కేసీఆర్‌, కేటీఆర్‌ చొరవతోనే కొడంగల్‌ అభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-06T23:52:31+05:30 IST

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతోనే కొడంగల్‌ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు.

కేసీఆర్‌, కేటీఆర్‌ చొరవతోనే కొడంగల్‌ అభివృద్ధి
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

రేవంత్‌రెడ్డి ఆరోపణలు సరికాదు

ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

కొడంగల్‌, డిసెంబరు 6: సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సహకారంతోనే కొడంగల్‌ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్‌, కేటీఆర్‌లపై చేసిన ఆరోపణలు అర్థరహితం అని అన్నారు. రెండు పర్యయాలు ఎమ్మెల్యేగా కొనసాగినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయలేదని, కొడంగల్‌, కోస్గి మున్సిపాలిటీలకు రూ.56 కోట్లకు పైగా మంజూరైన నిధులతో పనులు కొనసాగుతున్నాయన్నారు. గ్రామాలు, తండాల్లో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. పాలమూర్‌ ఎత్తిపోతల పథకం దాదాపు 80 శాతం పూర్తయిందని, త్వరలోనే నారాయణపేట్‌ నుంచి కొడంగల్‌కు కాలువల పనులు పూర్తవుతాయని పాలమూర్‌ పర్యటనలో కేసీఆర్‌ ప్రకటించారన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌ ఎన్నికైన తర్వాత మునుగోడు, హుజురాబాద్‌ ఉపఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్‌ సైతం దక్కలేదన్నారు. ఎంపీగా రేవంత్‌రెడ్డి కేంద్రంతో రైల్వేలైన్‌, సిమెంట్‌ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్‌లో ప్రస్తావించి మంజూరు చేయిస్తే రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. రాబోయే ఎన్నికల్లో రేవంత్‌కు టికెట్లు అమ్ముకోవడానికి ఇప్పటి నుంచే బేరసారాలు ప్రారంభించరనే ఆధారాలు ఉన్నాయన్నారు. ఆయన తనపై కొడంగల్‌ నుంచే పోటీ చేసి గెలుపొందాలన్నారు. 9 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని, అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాయకులు కోట్ల మహిపాల్‌, విజయ్‌కుమార్‌, మధుయాదవ్‌, రాంరెడ్డి, సయ్యద్‌ అంజద్‌, చాంద్‌పాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-06T23:52:31+05:30 IST