బ్యాక్టీరియాతో లాభసాటి సాగు

ABN , First Publish Date - 2022-12-06T23:43:23+05:30 IST

మోతాదుకు మించి భాస్వరం వినియోగంతో నేలలు నిస్సారమై సూక్ష్మపోషకాలందక నష్టాలకు గురవుతున్న రైతులకు శాస్త్రవేత్తలు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాపై అవగాహన కల్పిస్తున్నారు.

బ్యాక్టీరియాతో లాభసాటి సాగు
బ్యాక్టీరియా, పశువుల ఎరువు మిశ్రమాన్ని తయారుచేస్తున్న వ్యవసాయాధికారులు(ఫైల్‌)

భాస్వరం కరిగించేలా సేంద్రియ విధానం

తగ్గిన రసాయన ఎరువుల వినియోగం

తగ్గనున్న సాగు ఖర్చులు

మంచాల, డిసెంబర్‌ 6 : మోతాదుకు మించి భాస్వరం వినియోగంతో నేలలు నిస్సారమై సూక్ష్మపోషకాలందక నష్టాలకు గురవుతున్న రైతులకు శాస్త్రవేత్తలు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాపై అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రయోగాలు ఫలితాలను ఇస్తున్నాయని రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంచాల మండలంలో రైతులు డెయిరీ, పౌల్ర్టీని వ్యవసాయ అనుబంధంగా కొనసాగిస్తున్నారు. మండలంలో 23వేల ఎకరాల భూమి సాగుకు అనువుగా ఉంది. ఎక్కువ భాగం వరి, మిగతా కూరగాయ, ఆకుకూర పంటలు సాగుచేస్తున్నారు.

తప్పిన రసాయన ఎరువుల వ్యయం

రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగంతో దిగుబడి రాకపోగా పెట్టుబడి ఖర్చులతో రైతులు నష్టపోతున్నారు. సమస్యపై అధ్యయనం చేసిన వ్యవసాయాధికారులు భూసార పరీక్షలు చేసి భాస్వర శాతం ఎక్కువున్నట్టు గుర్తించారు. భూమిలో కరగని భాస్వరాన్ని కరిగించేలా చేస్తే ఫలితాలుంటాయని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండల వ్యాప్తంగా 70 మంది రైతులను చైతన్యపరిచి 300 ఎకరాల్లో భాస్వరం కరిగించే బ్యాక్టీరియాను ఉపయోగించారు. దీంతో రైతులకు కాంప్లెక్స్‌, రసాయన ఎరువుల వాడకం తగ్గింది. సాగు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగాయి.

దిగుబడులు బాగున్నాయి : బాలయ్య, రైతు, నోముల

అధికారుల సూచనల మేరకు ఎకరాకు కిలో చొప్పున భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాను 50కిలోల పశువుల ఎరువులో కలిపి ఐదు రోజులు మగ్గబెట్టాం. ఈ మిశ్రమాన్ని వరి నాటిన 5రోజులకు పొలంలో చల్లాం. అనంతరం 25కిలోల యూరియా వెదజల్లాం. దీంతో నాకు 29క్వింటాళ్ల వడ్లు పండాయి. ఈ విధానంతో నాకు ఎకరానికి 2వేల రసాయన ఎరువుల ఖర్చు తగ్గింది.

పెట్టుబడి ఖర్చులు తగ్గాయి : ముత్యమయ్య బుచ్చయ్య, ఎల్లమ్మతండా

ఇది వరకు ఎకరం వరికి బస్తా గ్రోమోర్‌, డీఏపీ వాడేవారం. భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వేయడంతో ఎకరానికి 10కిలోల కాంప్లెక్స్‌ ఎరువు మాత్రమే వాడాం. దీంతో మాకు సాగు ఖర్చులు తగ్గాయి. అలాగే పంట దిగుబడి కూడా పెరిగి రెండు విధాలా లాభపడ్డాం.

రైతులందరూ ఈ పద్ధతిని పాటించాలి : జ్యోతిశ్రీ, ఏఓ, మంచాల

భాస్వరం కరిగించే బ్యాక్టీరియా వినియోగంతో రైతు లకు ఎక్కువ ప్రయోజనం ఉంది. అలాగే నేల నిస్సారం కాకుండా ఉంటుంది. రైతులందరూ ఈ విధానాన్ని తప్పక పాటించాలి.

Updated Date - 2022-12-06T23:43:24+05:30 IST