నోటీసులు.. జరిమానాలు

ABN , First Publish Date - 2022-09-29T05:16:27+05:30 IST

వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో అనుమతులు, మౌలిక వసతులు లేకుండానే నిర్వహిస్తోన్న ఆసుపత్రులు, పాలీక్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌, ఫిజియోథెరపీ కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తోన్నారు.

నోటీసులు.. జరిమానాలు
వికారాబాద్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిని సీజ్‌ చేస్తున్న డీఐవో డాక్టర్‌ జీవరాజ్‌ (ఫైల్‌)

  • అనుమతులు లేని ఆసుపత్రులపై కొరడా
  • నిబంధనలకు విరుద్ధంగా ఆస్ప త్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు 
  • తనిఖీల్లో గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 

 వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో  అనుమతులు, మౌలిక వసతులు లేకుండానే  నిర్వహిస్తోన్న ఆసుపత్రులు, పాలీక్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌, ఫిజియోథెరపీ కేంద్రాలపై  వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తోన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాటిని సీజ్‌ చేస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ రోగుల నుంచి ఫీజులు ముక్కు పిండి వసూలు  చేస్తున్న వాటికి నోటీసులు ఇస్తున్నారు.  జరిమానాలు విధిస్తున్నారు.   పది రోజుల వ్యవధిలో అన్నింటినీ తనిఖీ చేసి నివేదికలు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో తనిఖీలు ముమ్మరం చేశారు. 

వికారాబాద్‌/మేడ్చల్‌, సెప్టెంబరు28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  వికారాబాద్‌ జిల్లాలో  నిబంధనలకు విరుద్ధంగా, సరైన అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్న ప్రైవేట్‌ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు చెక్‌ పెట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను సీజ్‌ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే. తెలంగాణ క్లినికల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్‌ యాక్ట్‌ (రిజిస్ట్రేషన్‌ రెగ్యులేషన్‌) -2010 ప్రకారం జిల్లాలోని ప్రైవేట్‌ ఆసుపత్రులు, క్లినిక్‌లు, కన్సల్టేషన్‌ రూములు, పాలీక్లినిక్‌లు డయాగ్నోస్టిక్‌ కేంద్రాలు, ఫిజియోథెరపి కేంద్రాలు, డెంటల్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించాలని ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో సరైన అనుమతులు, కనీస మౌలిక వసతులు లేకుండానే ఆసుపత్రులు, పాలీక్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌, ఫిజియోథెరపి కేంద్రాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అవసరమైన వైద్య పరికరాలు లేకుండా, పారిశుద్ధ్య లోపం, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణ లేకుండా నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పాల్మన్‌కుమార్‌ నేతృత్వంలో ప్రోగ్రాం అఽధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, బృందాలుగా వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు, పరికరాలు, మందులు, వైద్య సిబ్బంది, రోగులకు వైద్య సేవలు అందించే డాక్టర్లు, సిబ్బందికి సరైన అర్హతలు, శిక్షణ పొంది ఉండాలి. క్లినిక్‌లు, పాలీ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లు కచ్చితమైన ప్రమాణాలు పాటించాల్సి ఉండగా ఉల్లంఘిస్తున్నాయి. 

ఈనెలాఖరు వరకూ తనిఖీలు

ఈనెల 21వ తేదీలోగా  తనిఖీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో 128 ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లు, డెంటల్‌ ఆసుపత్రులు ఉండగా, ఈనెల 22వ తేదీ, గురువారం ప్రారంభమైన తనిఖీలు  సోమవారం కూడా కొనసాగాయి.  ఐదు రోజుల్లో జిల్లాలో 109 ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లు, పాలీ క్లినిక్‌లను తనిఖీ చేయగా, వాటిలో ఏడింటిని సీజ్‌ చేశారు. ఎనిమిదింటికి జరిమానా విధించగా, 16 షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. 14కు జరిమానా విధించడంతో పాటు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. కాగా, సీజ్‌ చేసిన వాటిలో నాలుగు ఆసుపత్రులు, ఒక స్కానింగ్‌ సెంటర్‌, ఒక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌,  ఒక పాలీ క్లినిక్‌ ఉన్నాయి.  

