తొలి విడతకు సిద్ధం!

ABN , First Publish Date - 2022-12-02T00:19:14+05:30 IST

పేదోడి సొంతింటి కల నెరవేరబోతోంది. పక్కా ఇల్లు లేని వారు సంక్రాంతికి డబుల్‌ బెడ్‌ రూం ఇంటిలోకి అడుగు పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

తొలి విడతకు సిద్ధం!
షాద్‌నగర్‌లో పంపిణీకి సిద్ధమైన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

నెరవేరనున్న పేదోడి సొంతింటి ’కల’

ఇళ్ల కేటాయింపునకు యుద్ధప్రాతిపదికన చర్యలు

ఈ నెల 7 నుంచి గ్రామ సభలు

సంక్రాంతి కానుకగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ

పేదోడి సొంతింటి కల నెరవేరబోతోంది. పక్కా ఇల్లు లేని వారు సంక్రాంతికి డబుల్‌ బెడ్‌ రూం ఇంటిలోకి అడుగు పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికోసం అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. లబ్ధిదారులను ఎంపిక కోసం అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. గ్రామ సభలు నిర్వహించి పారదర్శకంగా పేదలకు ఇళ్లను అందించాలని ప్రణాళిక రూపొందించారు.

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబరు 1 : డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వీటి నిర్మాణ పనుల్లో వేగం పెంచింది. తుది దశలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసే దిశగా ముందుకెళ్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిని సంక్రాంతి కానుకుగా లబ్ధిదారులకు కేటాయించాలని నిర్ణయించింది. జనవరి 15న డ్రా పద్ధతిన అర్హులకు కేటాయించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారులు లక్ష్య సాధన కోసం రంగంలోకి దిగారు. ముఖ్యంగా చివరిదశలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేయడంపై ఫోకస్‌ పెట్టారు. సంక్రాంతి రోజున డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు ప్రణాళిక రూపొందించారు. పక్కా ఇల్లు లేని పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకాన్ని ప్రవేశ చేపట్టింది. గ్రామాల్లో ఒక్కో బెడ్‌రూం ఇల్లును రూ.2.04 లక్షలు వెచ్చించి నిర్మించేందుకు నిర్ణయించింది. మౌలిక వసతుల కల్పన కోసం అదనంగా నిధులు వెచ్చిస్తోంది.

జిల్లాలో 2,445 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తయ్యాయి. ఇళ్ల వద్దకు రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తిచేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. 2023 జనవరి 15వ తేదీలోగా చిన్నచిన్న పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా, దారిద్య్రరేఖకు దిగువ ఉండి తెల్లరేషన్‌ కార్డు కలిగి, అద్దె ఇంట్లో నివసిస్తున్న వారిని అర్హులుగా గుర్తించనున్నారు. ముందుగా గ్రామ సభలు, వార్డుసభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వచ్చిన దరఖాస్తులను తహసీల్దారులకు పంపించున్నారు. క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను జిల్లా కలెక్టర్‌కు పంపించనున్నారు. ప్రస్తుతం కట్టిన ఇళ్ల కంటే.. అర్హులైన లబ్ధిదారులు ఎక్కువగా ఉంటే లక్కీడీప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. మిగిలిన వారి జాబితాను వెయిటింగ్‌ లిస్టులో పెట్టనున్నారు.

కేటాయింపు ఇలా..

గ్రామీణ ప్రాతంలో.. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, మిగిలిన వారికి 7 శాతం కేటాయిస్తారు.

పట్టణ ప్రాంతాల్లో ఎస్సీలకు 17 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనార్టీలకు 12 శాతం కేటాస్తారు.

శారీర వికలాంగులకు 5 శాతం, మాజీ సైనికులకు 2 శాతం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తారు.

