మోస్తరు నుంచి భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-29T05:11:08+05:30 IST

రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

మోస్తరు నుంచి భారీ వర్షం
అలుగుపారుతున్న యాచారం మండలం నందివనపర్తి పెద్ద చెరువు

  • పొంగిపొర్లిన వాగులు వంకలు
  • పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌
  • జలమయమైన రహదారులు


యాచారం / ఇబ్రహీంపట్నం/ కందుకూరు/ కొత్తూర్‌, సెప్టెంబరు 28 :  రంగారెడ్డి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. వానకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. యాచారం మండలంలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వానకు నందివనపర్తిలోని పెద్దచెరువు, మల్కీజ్‌గూడలోని మగ్దుం అలీ చెరువు, నజ్దిక్‌సింగారంలోని మూడు కుంటలు అలుగుపారుతున్నాయి. 20 ఏళ్ల తరువాత ఇవి అలుగుపారుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వర్షానికి నజ్దిక్‌సింగారం-నందివనపర్తి గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. తాడిపర్తి, నానక్‌నగర్‌, చింతపట్ల, నందివనపర్తి, మేడిపల్లి తదితర గ్రామాల చెరువులు, కుంటలు నిండాయి. చింతపట్ల చెరువు పదిహేనేళ్ల తరువాత అలుగు పారుతుంది.

ఇబ్రహీంపట్నంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. వర్షానికి సంతలో కూరగాయలు, సామగ్రి తడిసి ముద్దయ్యాయి.

కందుకూరు మండలం గూడూరు గ్రామంలోని శనిగ చెరువు కట్టకు గండి పడటంతో నీరంతా వృథాగా పోతుంది. దీంతో రైతులు తాత్కాలికంగా కట్టకు మట్టిని వేశారు. సంబంధిత అధికారులు కట్టకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. కందుకూరు, నీర్ఖాన్‌పేట సమీపంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో యాచారం వెళ్లే రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. 


మక్తగూడ-పిల్లోనిగూడ రాకపోకలు బంద్‌

కొత్తూరు మండల పరిధిలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మక్తగూడ-పిల్లోనిగూడ గ్రామాల మధ్య వాగు వద్ద ఉన్న మట్టి వంతెన కొట్టుకుపోయింది. కొత్తూరు మండలం మక్తగూడ, శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడ గ్రామాల మధ్య పిల్లోనిగూడ వాగు ఉంది. వాగు వద్ద ప్రధానమంత్రి గ్రామ సడక్‌యోజన పథకం కింద వంతెన నిర్మాణానికి 3కోట్ల 36లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. 6నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రెండు గ్రామాల రాకపోకల కోసం తాత్కాలికంగా మట్టి వంతెన నిర్మించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పాల్మాకుల, నర్సప్పగూడ చెరువుల నుంచి పిల్లోనిగూడ వాగుకు భారీగా వర్షపు నీరు వస్తుండడంతో మట్టి వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. దాంతో మక్తగూడ, పిల్లోనిగూడ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. ఆ గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి వారి ఇళ్లలోకి చేరుకోవాల్సి వస్తుంది. ఈ వంతెన వద్ద ఇటీవల ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తూ, ప్రమాదవశాత్తు వాగులో పడి మృత్యువువాత పడ్డాడు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వంతెన వద్ద మరమ్మతులు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


పిడుగుపాటుకు జీవాలు మృత్యువాత

యాచారం మండలం కుర్మిద్ద గ్రామంలో బుధవారం సాయంత్రం పిడుగుపాటుకు జీవాలు మృత్యువాత పడ్డాయి. రైతు బాలయ్య జీవాలను మేపుతుండగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. వాటిని చెట్టుకింద తోలి తాను మరోచోట నిల్చున్నాడు. పిడుగు పడటంతో చెట్టు కింద ఉన్న మూడు మేకలు, రెండు గొర్రెలు చనిపోయాయి. దీంతో బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు. కాగా, బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామసర్పంచ్‌ రాజశేఖర్‌రెడ్డి  కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. Read more