అకాల వర్షం.. ఆగమాగం

ABN , First Publish Date - 2022-05-19T05:12:37+05:30 IST

అకాల వర్షం.. ఆగమాగం

అకాల వర్షం.. ఆగమాగం
బొంరా్‌సపేట్‌లో టార్పలిన్‌లపై నిలిచిన నీటిని ఎత్తిపోస్తున్న రైతు


  • వికారాబాద్‌ జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం
  • రెండు రోజులుగా తడిసిన ధాన్యం కుప్పలు.. 
  • లబోదిబోమంటున్న అన్నదాతలు

పెద్దేముల్‌/తాండూరురూరల్‌/ధారూరు/మోమిన్‌పేట, మే 18: వికారాబాద్‌ జిల్లాలో అకాల వానలు  రైతుల గుండెల్లో దడ పుట్టిస్తుంది.  రెండు రోజులుగా జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. బొంరా్‌సపేట మండలంలో మంగళవారం రాత్రి, బుధవారం కురిసిన భారీ వర్షానికి మెట్లకుంట, బురాన్‌పూర్‌, బొంరా్‌సపేట్‌తో పాటు నాగిరెడ్డిపల్లి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. టార్పలిన్లను రైతులు ధాన్యం రాశులపై కప్పినా వడ్ల రాశుల కిందకు నీరు చేరడంతో లబోదిబోమంటున్నారు.  ఇటు కొనుగోలు సజావుగా సాగక, వర్షానికి ధాన్యాన్ని కాపాడుకోలేక రైతులు సతమతం అవుతున్నారు. ధాన్యపు కుప్పలు తడిసిపోయాయి. కాగా బొంరా్‌సపేట్‌లో ఐదు ధాన్యం కేంద్రాలు వారం రోజుల క్రితం తెరుచుకున్నా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో పంట వివరాలు నమోదు కాలేవంటూ వ్యవసాయ శాఖ అధికారులు టోకెన్లు ఇవ్వకపోవడంతో కొనుగోళ్లు సజావుగా కొనసాగడం లేదు. కేంద్రాలు తెరుచుకున్నా మెట్లకుంట ఐకేపీ కేంద్రంలో మాత్రమే ఓలోడ్‌ ధాన్యాన్ని మిల్లర్లకు తరలించారు. మిగతా కేంద్రాల్లో తూకాలు వేయడం  లేదు. పెద్దేముల్‌ మండలంలో రెండురోజులుగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో  రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్దేముల్‌ మండలంలో వరికోతలు జోరుగా సాగుతున్నాయి.రాశులు చేసిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకునేందుకు పొలల్లో అవకాశం లేక రోడ్లపై ఆరబోశారు. దీంతో మంగళ, బుధవారాల్లో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయింది. తాండూరు మండల పరిధిలోని బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, కోటబాస్పల్లి, కరన్‌కోట్‌, జినుగుర్తి, ఐనెల్లి, మల్కాపూర్‌, రాంపూర్‌, రాంపూర్‌మీది తండా తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడా వాన పడగా  రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరబెట్టినే వరి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మోమిన్‌పేటలో కురిసిన ఆకాల వర్షానికి ఉల్లి, మొక్క జొన, జొన్న రైతులు పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు.  

చిన్న గాలివానకే నిలిచిపోతున్న విద్యుత్‌ సరఫరా

 ధారూరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ సరపరా ఆయారాం గయారాంగా మారింది. గాలి చినుకు ప్రారంభమైన తడువే విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్నారు. మండలకేంద్రంలో నాలుగు రోజలుగా విద్యుత్‌ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. చిన్న వర్షం పడినా, గాలి వీచినా  రాత్రంతా విద్యుత్‌ సరఫరాను  ఆపేస్తున్నారు.  బుధవారం కురిసిన చిన్న గాలివానకే విద్యుత్‌ సరఫరా నిలిపివేసి సాయంత్రం వరకూ పునరుద్ధరించలేదు.  పెద్ద లైన్లలో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల పై నుంచే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. తాండూరు నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే ప్రత్యామ్నాయంగా వికారాబాద్‌ నుంచి విద్యుత్‌ సరపరా చేసేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-19T05:12:37+05:30 IST