తింపు రాని 17 కళాశాలల్లో ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు 8, ప్రైవేట్‌ కళాశాలలు 9 ఉన్నాయి.

భవితవ్యంపై విద్యార్థుల్లో ఆందోళన

గత ఫిబ్రవరి నెలలోనే అనుబంధ గుర్తింపు కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అన్ని కళాశాలలు తమకు గుర్తింపు వస్తుందన్న ధీమాతో ప్రవేశాలు తీసుకున్నాయి. ప్రవేశాల గడువు ముగిసిన తరువాత మిక్స్‌డ్‌ అక్యూపెన్సీ ఉన్న భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలు గుర్తింపునకు నోచుకోలేవు. అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకున్న కళాశాలలకు అనుబంధ గుర్తింపునకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటుండగా, లేని కళాశాలలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రవేశాల షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో అనుబంధ గుర్తింపు రాని కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారింది. ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు వేరే కళాశాలకు చదువుకునే అవకాశం ఉండగా, విద్యార్థులు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఏ కళాశాలలో ప్రవేశం తీసుకున్నారో అదే కళాశాలలోనే తమ చదువులు కొనసాగించాల్సి ఉంటుంది. అనుబంధ గుర్తింపు రాని కళాశాలలకు షరతులతో కూడిన గుర్తింపు ఇస్తారా లేక వేరే కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పిస్తారా అనేది తెలియక విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు.

Updated Date - 2022-11-18T23:09:44+05:30 IST

Read more