ధాన్యం సేకరణకు సన్నాహాలు

ABN , First Publish Date - 2022-10-12T05:11:22+05:30 IST

జిల్లాలో వానాకాలం వరి కోతలు కోసే సమయం దగ్గర పడుతుంది.

ధాన్యం సేకరణకు సన్నాహాలు

  • జిల్లాలో 1,13,661 ఎకరాల్లో వరి సాగు
  • దిగుబడి అంచనా 2.84 మెట్రిక్‌ టన్నులు
  • నవంబరు చివరి వారం నుంచి కొనుగోళ్ల అంచనా
  • 41 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక


జిల్లాలో వానాకాలం వరి కోతలు కోసే సమయం దగ్గర పడుతుంది. దీంతో ధాన్యం కొనుగోళ్లకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. రైతుల నుంచి పంటను సేకరించడంపై దృష్టి సారించింది. పంట సాగుకు అనుగుణంగా జిల్లాలో 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వానాకాలం సాగులో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధిక వర్షాలతో నాట్లు కొంత ఆలస్యమైనా అంచనాకు మించి వరి సాగు చేశారు. భారీ వర్షాలు పంటలపై ప్రభావం చూపినా అనుకున్న మేరకు దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనాలు వేసింది. ఈ వానాకాలం సీజన్‌కు సబంధించిన ధాన్యం కొనుగోళ్లపై జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేపట్టింది. జిల్లా దిగుబడి అంచనాలపై వానాకాలం ధాన్యం కొనుగోలు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసింది. ఈ సారి (2022 వానాకాలం) వరి సాగును తగ్గించి.. పత్తి, కంది సాగుతోపాటు చిరు ధాన్యాల సాగును పెంచాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి 75,000 ఎకరాల్లో సాగు అంచనాను నిర్ణయించారు. కానీ.. 1,13,661 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. జిల్లాలో సాగు అంచనాకు మించి సాగైంది. దీని ప్రకారం పౌరసరఫరాల అధికారులు 2.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో రైతులు అవసరాల కోసం, సీడ్‌ కోసం కొంత ధాన్యం ఉంచుకోగా మిగిలిన 90,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు వస్తుందని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నవంబరు రెండో వారంలో వరి కోతలు ప్రారంభం కావచ్చని, అదే సమయంలో ధాన్యం సేకరించాలని నిర్ణయించారు. 

అవసరం కానున్న గన్నీ బ్యాగులు : 22.50 లక్షలు

ధాన్యం సేకరించేందుకు 22.50 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 13 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 9లక్షల 50 వేల గన్నీ బ్యాగులు అవసరం కానున్నాయి. గత ఏడాది మాదిరిగా ఈ సారి గన్నీ బ్యాగుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


పెరిగిన మద్దతు ధర

గత వానాకాలం, యాసంగిని పోల్చుకుని చూస్తే ఈ సారి వరి ధాన్యం క్వింటాకు రూ.72 పెరిగింది. గత ఏడాది గ్రేడ్‌-ఏ రకం క్వింటాకు రూ.1,888, కాగా సాధారణ రకం క్వింటాకు రూ.1,868 మద్దతు ధర చెల్లించారు. ఈ సారి క్వింటాకు గ్రేడ్‌ ఏ రకానికి రూ. 1,960, సాధారణ రకానికి రూ. 1,940 మద్దతు ధర ప్రభుత్వం చెల్లిస్తుంది. 


గతేడాది ఆలస్యం

జిల్లాలో 2021-22 సంవత్సరం వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ఆలస్యం జరిగింది. ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదం తేలకపోవడంతో ధాన్యం కొన్నిచోట్ల వానకు తడుస్తూ, ఎండకు ఎండింది. చివరకు రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు ధాన్యం అమ్ముకున్నారు. 


కొనుగోలు కేంద్రాలు

ఐకేపీ : 03

పీఏసీఎస్‌ : 29

డీసీఎంఎస్‌ : 06

ఎఫ్‌ఎస్‌సీఎస్‌ : 02

ఎఎమ్‌సీ : 01

మొత్తం : 41


మద్దతు ధర ఇలా (క్వింటాకు)

రకం 2020-21 2021-22

గ్రేడ్‌-ఎ రకం 1,888 రూ. 1,960

సాధారణ రకం 1,868 రూ. 1,940


వానాకాలం సాగు వివరాలు (ఎకరాల్లో)

సంవత్సరం సాధారణ సాగు సాగైంది

2020-21 46,555 35,550

2021-22 45,573 1,29,215

2022-23 75,000 1,13,661


గత ఐదు వానాకాలం సీజన్లలో ఆశించిన, సేకరించిన ధాన్యం వివరాలు (మెట్రిక్‌ టన్నుల్లో)

సంవత్సరం ధాన్యం సేకరణ సేకరించిన 

అంచనా ధాన్యం

2018-19 26,775 8,205.040

2019-20 33,602 6,676.360

2020-21 1,57,558 11,200.600

2021-22 2,89,092 43,564.360

2022-23 2,84,000 --





Updated Date - 2022-10-12T05:11:22+05:30 IST