ప్రతిపాదనతోనే సరి!

ABN , First Publish Date - 2022-08-01T05:39:24+05:30 IST

ప్రతిపాదనతోనే సరి!

ప్రతిపాదనతోనే సరి!
ప్రహరీలేని ఆమనగల్లు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల

  • ప్రహరీ నిర్మాణం ఎప్పుడో ?


ఆమనగల్లు, జూలై 31: ఆమనగల్లు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు ప్రహరీ లేక  విద్యార్థినులు, ఉపాధ్యాయినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రహరీ నిర్మాణ విషయంలో ఎవరూ చొరవ చూపడం లేదు. కాంపౌండ్‌ వాల్‌ కట్టించాలని ఏళ్లుగా బాలికలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వం, ప్రజాప్రతినిఽధులను కోరుతున్నా స్పందన లేదు. ఇక్కడి కస్తూర్బా బాలికల విద్యాలయంలో 6 నుంచి 10 తరగతుల్లో 260మంది బాలికలు చదువుతున్నారు. పట్టణానికి చివరగా హైదరాబాద్‌ రోడ్డుకు సమీపంలో ఉన్న కేజీబీవీకి ప్రహరీ నిర్మాణం గురించి విద్యార్థి సంఘాల నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు మంత్రులు, ఉన్నతాధికారులకు విన్నవించినా దాని కోసం నిధులు మంజూరు కావడం లేదు. ప్రహరీ లేక పాఠశాల ఆవరణలో పశువులు, కుక్కలు, పందులు సంచరిస్తున్నాయి. ప్రాంగణంలో నాటిన మొక్కలకూ రక్షణ లేకుండా పోతోంది. విద్యార్థినులు ఆరుబయట ఆడుకోవడానికి ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా ప్రహరీ నిర్మించి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థినులు కోరుతున్నారు. అదేవిధంగా  పాఠశాలలో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ కూడా లేదు. గతంలో వాటర్‌ప్లాంట్‌ మంజూరైనా నీటి వసతి లేదని దాన్ని పక్కనపెట్టారు. ఏళ్లుగా వాటర్‌ ప్లాంట్‌ కూడా మూలన పడింది. పాఠశాలలో డ్రైనేజీ వ్యవస్థ పాడైంది. పాఠశాలలో నెలకొన్న సమస్యలతో విద్యార్థినుల చదువుపై ప్రభావం చూపుతోంది. అన్ని కేజీబీవీల్లో వసతులతో ఎంతో కొంత సౌకర్యవంతంగా ఉన్నా ఆమనగల్లు బాలికల విద్యాలయాన్ని మాత్రం సంక్షేమ, విద్యా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని ప్రహరీ నిర్మాణంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం : పద్మజ్యోతి, ప్రత్యేకాధికారి, కేజీబీవీ,ఆమనగల్లు 

ఆమనగల్లు కస్తూర్భాగాంఽధీ విద్యాలయంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రధానంగా పాఠశాల ప్రహరీ నిర్మాణానికి నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపాం. సమస్యను ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా ప్రహరీ నిర్మించేలా చూస్తాం. ఆర్వో ప్లాంట్‌ ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం.

Read more