జాతి సమగ్రతను నిలబెట్టుకుందాం

ABN , First Publish Date - 2022-09-18T04:00:17+05:30 IST

జాతి సమగ్రతను నిలబెట్టుకుందాం

జాతి సమగ్రతను  నిలబెట్టుకుందాం
జాతీయ పతాకం ఎగురవేసి గౌరవవందనం చేస్తున్న రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌, ఎస్పీ

  •  ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందాం
  •  ఆనాటి యోధుల త్యాగాలను తలచుకోవడం మనందరి బాధ్యత 
  • విచ్ఛిన్నరకర శక్తుల కుట్రలు తిప్పి కొడదాం.. 
  •  తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి పద్మారావు

వికారాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : సకల జనుల విశ్వాసంతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని ఇలాగే కొనసాగిస్తూ, జాతీయ సమైక్యతా దినోత్సవ స్ఫూర్తితో జాతి సమగ్రతను నిలబెట్టుకుంటూ ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని శాసనసభ ఉప సభాపతి టి.పద్మారావుగౌడ్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని శనివారం వికారాబాద్‌ పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మన తెలంగాణ  రాచరిక పాలన పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ సంస్థానం భారత దేశంలో ఐక్యమై నేటితో 74 సంవత్సరాలు పూర్తి చేసుకుని 75వ ఏట అడుగు పెడుతున్నామన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్‌ సమాజం ఉద్యమించిందని, ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరంగా సజీవంగా నిలిచిపోయాయన్నారు. యోధుల త్యాగాలను సగర్వంగా స్మరించుకుంటూ, సాహితీ ముర్తులకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. వికారాబాద్‌ జిల్లా అన్ని రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధిస్తోందని, అన్ని హంగులతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫీసెస్‌ కాంప్లెక్స్‌ను ఇటీవల సీఎం కేసీఆర్‌ జిల్లా ప్రజలకు అంకితం చేశారని, రూ.5.15 కోట్లతో జడ్పీ కొత్త భవన నిర్మాణం పనులు చురుకుగా కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ నిరంతరం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందని, మహిళలకు పూర్తి భద్రత, రక్షణ కల్పించే విషయంలో భరోసా కేంద్రం ద్వారా  పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు మంచి సత్పలితాలిస్తున్నాయని గుర్తు చేశారు.  రెవెన్యూ సేవలు పారదర్శకంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఆనాడు తెలంగాణలో సమస్త జనులు ఏకమై చేసిన పోరాట చరిత్రను వక్రీకరిస్తూ ఆనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా విచ్ఛిన్నరకర శక్తులు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఈ దశలో మనందరం అప్రమత్తంగా ఉండి కుట్రలను తిప్పి కొట్లాలన్నారు. వివేకంతో విద్వేషాన్ని ఓడి ద్దామని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతా అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదని, ప్రజల మధ్య, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యతని, నేడు తెలంగాణ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తూ, అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపుదాల్చిందని పద్మారావు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, కొప్పుల మహే్‌షరెడ్డి, పైలెట్‌ రోహిత్‌రెడ్డి, కలెక్టర్‌ కె.నిఖిల, ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయకుమార్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులా రమేష్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో అశోక్‌ కుమార్‌, ఆర్డీవో విజయకుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సంగం లక్ష్మీబాయి బాలికల గురుకులం, వికారాబాద్‌ కేజీబీవీ, జడ్పీహెచ్‌ఎస్‌ బాలుర పాఠశాల, పూడూరు మోడల్‌ స్కూల్‌, న్యూనాగార్జున హైస్కూల్‌ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ప్రదర్శనలు ఇచ్చిన విద్యార్థులకు శాసనసభ ఉప సభాపతి టి.పద్మారావుగౌడ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ జ్ఞాపికలు అందజేసి అభినందించారు.

