కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-11-17T00:16:22+05:30 IST

కుటుంబ కలహాలతో ఓ వివాహిత చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్‌ మండలం గోకఫస్లాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

దౌల్తాబాద్‌, నవంబరు 16: కుటుంబ కలహాలతో ఓ వివాహిత చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన దౌల్తాబాద్‌ మండలం గోకఫస్లాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, ఎస్సై రమేశ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు... గోకఫస్లాబాద్‌కు చెందిన భారతమ్మ, రామకృష్ణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మొదటి కూతురు సొండే అనిత(24)ను కర్ణాటక రాష్ట్రం గుర్మిట్‌కల్‌కు చెందిన బసప్పకు నాలుగేళ్ల క్రితం ఇల్లరికంతో వివాహం చేశారు. ఈక్రమంలో రెండున్నర సంవత్సరాల పాటు సాఫీగా సాగిన వారి కాపురంలో మెల్లమెల్లగా మనస్పర్థలు రావడంతో ఏడాదిన్నర క్రితం విడాకులు తీసుకున్నారు. కాగా, వీరికి రెండేళ్ల కూతురు ఉంది. మృతురాలి తల్లిదండ్రులు బతుకుదెరువు నిమిత్తం ముంబాయికి వలస వెళ్లారు. మృతురాలు అనిత తన కూతురితో కలిసి గోకఫస్లాబాద్‌లోని నానమ్మ(ఎల్లమ్మ) వద్ద ఉంటోంది. అయితే, ఈ నెల 12న నానమ్మతో గొడవ పడటంతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ముంబాయి నుంచి సొంత గ్రామానికి చేరుకొని బంధువులు, తెలిసిన వారి దగ్గర వెతికినా ఫలితం లేకపోయింది. ఈక్రమంలో బుధవారం గ్రామ శివారులోని జక్మల్‌ చెరువులో నీటిపై ఓ మహిళ మృతదేహం తేలియాడుతుండటాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై రమేశ్‌కుమార్‌ అక్కడికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా సొండే అనితగా నిర్ధారించారు. ఈ సంఘటనపై మృతురాలి తల్లి భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-11-17T00:16:22+05:30 IST

Read more