ఆయనపై ఆరోపణలు ఎన్నో!

ABN , First Publish Date - 2022-12-06T23:41:40+05:30 IST

తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెండున్నరేళ్లలో 12వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అందులో 6వేల వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు అక్రమమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 ఆయనపై ఆరోపణలు ఎన్నో!
తాండూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

రెండున్నరేళ్లలో రూ.7కోట్ల మేరకు అక్రమార్జన?

తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌కు అధికార నేతలు, రియల్టర్ల అండ

అక్రమ వెంచర్లకు రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారి

ఏసీబీకి పట్టుబడటంతో పత్తాలేని రియల్టర్లు

ప్రభుత్వ శాఖల్లో గుబులు!

ఎవరు ఎప్పుడు ఫిర్యాదు చేస్తారోనని భయం

తాండూరు/తాండూరు రూరల్‌, డిసెంబరు 6 :తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రెండున్నరేళ్లలో 12వేల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అందులో 6వేల వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు అక్రమమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్కప్లాటుకు రూ.15 వేల నుంచి రూ.20వేల వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వ్యవసాయేతర ప్లాట్లను, డీటీపీ ఉన్న వాటిని రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉండగా, వ్యవసాయ భూములను ప్లాట్లుగా చేసినా వాటిని రిజిస్ట్రేషన్‌ చేసి ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌ జమీరుద్దీన్‌ డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోర్టు ఇచ్చిన ఓఆర్డర్‌ను చూపించి ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. పార్ట్‌ ఆఫ్‌ రిజిస్ట్రేషన్లకు సాకులు చూపించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. తన కార్యాలయంలోనే ఒక అటెండర్‌ను, డాక్యుమెంటరీ రైటర్‌ కార్యాలయంలో ఉండే కొందరు అసిస్టెంట్లను డబ్బుల వసూలుకు ఏజెంట్లుగా నియమించుకున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. కొంతమంది రియల్టర్‌ చెప్పిందే వేదంగా పని పనిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఏసీబీకి చిక్కినాక పలకరించేందుకు కూడా కార్యాలయం సమీపంలో ఎవరూ కనిపించకుండా పోయారని చర్చించుకుంటున్నారు. ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌పై ప్రతినెలా ఆడిట్‌లు జరిగినా ఎక్కడా తేదీలు కనిపించకుండా వారిని సైతం మేనేజ్‌ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గౌతాపూర్‌, కోకట్‌, రసూల్‌పూర్‌, కందనెల్లి, తాండూరు పరిసర ప్రాంతాల్లో అక్రమ వెంచర్లకు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు విమర్శలు లొస్తున్నాయి. రెండున్నరేళ్లలో జరిగిన రిజిస్ట్రేషన్లపై సమగ్ర విచారణ జరిపితే అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. రెండున్నరేళ్లలో రూ.7కోట్ల మేరకు అక్రమార్జనకు పాల్పడినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

అధికార పార్టీ నేతకే డబ్బుల డిమాండ్‌

అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఇర్షాద్‌ భూమి రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ రద్దు కోసమే డబ్బులు డిమాండ్‌ చేయడం విశేషం. దీంతో విసుగు చెందిన ఇర్షాద్‌ ఏసీబీని ఆశ్రయించాడు. సమాచార హక్కు చట్టం కింద పలువురు దరఖాస్తు చేసుకున్నా సమాచారం ఇచ్చేవాడు కాదు.. గతంలో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారని ప్రజలు పేర్కొంటున్నారు.

భయం భయంగా అధికారుల విధులు

తాండూరు పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరగడంతో మండల పరిధిలోని ఆయా శాఖల అధికారుల్లో దడ పుట్టింది. మండల పరిధిలోని రెవెన్యూ, మైన్స్‌, పంచాయతీరాజ్‌, పోలీసు, ఎక్సైజ్‌, వ్యవసాయ, విద్యాశాఖ, వైద్యఆరోగ్య, అటవీశాఖ, నీటిపారుదల, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌, మహిళా శిశుసంక్షేమ, సబ్‌ట్రెజరీ, కార్మికశాఖ, మహిళా సమాఖ్య, పాడిపరిశ్రమ, ఫైర్‌, సహకార సంఘాలు, ఉపాధిహామీ, తదితర శాఖల అధికారుల్లో గుబులు మొదలైంది. ఎవరు ఎప్పుడు ఎవరికి ఫిర్యాదు చేస్తారో తెలియక భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో డబ్బులు తీసుకున్న సంఘటనలు ఏమైనా ఉంటే వాటిపై ఎక్కడ ఫిర్యాదు చేస్తారోనన్న ఆందోళనలో ఽఅధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్‌, సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో అధికారుల్లో భయం నెలకొంది. గ్రామాల్లో మాత్రం ప్రజలు ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.

చిన్న పనికి కూడా డిమాండ్‌.....

ప్రభుత్వ శాఖల్లో ఏ చిన్న పని కోసం వెళ్లినా అటెండర్‌ నుంచి పై అధికారి వరకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కనీసం సమాచారం ఇవ్వాలన్నా కూడా కింది స్థాయి సిబ్బందికి వందో రెండు వందలో ఇవ్వాల్సి వస్తోంది. ఇక ఏదైనా ముఖ్యమైన పనిపై వెళితే మాత్రం ఆ పనిని బట్టి వేలల్లో డిమాండ్‌ చేస్తున్నారని కొందరు పేర్కొంటున్నారు. సబ్‌ట్రెజరీ, రెవెన్యూ, పంచాయతీ కార్యాలయాల్లో నిత్యం ప్రజలు ఏదో ఒక పనికోసం వస్తుంటారు. కొందరు ఆస్తుల మార్పిడి, మ్యూటేషన్‌, రీయింబర్స్‌ మెంట్‌ తదితర వాటిపై వస్తుంటారు. వీరి వద్ద అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ అధికారులు వారి నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

చేయి తడపనిదే కాగితం చేతికందదు

వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే చేయితడపనిదే పని కావడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. పేదలమని చెప్పినా అధికారులు వినిపించుకోరని వివిధ గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ కార్యాలయంలోని పలు శాఖల్లో అధికారులు చేయి తడపనిదే ప్రజల చేతికి కాగితాలు రావడం లేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇకపై ఎవరు డబ్బులు డిమాండ్‌ చేసినా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయాలంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

నా వద్ద డబ్బులు డిమాండ్‌ చేశారు

ఆరు నెలలుగా వివిధ రిజిస్ట్రేషన్లకు డబ్బులు డిమాండ్‌ చేశాడు. పలుమార్లు డబ్బులు ఇచ్చినాకే రిజిస్ట్రేషన్‌ చేశాడు. ప్రతిరోజు రూ.5 లక్షల మేరకు అవినీతి డబ్బులు దండుకునేవాడు. గతంలో పలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి కూడా డబ్బులు ఇచ్చా. మొన్న కూడా డాక్యుమెంటేషన్‌ రద్దు చేయించేందుకు గాను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా, సబ్‌రిజిస్ట్రార్‌ జమీరుద్దీన్‌ రూ.లక్ష డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని, డబ్బులు తగ్గించాలని వేడుకున్నా వినలేదు. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశా. ఏసీబీకి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు విత్‌డ్రా కోసం కొందరు రియల్టర్లు ఒత్తిడి చేస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ అవినీతి చిట్టాను మొత్తం బహిర్గతం చేస్తా.

- ఇర్షాద్‌, బాధితుడు (ఏసీబీకి ఫిర్యాదు చేసిన వ్యక్తి)

Updated Date - 2022-12-06T23:41:41+05:30 IST