నిర్లక్ష్యంలో నిజాం ఫిరంగి

ABN , First Publish Date - 2022-02-20T04:56:01+05:30 IST

ప్రజల కోసమే పనిచేస్తున్నామని పాలకులు చెబుతున్నా.. అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా ప్రజల కష్టాలు మాత్రం పోవడం లేదు. జిల్లాలో స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించు కోవడంలో పాలకులు శ్రద్ధ కనబర్చడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఫిరంగి నాలా కాల్వ అనేకచోట్ల కబ్జాచేసి వాటిని వెంచర్లుగా మార్చి అమ్ముతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నిర్లక్ష్యంలో నిజాం ఫిరంగి

  • కబ్జాలకు గురవుతున్న ఫిరంగి కాలువ
  • పట్టించుకోని అధికారులు, పాలకులు
  • మరమ్మతులు చేస్తే వేల ఎకరాలు, వందల గ్రామాలకు సాగు, తాగు నీరు


 ప్రజల కోసమే పనిచేస్తున్నామని పాలకులు చెబుతున్నా.. అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు మారినా.. పాలకులు మారినా ప్రజల కష్టాలు మాత్రం పోవడం లేదు. జిల్లాలో స్థానికంగా ఉన్న నీటి వనరులను వినియోగించు కోవడంలో పాలకులు శ్రద్ధ కనబర్చడం లేదన్న  విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.  ఫిరంగి నాలా కాల్వ అనేకచోట్ల కబ్జాచేసి వాటిని వెంచర్లుగా మార్చి అమ్ముతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.


షాబాద్‌, ఫిబ్రవరి 19 : తాగునీటి వనరులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడినుంచో తాగు, సాగు నీటిని రప్పిస్తామని హామీలు గుప్పించడం తప్ప, స్థానికంగా ఉన్న నీటి వనరుల సంరక్షణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నీటి సమస్యను తీర్చడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి నూతన ప్రాజెక్టులు తీసుకొస్తామని నేతలు చెబుతున్నారు. కానీ, పూర్వీకులు ముందుచూపుతో ఏర్పాటు చేసిన నాలాలు, కాలువలు, ప్రాజెక్టులను మాత్రం పట్టించుకోవడం లేదు. వాటి పునరుద్ధరణ కోసం కనీస చర్యలు తీసుకోవడం లేదు. 

పశ్చిమ రంగారెడ్డి జిల్లా నుంచి తూర్పు రంగారెడ్డి జిల్లా వరకు విస్తరించి ఉన్న అతి పెద్ద ఫిరంగి కాలువను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకప్పుడు ఈ కాలువ ద్వారా నగర, జిల్లా ప్రజలకు తాగునీరు, సాగునీరు అందేది. అలాంటి ఘన చరిత్ర ఉన్న ఫిరంగి నాలా  ప్రస్తుతం ఆనవాళ్లు లేకుండా పోతోంది. అతిపెద్ద కాలువగా పేరొందిన ఫిరంగి కాలువ కబ్జాలకు కుచించుకుపోయింది. ఈ కాలువకు మరమ్మతులు చేపడితే నగర, జిల్లా తాగు, సాగు నీటి సమస్యలు చాలావరకు తీరుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానివైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

నిజాం కాలంలో నిర్మాణం

 1872లో తెలంగాణ ప్రాంత ప్రజలు కరువు, కాటకాలు సంభవించి సాగు, తాగునీరుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో నిజాం ప్రభువు ముందు చూపుతో ఫ్రెంచ్‌, ఇంగ్లాండ్‌ ఇంజనీర్ల సహాయంతో ఫిరంగి కాల్వ నిర్మాణాన్ని చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం చందనవెల్లి చెరువు నుంచి ఇబ్రహీంపట్నం చెరువు వరకు 85 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మాణం చేశారు. ఈ కాలువకు 50 చెరువులను అనుసంధానం చేశారు. దీంతో ఈ కాలువ పారినప్పుడు చెరువలన్నీ నీటితో కళకళలాడి వ్యవసాయం ఎంతో అభివృద్ధి చెందింది. వందలాది గ్రామాలకు తాగునీరు, వేల ఎకరాలకు సాగునీరు అందేది. అందరి మన్ననలు అందుకున్న ఫిరంగి కాలువ పాలకుల నిర్లక్ష్యం, భూకబ్జాకారుల కారణంగా ప్రస్తుతం ఆనవాలు లేకుండా పోయింది. నిజాం ప్రభువులు హైదరాబాద్‌ నగరానికి పశ్చిమాన సరిహద్దు ప్రాంతంలో ప్రవహిస్తున్న ఈసీ నదిపై ఫిరంగి కాలువ నిర్మాణం చేపట్టారు. కాలువను తవ్వే సమయంలో అడ్డువచ్చిన పెద్దపెద్ద రాళ్లను పగులగొట్టేందుకు ఫిరంగులు వాడారు. దీంతో ఈ కాలువకు ఫిరంగి కాలువ అనే పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతారు. సుమారు 48 మీటర్ల వెడల్పుతో పెద్దపెద్ద రాళ్లు, సున్నపు డంగు, ఇసుక కలిపి అత్యంత పటిష్టంగా కరకట్టను నిర్మించి ఈసీ వాగు నుంచి ఫిరంగి కాల్వలకు నీరు మళ్లించారు. కరకట్ట సామర్ధ్యానికి మించి వచ్చిన నీరు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ చెరువులోకి వెళ్లేవిధంగా చేశారు. షాబాద్‌ మండలంలో ప్రారంభించి శంషాబాద్‌ మండలం, రాజేంద్రనగర్‌ మున్సిపాలిటీ, సరూర్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ మండలం ద్వారా ఇబ్రహీంపట్నం చెరువు వరకు 85 కిల్లోమీటర్ల మేర ఈ కాలువ విస్తరించి ఉంది. 