లబ్ధిదారుల ఎంపికకు గ్రామ, నగర సభలు

లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూంలను కేటాయించేందుకు ఈనెల 7వ తేదీ నుంచి గ్రామ, నగర సభలను నిర్వహించనున్నారు. 7న జిల్లాలో మొదటి గ్రామ, నగర సభను నిర్వహిస్తారు. అదే రోజున టీం విచారణ ఉంటుంది. 7, 8వ తేదీల్లో శిక్షణ, 9వ తేది నుంచి 21వ తేది వరకు ఇంటింటి సర్వే ఉంటుంది. 22వ తేదీన అర్హుల జాబితా తయారు చేస్తారు. 28న రెండో గ్రామ, నగర సభను ఏర్పాటు చేస్తారు. 29వ తేదీన అర్హులైన లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. రెండో అర్హులుగా ఎన్నికైన లబ్ధిదారుల జాబితాను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తారు. 31వ తేదీన ఫాం-4 నింపడం, కంప్యూటీకరణ చేస్తారు. జనవరి ఒకటో తేదీన బ్లాక్‌, ప్లాట్స్‌లను అర్హులకు అందజేస్తారు.

మిగతావి ఎప్పుడో..?

తెలంగాణ ప్రభుత్వం 2015-16 సంవత్సరంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయించింది. రంగారెడ్డి జిల్లాకు 6,777 గృహాలు కేటాయించింది. ఇందుకుగాను 274.35 ఎకరాల భూమిని సేకరించింది. 6,637 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందుకోసం 97,623మంది మీసేవలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన ఇళ్లలో 6,175 ఇళ్లకు టెండర్లు పిలిచారు. పెరిగిన స్టీల్‌, సిమెంట్‌, ఇసుక, ఇటుక ధరల కారణంగా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పలు మార్లు టెండర్లు పిలిచారు. బిల్లులు సకాలంలో అందివ్వక పోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయకుండా చేతులెత్తేశారు. ఏడేళ్ల తర్వాత 2,445 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటిని తొలివిడతగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. కాగా మిగతా ఇళ్లు ఎప్పుడు పూర్తవుతాయి? మలి విడత ఎప్పుడు పంపిణీ చేస్తారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

లబ్ధిదారులకు జనవరి 15 వరకు కేటాయిస్తాం

జనవరి 15వ తేదీ వరకు అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటాయిస్తాం. ఇందుకు సంబంధించి ఈనెల 7వ తేది నుంచి గ్రామసభలను నిర్వహిస్తున్నాం. జిల్లాలో షాద్‌నగర్‌, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో 2,445 డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. పూర్తయిన వాటికి 5,380 దరఖాస్తులు వచ్చాయి. రోడ్లు, విద్యుత్‌, తాగునీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి రూ.20కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం రూ.9 కోట్లు మంజూరు చేసింది.

- రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి

నియోజకవర్గాల వారీగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వివరాలు

నియోజకవర్గం పూర్తయిన ఇళ్లు వచ్చిన దరఖాస్తులు

షాద్‌నగర్‌ 1,880 1,957

ఇబ్రహీంపట్నం 335 1,413

చేవెళ్ల 100 855

రాజేంద్రనగర్‌ 130 1,155

జిల్లాలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల తీరు ఇలా..

గ్రామీణ ప్రాంతంలో కేటాయించినవి : 3,977

మున్సిపాలిటీ పరిధిలో కేటాయించినవి : 2,800

మొత్తం : 6,777

డబుల్‌’కు సేకరించిన భూమి : 274.35 ఎకరాలు

మంజూరైన గృహాలు : 6,637

టెండర్‌ పిలిచినవి : 6,175

టెండర్‌ ఆమోదించినవి : 2,836

నిర్మాణం పూర్తయినవి : 2,445

మొత్తం వచ్చిన దరఖాస్తుల సంఖ్య : 97,623

పూర్తయిన గృహాలకు వచ్చిన దరఖాస్తులు : 5,380

Updated Date - 2022-12-02T00:19:16+05:30 IST