వేలిముద్ర పడాల్సిందే!

ABN , First Publish Date - 2022-11-30T23:38:04+05:30 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా సమయ పాలన పాటించే విధంగా ఇంటర్‌ విద్యా మండలి చర్యలు చేపట్టింది.

వేలిముద్ర పడాల్సిందే!

జూనియర్‌ కళాశాలల్లో బయో మెట్రిక్‌ అమలుకు కార్యాచరణ

వేలిముద్రతో పాటు ముఖచిత్రం నమోదయ్యేలా మార్పులు

అధ్యాపకులు, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరు నమోదు

75 శాతం పైగా హాజరు ఉంటేనే కోతలేకుండా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌, ఫీజు రియంబర్స్‌మెంట్‌

ఈనెల నుంచి అమలుకు సన్నాహాలు

వికారాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు, అధ్యాపకులు తప్పనిసరిగా సమయ పాలన పాటించే విధంగా ఇంటర్‌ విద్యా మండలి చర్యలు చేపట్టింది. ప్రతి జూనియర్‌ కళాశాలలోనూ బయో మెట్రిక్‌ విధానం అమలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. కొందరు విద్యార్థులు తరగతులకు రోజూ హాజరు కాకుండా గైర్హాజరవుతుంటే , అధ్యాపకుల్లో కొందరు అత్యవసర పనుల పేరిట ఇష్టం వచ్చినట్లు కళాశాలలకు వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సమయ పాలన సక్రమంగా పాటించడం లేదనేది ఇంటర్మీడియట్‌ విద్యా మండలి దృష్టికి వచ్చింది. తరగతులకు విద్యార్థులు సక్రమంగా హాజరు కాకపోవడంతో ఆ ప్రభావం వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణతపై పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అన్ని సదుపాయాలు ఉచితంగానే కల్పిస్తున్నా సమయ పాలన పాటించకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా విధిగా బయోమెట్రిక్‌ విధానం అమలు చే యాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో 76 జూనియర్‌ కళాశాలలు

జిల్లాలో మొత్తం 76 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 9 ఉండగా, టీఎస్‌ఆర్‌జేసీ 2, మోడల్‌ 9, ఎంజే ఆర్‌పీజేసీ 6, టీఎంఆర్‌జేసీ 6, టీఎస్‌డబ్ల్యుఆర్‌జేసీ 8, టీఎస్‌టీడబ్ల్యుఆర్‌జేసీ 6, కేజీబీవీ, 22 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 17,633 మంది రెగ్యులర్‌ విద్యార్థులు చదువుతున్నారు. ఫస్టియర్‌లో 8,558 మంది విద్యార్థులు ఉండగా, వారిలో జనరల్‌ 7,591 మంది, ఒకేషనల్‌ 967 మంది విద్యార్థులు ఉన్నారు. సెకెండియర్‌లో 9,075 మంది విద్యార్థులు ఉండగా, వారిలో జనరల్‌ 7,731 మంది, ఒకేషనల్‌ 1,477 మంది విద్యార్థులు ఉన్నారు.

నాలుగేళ్ల కిందటనే బయోమెట్రిక్‌...

జూనియర్‌ కళాశాలల్లో 2019లోనే బయో మెట్రిక్‌ విధానం అమల్లోకి తీసుకు వచ్చారు. అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు బయో మెట్రిక్‌ పరికరాలు పంపిణీ చేశారు. సిగ్నల్స్‌ సమస్య, నిర్వహణ లోపం, పరికరాల మొరాయింపు తదితర కారణాలు బయో మెట్రిక్‌ విధానం అమలుకు అవరోధంగా మారాయి. 2020లో కొవిడ్‌ కారణంగా బయో మెట్రిక్‌ విధానంలో హాజరు నమోదును నిలిపి వేశారు. రెండేళ్ల పాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. గత ఏడాది నుంచి ప్రత్యక్ష తరగతులు కొనసాగుతున్నా బయో మెట్రిక్‌ హాజరును అమల్లోకి తీసుకు రాలేదు. దీంతో బయో మెట్రిక్‌ పరికరాలు మూలనపడ్డాయి. కొన్ని పరికరాల్లో నిర్వహణ పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అవసరమైన వాటికి మరమ్మతులు చేయించడంతోపాటు వేలి ముద్ర, ముఖచిత్రాలతో హాజరు నమోదయ్యేలా కొత్త పరికరాలు కళాశాలలకు పంపించాలని ఇంటర్మీడియట్‌ విద్యా మండలి భావిస్తోంది. వేలి ముద్ర సరిపోకపోయినా ఇబ్బంది ఉండదు. ముఖచిత్రంతో హాజరు నమోదు కానుంది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఈ విధానంతోనే తమ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్‌ కళాశాలల్లోనూ ఈనెల నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

స్కాలర్‌షిప్‌ కావాలంటే...

విద్యార్థులకు కనీసం 75 శాతం హాజరు ఉంటేనే ఉపకార వేతనం, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తారు. గతంలో తరగతులకు హాజరు కాకున్నా పరీక్షలు రాయడానికి అనుమతి ఇచ్చేవారు. బోర్డు తీసుకున్న నిర్ణయంతో తరగతులకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే. గైర్హాజరయ్యే విద్యార్థులకు ఇబ్బందులు ఎదురు కానున్నాయి. ప్రభుత్వం విడుదల చేసే స్కాలర్‌షిప్‌లో ఎలాంటి కోత లేకుండా మొత్తం రావాలనుకుంటే 75 శాతానికి తగ్గకుండా తరగతులకు హాజరు కావాలి. అధ్యాపకులు సైతం ఉదయం, సాయంత్రం రెండు పర్యాయాలు బయో మెట్రిక్‌ ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Updated Date - 2022-11-30T23:38:04+05:30 IST

Read more