షాబాద్‌ మండలంలోని చందనవెల్లి నుంచి ప్రారంభమయ్యే ఫిరంగి కాలువ.. సోలిపేట్‌, మద్దూర్‌, శంషాబాద్‌ మండలంలోని రామాంజపూర్‌, బోటిగూడ, మల్కారం, నానాజీపూర్‌, మక్తగూడ, గూడూర్‌, అచ్చంపేట మీదుగా మరోమారు శంషాబాద్‌ మండలంలోని గూడూర్‌ వద్ద కత్వలో కలుసుకుంటూ పిల్లోనిగూడ, జూకల్‌, కాచారం, చౌదరిగూడ, ఊట్‌పల్లి, తొండుపల్లి, శంషాబాద్‌కు చేరుకొని సరూర్‌నగర్‌లోని బాలాపూర్‌, కొత్తపేట, ఎర్రకుంట, పహడీషరీఫ్‌, సుల్తాన్‌పూర్‌, మీర్‌పేట్‌, వెంకటాపూర్‌, నాదల్‌గుల్‌, కర్మల్‌గూడ, హయత్‌నగర్‌ మండలంలోని కోహెడ, ఇంజాపూర్‌, మన్పూర్‌గూడ, జాలగూడ, మహేశ్వరం మండలంలోని తుక్కుగూడ ప్రాంతాల మీదుగా ఫిరంగికాలువ సాగుతుంది.  ఆ సమయంలో ఫిరంగి కాలువ ద్వారా పదివేల ఎకరాల వరకు సాగునీరందేది.

కబ్జా చేసి వెంచర్లు

 వేలాది ఎకరాలకు, వందల గ్రామాలకు సాగు, తాగు నీరందించిన ఫిరంగి కాలువ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల వైఫల్యం కారణంగా కబ్జాకు గురవుతోంది. 84కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న కాలువ దాదాపు పూర్తిగా కనుమరుగైంది. కాలువ ప్రారంభమైన షాబాద్‌ మండలం నుంచి శంషాబాద్‌ వరకు ఉన్న చుట్టుపక్కల పొలాల రైతులు కాలువను పూడ్చి పంటలు సాగు చేస్తున్నారు. శంషాబాద్‌, సరూర్‌నగర్‌, మహేశ్వరం, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ఏకంగా ఫిరంగి కాలువను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జాచేసి వెంచర్లు ఏర్పాటు చేసి అపార్టుమెంట్లు, ఫ్యాక్టరీలు, ఫంక్షన్‌హాళ్లు కట్టారు. దీంతో అక్కడ ఫిరంగి కాలువ ఉందా లేదా అనే అనుమానాలు కలిగేలా నామరూపాలు లేకుండా చేశారు.

హామీలన్నీ నీటిమూటలే

 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇబ్రహీంపట్నం, ఇంజాపూర్‌ చెరువుల దుస్థితి చూసి ఫిరంగి కాలువ పునరుద్ధరణకు రూ.50లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ అవి అమలుకు నోచుకోలేదు. అనంతరం వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి పల్లెబాటలో భాగంగా చందనవెల్లికి వచ్చినపుడు ఫిరంగి కాలువ నిర్మాణానికి ఎన్ని నిధులైౖనా ఇస్తానని హామీ ఇచ్చారు. తర్వాత దానిగురించే మరిచారు. ఫిరంగి కాలువకు మరమ్మతులు చేపట్టి నీటి సమస్యను తీర్చాలని టఫ్‌ ఫ్రంట్‌ కో చైర్మన్‌ విమలక్క, ప్రొఫెసర్‌ కేశవరావు జావెద్‌, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య పాదయాత్ర చేశారు. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. అయినా పాలకుల్లో చలనం రాలేదు. హైదరాబాద్‌ దాహార్తిని తీర్చడంతోపాటు రంగారెడ్డి జిల్లాలోని పశ్చిమ నుండి తూర్పు దిశలవరకు సాగునీరు,  తాగునీరు అందించే ఫిరంగికాల్వను ఇప్పటికైనా బాగుచేయాలని రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.

ఫిరంగికాలువను పునరుద్ధరించాలి: పాలమాకుల జంగయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి

 ఫిరంగి కాల్వను పునరుద్ధరిస్తే తాగు, సాగు నీటి సమస్య తీరుతుంది. కాలువను కబ్జాచేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫిరంగి కాలువ మరమ్మతుకు రూ.100కోట్లు నిధులు కేటాయించి ఈసీ వాగుపై ఏర్పాటు చేసిన కరకట్టను, అనుసంధానమై చెరువుల నీటి సామర్థ్యాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2022-02-20T04:56:01+05:30 IST