జిల్లా వ్యాప్తంగా సంబురాలు

వికారాబాద్‌/ కొడంగల్‌/తాండూరు/పరిగి :  వికారాబాద్‌ జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ పతాకాలు ఎగుర వేసి గౌరవవందనం చేశారు. కలెక్టరేట్‌ భవనం వద్ద కలెక్టర్‌ నిఖిల జడ్పీ కార్యాలయం ఎదుట చైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం, గాంధీపార్కులో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ , మునిసిపాలిటీ2 ఎదుట చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుట చైర్మన్‌ సుశీల్‌కుమార్‌గౌడ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వద్ద చైర్‌పర్సన్‌ దీపా భక్తవత్సలం, మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఎంపీపీ చంద్రకళ కమాల్‌రెడ్డి జాతీయ జెండాలు ఎగురవేశారు. బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం వద్ద అధ్యక్షుడు కోకట్‌ మాధవరెడ్డి, జాతీయ జెండా ఎగురవేశారు. జిల్లా పోలీసు కేంద్ర కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు వ్యవసాయ సబ్‌ మార్కెట్‌ యార్డు, ఎంపీడీవో, మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి జాతీయ జెండాలను ఎగరవేశారు.  కాగా తాండూరు, ధారూరు, కోట్‌పల్లి, బంట్వారం మండలాల పరిధిలో విమోచన దినం సందర్భంగా బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.  తాండూరునియోజకవర్గంలో  పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌, తాండూరు మండలాల్లో వేడుకలు  ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణంలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వల్లాభాయ్‌పటేల్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. పట్టణంలోని అంబేద్కర్‌చౌక్‌లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. కాగా ప్రభుత్వం, ప్రవేటు, పాఠశాలలు, గ్రామ పంచాయతీలు,  పార్టీ కార్యాలయాల్లో నాయకులు జాతీయ జెండాలను ఎగురవేశారు. పలు చోట్ల సన్మానాలు చేశారు  వికారాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ నివాసం వద్ద  పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. తాండూరులోని బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు మైపాల్‌ పరిగి నియోజవర్గంలోని కులకచర్ల, పూడూరు, పరిగి మండలాల్లో తెలంగాణల సమైక్య, విలీనల వేడులను పరిగిలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా వైభవంగా జరుపుకున్నారు. పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, ఆయాపార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. 

సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ...

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా వికారాబాద్‌  ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి పార్టీ కార్యాలయం వరకు సీపీఎం నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆర్‌.వెంకట్‌రావు హాజరై మాట్లాడారు. తెలంగాణ పోరాటంలో లేని వారు కొందరు ఆ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు, తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.  • జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచాలి: మంత్రి మల్లారెడ్డి
  • ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

మేడ్చల్‌, సెప్టెంబర్‌ 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధికి చెందెలా కృషి చేస్తూ రాష్ట్రంలో ముందువరుసలో ఉండేలా  కృషి చేయాలని  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శనివారం మేడ్చల్‌ కలెక్టరేట్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా జరిగాయి. మంత్రి మల్లారెడ్డి  ముఖ్య అతిధిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లుగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించారు. జిల్లాను అభివృద్దిలో ముందుంచేందుకు కృషి చేయాలని అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నందుకు, 75వ వజ్రోత్సవ వసంతోలకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా జిల్లా ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు. హరితహారంతో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ఇంటింటికి మిషన్‌భగీరథ నీరు సరఫరా, మిషన్‌కాకతీయతో చెరువులకు జళకళ, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులకు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు  నర్సింహారెడ్డి, శ్యాంసన్‌, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్‌, బాలానగర్‌ డీసీపీ సందీప్‌, కలెక్టరేట్‌ ఏఈ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. కాగా మేడ్చల్‌ జిల్లాలోని మేడ్చల్‌, కీసర, ఘట్‌కేసర్‌, శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లో నాయకులు, అధికారులు, జాతీయ జెండాలను ఎగురవేశారు.
Read more