మున్సిపల్‌ పంచాయితీ

ABN , First Publish Date - 2022-09-27T05:52:23+05:30 IST

మున్సిపల్‌ పంచాయితీ

మున్సిపల్‌ పంచాయితీ
మున్సిపల్‌ సమావేశంలో ఒప్పంద గొడవపై నిలదీస్తున్న కౌన్సిలర్లు

  • టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల ఒప్పంద గొడవ
  • పార్టీ గొడవలు బయట చూసుకోవాలన్న కాంగ్రెస్‌, బీజేపీ కౌన్సిలర్లు
  • పోలీస్‌ బందోబస్తు మధ్య సమావేశం

వికారాబాద్‌, సెప్టెంబరు 26: రెండున్నరేళ్ల చైర్‌పర్సన్‌ పదవి ఒప్పంద పంచాయితీ మున్సిపాలిటీ పరువు తీస్తోందని పలు పార్టీల నా యకులు అభిప్రాయ పడ్డారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం వికారాబాద్‌ మున్సిపల్‌ అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. పదవిపై టీఆర్‌ఎ్‌సలో నెల కొన్న గొడ వల కారణంగా గలాభా చోటు చేసుకోకుండా కార్యాలయ గేటు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వ హించారు. కౌన్సిలర్లు మినహా ఎవరినీ అనుమతించలేదు. ఉదయం 11:30కు సమావేశం గొడవలతో ప్రారంభమైంది. దసరాకు రూ.10.06లక్షల బడ్జెట్‌ కేటాయించారు. అదనంగా 1, 12, 13వార్డుల్లో ఉత్సవాలకు రూ.30వేలు, లైట్ల ఏర్పాటుకు రూ.లక్ష కేటాయిస్తూ తీ ర్మానించారు. అనంతగిరిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ ఉత్సవాలకు లైట్లు, డస్ట్‌ వేయాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు మురళి, దేవి కోరారు. ఇదిలా ఉంటే చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేయాలని టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు డిమాండ్‌ చేయగా.. ‘మీ పంచాయితీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి వద్ద కూర్చొని పరిష్కరించుకోండి. సమావేశాల్లో ప్రజాసమస్యలపై చర్చించకుండా గొడవ చేయొద్దు.’ అని కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్‌ బడ్జెట్‌ వివరాలు తెలియజేయాలని కోరారు. చైర్‌పర్సన్‌ మంజుల స్పందిస్తూ ఆ నిధుల విషయం నాకూ తెలియదన్నారు. కమిషనర్‌ను ప్రశ్నించారు. కలెక్టర్‌ గ్రీన్‌ బడ్జెట్‌ రూ.35లక్షలు ఇచ్చారని, సాధారణ సమావేశాలు నిర్వహించకపోవడంతో చెప్పలేదని కమిషనర్‌ అన్నారు. ఆ బడ్చెట్‌తో చేపట్టన పనులు 80శాతం పూర్తిచేశామన్నారు. మాకు తెలియకుండా ఎలా ఖర్చు చేస్తారని చైర్‌పర్సన్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌లీడర్‌ సురేష్‌ మాట్లాడుతూ.. పోలీసులను పెట్టి సమావేశాలను నిర్వహించడం ఏమిటన్నారు. ఐదు నెలలుగా సమస్యలపై చర్చించడం లేదన్నారు. వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మాట్లాడుతున్నారని చైర్‌పర్సన్‌ను విమర్శించారు. కక్షతో మాట్లాడినట్టు రుజువు చేయాలని చైర్‌పర్సన్‌ అన్నారు. సమస్యలపై మాట్లాడితే చైర్‌పర్సన్‌ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని కొందరు సభ్యులన్నారు. బీజేపీ కౌన్సిలర్‌ శ్రీదేవి మాట్లాడుతూ.. మీ పార్టీ గొడవలు బయట చూసుకోవాలన్నారు. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అనంతరెడ్డి మాట్లాడుతూ.. ఒప్పందం లేదని చైర్‌పర్సన్‌ దేవుడిపై ఒట్టేసి చెబితే రాజీనామాకు పట్టుబట్టం అని, ఐదేళ్లూ ఆమే కొనసాగవచ్చన్నారు. అనంతరం కౌన్సిలర్‌ లంక పుష్పలతారెడ్డి మాట్లాడుతూ.. ‘సమావేశాలు ఎవరు పెట్టనివ్వడం లేదు? ఒప్పందం ప్రకారమే మేం ప్రశ్నిస్తున్నాం. పార్టీ అంశం బయటే మాట్లాడుకోవాలని చైర్‌పర్సన్‌ను పిలిస్తే రాలేదు. అందుకే ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. చైర్‌పర్సన్‌ నన్ను చూసి నవ్వుతున్నారు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందం పై అనంత్‌రెడ్డి మరోసారి మాట్లాడడంతో.. మీ వల్లే సమావేశం సరిగా జరుగడంలేదు అని చైర్‌పర్సన్‌ ఆయనను సస్పెండ్‌ చేశారు. సభ్యుల ఆమోదంలేకుండా ఎలా సస్పెండ్‌ చేస్తారని కౌన్సిలర్‌ సురేష్‌, ఇతర కౌన్సిలర్లు చైర్‌పర్సన్‌ను నిలదీశారు. దీంతో ‘సమావేశం ముగిసింది. ఎజెండా ఆంశాలను ఆమోదిస్తున్నాం.’ అంటూ చైర్‌పర్సన్‌ కౌన్సిల్‌హాల్‌ నుంచి వెళ్లిపోయారు.


  • ‘గొడవలకు కారణం ఎమ్మెల్యేనే’ 

‘‘ఎమ్మెల్యే ఒప్పందం వల్లే మునిసిపల్‌లో గొడవలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు కేవలం ప దవుల కోసం కొట్లాడుతున్నారు. చైర్‌పర్సన్‌ కుర్చీ కోసం ఎవరెన్ని కోట్లిచ్చారో వారికే తెలియాలి. అధికారులూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రతీ అత్యవసర సమావేశంలో ఎజెండా పాస్‌ అని పోతున్నారు. సమావేశానికి గంట ముందు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే సమావేశం అవుతున్నారు. చైర్‌పర్సన్‌ సైతం చేతనైతే ఉండాలి.. లేకుంటే దిగిపోవాలి. ఏదో నిర్ణయం త్వరగా తీసుకొని ప్రజాసమస్యలపై దృష్టి పెట్టాలి. లేకుంటే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష, ధర్నాలు చేస్తాం’’ అని కౌన్సిలర్‌ సుధాకర్‌రెడ్డి అన్నారు.


  • అభివృద్ధికి సహకరించండి : చైర్‌పర్సన్‌

‘దసరా పండుగ దృష్ట్యా సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రజాసమస్యలపైనా చర్చించాలన్నదే నా ఆలోచన. ఒప్పందం అంటూ కొందరు గొడవచేస్తున్నారు. దానిపై అధిష్టానం చూసుకుంటుంది.’

Read more