 తనిఖీలు లేకనే ఉల్లంఘనలు

వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల ప్రకారం జిల్లాలో ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లు, పాలీ క్లినిక్‌లను ప్రతి మూడు నెలలకు ఒకసారి వైద్య ఆరోగ్య శాఖ అఽధికారులు తనిఖీ చేయాలి. నిబంధనలకు విరుద్ధ్దంగా ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లు, పాలీ క్లినిక్‌లు కొనసాగితే వాటిని వెంటనే సీజ్‌ చేయాలి. లేదా నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలి. అయితే జిల్లాలో అధికారులు తనిఖీలు అటకెక్కించడంతో ప్రైవేట్‌ ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌, స్కానింగ్‌ సెంటర్లు ఇషారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షలకు ఇష్టారాజ్యంగా రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు డాక్టర్లు తమ క్లినిక్‌లకు వచ్చే రోగుల రక్త నమూనాలు తీసుకుని వారే పరీక్షలు చేయించి రిపోర్టుల ఆధారంగా చికిత్సలు చేస్తున్న విషయం తెలిసిందే. 

మేడ్చల్‌ జిల్లాలో విస్తృతంగా..

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లఓ జిల్లా వైద్యాధికారులు విస్త్రత తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,524 ప్రైవేటు ఆసుపత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు  ఉన్నాయి. జిల్లా వైద్యాధికారి పుట్ల  శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఐదు బృందాలు జిల్లాలో తనిఖీలు చేపట్టాయి. ఇప్పటి వరకు 240 ప్రైవేటు క్లినిక్‌లను తనిఖీ చేసి రెండింటిని సీజ్‌ చేశారు. మరో 25 క్లినిక్‌లకు నోటీసులు అందజేశారు. రిజిస్టర్‌ చేసుకోడాకుండా ఆసుపత్రులు నడిపించడం, ఎంబీబీఎస్‌ పేరిట రిజిస్టర్‌ చేసుకుని ఇతర వైద్యులచే క్లినిక్‌ల నిర్వహణ, తదితర విషయాలపై జిల్లా వైద్యాధికారులు ఫోకస్‌ పెట్టారు. 

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : పుట్ల శ్రీనివాస్‌, డీఎంహెచ్‌వో, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి

ప్రభుత్వ ఆదేశాల మేరకు నిబంధనలు పాటించని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తప్పవు. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. కొన్ని డయాగ్నస్టిక్‌ సెంటర్లలో కనీస సౌకర్యాలు కూడా లేవు. అదే విధంగా ఎంబీబీఎస్‌ వైద్యుడి పేరిట రిజిస్ట్రర్‌ చేసుకుని అలోపతి వైద్యం నిర్వహిస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత నివేదికను కలెక్టర్‌కు పంపించి తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

 రిజిస్ట్రేషన్‌ ఒకరిది.. వైద్యం చేసేది మరొకరు : డాక్టర్‌ పాల్వన్‌కుమార్‌, డీఎంహెచ్‌వో, వికారాబాద్‌

నిబంధనలకు విరుద్ధంగా కొనసాగే వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. చిన్నపాటి లోపాలు ఉన్నా నోటీసులు జారీ చేస్తున్నాం. ఒకరిపై రిజిస్ట్రేషన్‌ ఉంటే మరొకరు వైద్యం చేస్తున్నట్లు తనిఖీల్లో తెలిసింది. ఆర్‌ఎంపీలు, పీఎంపీలు ఫస్ట్‌ ఎయిడ్‌ మాత్రమే చేయాలి. ఎలాంటి వైద్య చికిత్సలు అందించేందుకు వారికి అనుమతి లేకున్నా చేస్తున్నారు. ఆసుపత్రులకు ప్రసవానికి వచ్చే  గర్భిణులకు సాధారణ ప్రసవమయ్యేందుకు అవకాశం ఉన్నా.. కొందరు సిజేరియన్‌ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. ఈ వైఖరి మారాలి. సాధారణ ప్రసవాలు పెరిగేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. 

Read more