సమన్వయంతో ముందుకు సాగాలి

ABN , First Publish Date - 2022-09-27T05:48:00+05:30 IST

సమన్వయంతో ముందుకు సాగాలి

సమన్వయంతో ముందుకు సాగాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీనారాయణరెడ్డి

తలకొండపల్లి, సెప్టెంబరు 26: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. తలకొండపల్లి మండల సర్వసభ్య సమావేశం సోమవారం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఎంపీపీ నిర్మలశ్రీశైలంగౌడ్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ఎమ్మెల్సీతో పాటు జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్‌, సింగిల్‌విండో చైర్మన్‌ గట్ల కేశవ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు స్థానికంగా నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. మండలంలో గడిచిన రెండేళ్లలో మృత్యువాతపడిన 160పశువులకు బీమా డబ్బులను విడుదల చేయాలని జడ్పీటీసీ వెంకటేశ్‌ కోరారు. మండలంలో ఉపాధ్యాయుల పోస్టులను  భర్తీ చేయాలని ఎంపీపీ నిర్మల శ్రీశైలంగౌడ్‌, జడ్పీటీసీ వెంకటేశ్‌తో పాటు పలువురుసభ్యులు కోరారు. గట్టిప్పలపల్లి పీహెచ్‌సీలో వైద్యులను వెంటనే నియమించాలని వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. గట్టిప్పలపల్లి నుంచి కర్కస్‌ తండాకు వస్తున్న విద్యుత్‌ ఫీడర్‌ను మార్చి చుక్కాపూర్‌కు కలపాలని ఖానాపూర్‌ సర్పంచ్‌ వెంకట్రామ్‌రెడ్డి కోరారు. తలకొండపల్లి-మిడ్జిల్‌ ప్రధాన రహదారిపై బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేయాలని, చంద్రధన-నిర్ధవెళ్లి రహదారిని బీటిరోడ్డుగా మార్చాలని సభ్యులు బక్కి కుమార్‌, రమేశ్‌ యాదవ్‌, సుధాకర్‌ రెడ్డి, అంబాజీలు కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. తలకొండపల్లి మండలానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరందించి రైతుల కలలు ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇంటినిర్మాణానికి రూ.3లక్షలు అందివ్వనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రాఘవులు, తహసీల్దార్‌ కృష్ణ, ఎంఈవో సర్ధార్‌ నాయక్‌, డాక్టర్‌ శారద, ఉద్యావన శాఖ అధికారి ఉష, ఏవో రాజు, సీడీపీవో సక్కుబాయి, ఏఈలు రాజశేఖర్‌, విద్యాసాగర్‌, కటారియా తదితరులు పాల్గొన్నారు.  

ఎమ్మెల్సీని అడ్డుకున్న కాంగ్రెస్‌ నాయకులు 

తలకొండపల్లి మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటు, రోడ్డు విస్తరణ పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బస్టాండ్‌ కూడలిలో ఆమనగల్లు- షాద్‌నగర్‌ ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. పార్టీ మండల అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ నాయకులు రోడ్డుపై బైటాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అదేసమయంలో మండల సర్వసభ్య సమావేశానికి వెళ్తున్న ఎమ్మెల్సీ కారును అడ్డుకొని నిరసన తెలిపారు. మండల సమావేశానికి వెళ్తున్న తనను అడ్డుకోవడమేంటని ఎమ్మెల్సీ కారును అక్కడే వదిలేసి నడుచుకుంటూ మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించి సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జనార్ధన్‌, నాయకులు అజీం, తిరుపతి, నరేశ్‌, సాయినాథ్‌, బాలకృష్ణ, శివరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-27T05:48:00+05:30 IST