గుండె చెరువు

ABN , First Publish Date - 2022-09-29T05:30:00+05:30 IST

గుండె చెరువు

గుండె చెరువు
బాలు మృతదేహంపై పడి విలపిస్తున్న తండ్రి వెంకటేశ్వర్‌రావు

  • నాటికన్‌లో గల్లంతైన విద్యార్థుల మృతదేహాల వెలికితీత   
  • శోకసంద్రంలో మృతుల కుటుంబాలు
  • శ్రమించిన పోలీసులు , మత్స్యకారులు
  • బాధితులకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ

కీసర రూరల్‌, సెప్టెంబరు 29: మేడ్చల్‌ జిల్లా కీసర మం డలం చీర్యాల్‌లోని నాటికన్‌చెరువులో గల్లంతైన యువకుల మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. చెరువు వద్ద యువకుల తల్లిదండ్రులు, బంధువుల రోదనలు చూసిన వారి హృదయాలను కలిచి వేశాయి. మృతదేహాలపై పడి రోదించారు. కాగా పోలీసులు, మత్స్యకారులు సంయుక్తంగా గంటల తరబడి అన్వేషించి మృతదేహాలను వెలికితీశారు. ఈ హృదయ విదారక సంఘటన వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని తీగల కృష్ణారెడ్డి కళాశాలలో డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉబేద్‌(18), హరిహరన్‌(18), బాలు(18) పుట్టిన రోజు వేడుక జరుపుకునేందుకని బుధవారం చీర్యాల్‌కు వచ్చి నాటికన్‌ చెరువులో గల్లంతయ్యారు. హరిహరన్‌ మృతదేహాన్ని బుధవారమే వెలికితీయగా, మిగతా ఇద్దరి కోసం అధికారులు గాలించారు. చీకటి పడటంతో గాలింపు నిలిపివేసి, గురువారం ఉదయం నుంచి వెతికారు. మత్సకారులు, పోలీసు సిబ్బంది గంటల తరబడి శ్రమించి మధ్యాహ్నం ఒంటిగంటకల్లా మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం అస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


  • శోకసంద్రంలో మృతుల కుటుంబ సభ్యులు

ముగ్గురు విద్యార్థులు నీట మునిగి మృత్యువాత పడటం స్థానికంగా విషాదాన్ని నింపింది. మృతులు ముగ్గురూ తల్లిదండ్రులకు ఏకైక కుమారులే. హరిహరన్‌ తండ్రి రామకృష్ణ ఎలక్ర్టీషియన్‌ పని చేసుకుంటూ హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ఉబేద్‌ నగరంలోని చంపాపేట్‌ వాసి. తల్లి షయనాజ్‌ డీమార్ట్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి ఖాజావలి ఫ్రైవేట్‌ ఉద్యోగి. బాలు తండ్రి వెంకటేశ్వర్‌రావు టైలర్‌. భార్య కనకదుర్గతో కలిసి అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉం టున్నారు. చెరువు నుంచి మృతదేహాలు వెలికి తీయటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. తమ కొడుకులు నీటి మునిగి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విగత జీవులుగా పడి ఉన్న తమ పిల్లలను చూసి తల్లడిల్లారు. ఉన్నత విద్య అభ్యసిం చి, మంచి జీవితాన్ని గడుపుతారనుకున్న తమ కొడుకులు చనిపోవడటాన్ని వారు తట్టులేకపోయారు.


  • ఉదయం నుంచి కొనసాగిన గాలింపు

కీసర ఇన్‌స్పెక్టర్‌ రఘువీర్‌రెడ్డి పర్యవేక్షణలో గాలింపు చర్యలు కొనసాగాయి. పోలీసులు, మత్స్యకారులు సమష్టిగా గాలింపు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఏనుగు నర్సింహారెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి పూర్ణిమ, ఆర్డీవో రవికుమార్‌ గాలింపు చర్యలను పర్యవేక్షించారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ వెంకటేష్‌, ఎంపీపీ ఇందిర, ఎంపీడీవో పద్మావతి, సర్పంచ్‌ ధర్మేందర్‌ గాలింపు చర్యల్లో పాల్గొన్నారు.


  • బాధితులకు మంత్రి మల్లారెడ్డి పరామర్శ

చెరువులో పడి విద్యార్థులు చనిపోవడం పట్ల కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చెరువును మంత్రి మల్లారెడ్డి, అదనపు కలెక్టర్‌ నర్సింహారెడ్డి సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చారు. మంత్రి మాట్లాడుతూ.. చెరువులో పడి ఉబేద్‌, బాలాజీ, హరిహరన్‌ చనిపోవడం బాధాకరం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెరువుల వద్ద తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. నాటికన్‌ చెరువుకు కంచె ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని సూచి ంచారు. రెండు రోజులుగా శ్రమించి మృతదేహాలను వెలికితీసిన అధికారులను, ప్రజాప్రతినిధిలకు, ఈతగాళ్లకు, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందం సేవలను మంత్రి అభినందించారు.

Read more