మట్టి తోడేళ్లు!

ABN , First Publish Date - 2022-12-10T00:28:45+05:30 IST

చీకటి పడిందంటే రెచ్చిపోతున్నారు.. అందినకాడికి తవ్వుకుపోతున్నారు.. కాదేదీ దొంగతనానికి అనర్హమంటూ ప్రభుత్వ భూమిలో మట్టిని కూడా మాయం చేస్తున్నారు.

మట్టి తోడేళ్లు!
ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరపడంతో ఏర్పడిన గుంతలు

ప్రభుత్వ భూమిలో అర్ధరాత్రి మట్టి తరలింపు

రూ.లక్షలు కాజేస్తున్న కేటుగాళ్లు

తవ్వకాలతో భారీగా గుంతలు

వర్షాకాలంలో ప్రమాదకరంగా మారే పరిస్థితి

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్న గ్రామస్తులు

చీకటి పడిందంటే రెచ్చిపోతున్నారు.. అందినకాడికి తవ్వుకుపోతున్నారు.. కాదేదీ దొంగతనానికి అనర్హమంటూ ప్రభుత్వ భూమిలో మట్టిని కూడా మాయం చేస్తున్నారు. మట్టినే వ్యాపారంగా చేసుకొని కోట్ల రూపాయలకు పడగెత్తుతున్నారు. తమనెవరు అడ్డుకుంటారులే అని దర్జాగా దందా చేస్తున్నారు. రాత్రికి రాత్రి లారీల్లో మట్టిని అక్రమంగా తరలిస్తూ తమ వ్యాపారం సాగిస్తున్నారు.

శంషాబాద్‌రూరల్‌, డిసెంబరు 9 : అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు వ్యాపారులు ప్రభుత్వ భూమిలోని మట్టిని కూడా వదలడం లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. రాత్రి వేళల్లో లారీల కొద్ది మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శంషాబాద్‌ మండల పరిధిలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. శంకరాపురం పంచాయతీ పరిధిలోని చర్లగూడలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. కొన్ని నెలలుగా గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. ఐఎంటీ కళాశాల ఎదురుగా అర్ధరాత్రి పెద్దపెద్ద ఇటాచిలతో మట్టి తవ్వి లారీలల్లో నగరానికి తరలిస్తున్నారు. మట్టిని అమ్ముకొని వ్యాపారులు లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.

చర్లగూడలో మట్టి తవ్వకాల గురించి గురువారం అర్ధరాత్రి గ్రామస్తులు మీడియాకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. ఓ లారీలో మట్టిని తరలిస్తున్నారు. మట్టి తరలింపుపై లారీ డ్రైవర్‌ పోచ్చయ్యను ప్రశ్నించగా.. శంకరాపురం గ్రామానికి చెందిన జైహింద్‌ అనే వ్యక్తి మట్టిని తరలిస్తున్నారని మీడియాకు చెప్పాడు.

శంకరాపురం పంచాయతీ పరిధిలోని చర్లగూడలో కొన్ని నెలలుగా మట్టి అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా జరుగుతోంది. అర్ధరాత్రి దాటిందంటే లారీల కొద్దీ మట్టి తరలిపోతోంది. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమిలో ఇలా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా సదరు అధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎర్రమట్టికి భలే డిమాండ్‌

ఎర్రమట్టికి మంచి డిమాండ్‌ ఉండడంతో కొందరు అక్రమార్కులు మట్టి వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. లారీ లోడ్‌ దాదాపు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ధర పలుకుతోంది. దీంతో మట్టి మాఫియా నగర శివారు ప్రాంతమైన శంషాబాద్‌ మండలాన్ని ఎంచుకుంది. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో నెలల తరబడి మట్టిని తవ్వడంతో అక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి. గ్రామ సమీపంలో ఏర్పడిన గుంతలు వర్షాకాలంలో నిండి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో నిండిన నీటిలో పిల్లలు పడి మృత్యువాత పడే ప్రమాదముందని గ్రామస్తులు చెబుతున్నారు.

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం

చర్లగూడలో జరుగుతున్న రుగమట్టి తవ్వకాలపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని కోరుతున్నారు.

ప్రభుత్వ భూమిలోని మట్టి తరలిస్తే క్రిమినల్‌ కేసులు

అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, ఎవరైన సరే ప్రభుత్వ భూమిలో మట్టి తరలిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమే కాకుండా దానికి ఉపయోగించే యంత్రాలను సీజ్‌ చేస్తాం. రెవెన్యూ సిబ్బంది పట్టించుకోకపోతే నాకు నేరుగా ఫిర్యాదు చేయాలని సూచించారు. మట్టి అక్రమ రవాణాను ఎట్టిపరిస్ధితుల్లో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

- శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్‌

Updated Date - 2022-12-10T00:28:47+05:30 IST