వైకల్యాన్ని జయించి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి

ABN , First Publish Date - 2022-09-14T05:15:27+05:30 IST

ఆమె పేద గిరిజన విద్యార్థిని. ఆపై దివ్యాంగురాలు. ఐతేనేమి..

వైకల్యాన్ని జయించి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి
తల్లిదండ్రులతో విద్యార్థిని ఉమేశ్వరి

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ జాతీయ స్థాయిలో మెరిసిన గిరిజన ఆణిముత్యం 
  • టీడబ్ల్యూడీ విభాగంలో జాతీయస్థాయి రెండో ర్యాంక్‌ సాధించిన ఉమేశ్వరి


కడ్తాల, సెప్టెంబరు 13 : ఆమె పేద గిరిజన విద్యార్థిని. ఆపై దివ్యాంగురాలు. ఐతేనేమి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తాచాటింది. టీడబ్ల్యూడీ విభాగంలో జాతీయస్థాయిలో రెండోర్యాంకు సాధించింది కడ్తాల మండలం పెద్దవేములోని బావితండాకు చెందిన రమావత్‌ ఉమేశ్వరి. వివరాల్లోకి వెళితే.. తండాకు చెందిన రమావత్‌ రవీందర్‌నాయక్‌-లలిత దంపతులకు నలుగురు సంతానం. వారిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో ముగ్గురు దివ్యాంగులు. పెద్దమ్మాయి ఉమేశ్వరి. రవీంద్రనాయక్‌ వ్యవసాయం, ఫంక్షన్‌ హాల్‌లో డెకరేషన్‌ పనిచేస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. పిల్లలు కూడా కష్టపడి చదివారు. వారి చదువులకు రవీంద్రనాయక్‌ ఆటంకం రాకుండా చూశాడు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన ఉమేశ్వరి చిన్నతనం నుంచే శ్రద్ధగా చదివింది. ఉత్తమ ఫలితాలు సాధించింది. కడ్తాలలోని ప్రగతి పాఠశాలలో టెన్త్‌ చదివి 10జీపీఏ సాధించింది. కల్వకుర్తి గిరిజన గురుకులంలో ఇంటర్‌ చదివింది. ఎంపీసీలో 942 మార్కులు సాధించింది. ఇటీవల వెలువడిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో జాతీయ స్థాయిలో ఎస్టీ విభాగంలో రెండో ర్యాంక్‌ సాధించింది. ఐఐటీ మద్రా్‌సలో సీటు వచ్చే అవకాశం ఉందని ఉమేశ్వరి తెలిపింది. జాతీయ స్థాయి ర్యాంక్‌ తన లక్ష్యంలో మొదటి అడుగేనని, తాను జీవితంలో ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని పేర్కొంది. తనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని తెలిపింది. వారి కలలను సాకారం చేస్తానని విద్యార్థిని విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.



Updated Date - 2022-09-14T05:15:27+05:30 IST