ఎడతెరిపి లేని వాన

ABN , First Publish Date - 2022-09-12T05:15:53+05:30 IST

ఎడతెరిపి లేని వాన

ఎడతెరిపి లేని వాన
మత్తడి దూకుతున్న మేడ్చల్‌ పెద్ద చెరువు

  •  వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో  మోస్తరు నుంచి భారీ వర్షం
  •  పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు .. పంటచేలల్లోకి చేరిన  నీరు
  •   లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం.. జనం ఇబ్బందులు 
  •  గుంతలు పడిన రోడ్లు.. ప్రయాణికుల ఇబ్బందులు

పరిగి/దౌల్తాబాద్‌ /బొంరా్‌సపేట్‌/తాండూరు/ఘట్‌కేసర్‌ రూరల్‌ , వికారాబాద్‌/మేడ్చల్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :  అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో కురస్తున్న వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఆదివారం ఉదయం నుంచి ముసురుగా వర్షం కురుస్తూనే ఉంది. మధ్యాహ్నం కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ తిరిగి కాసేపటికే ఏకధాటిగా వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారి అలుగులు పారుతున్నాయి.  లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలుపడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని సూచిస్తున్నారు.  మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ మండలంలోని కుంటలు, చెరువులు, కాలువల్లోకి వరదనీరు చేరి నిండు కుండల్లా మారాయి. ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువు రెండు అలుగు పారుతున్నాయి. వెంకటాపూర్‌ నాడెం చెరువు, తెనుగూడెంలోని కుమ్మరికుంట చెరువులోకి నిండుగా నీరు చేరింది. అనంతారం కత్వ వద్ద మూసీనది ఉధృతంగా ప్రవహిస్తుంది.  24 గంటల్లో మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజల్‌లో అత్యధికంగా 42.8 మిల్లీమీటర్లు, డీపీ పల్లిలో 37.0 మిల్లీమీటర్లు, మేడ్చల్‌లో 34.8 మిల్లీమీటర్లు, బాచుపల్లిలో 32.5 మిల్లీమీటర్లు, కూత్బూల్లాపూర్‌ మండలం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భవన్‌ ప్రాంతంలో 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో శనివారం రోజంతా కురిసిన వర్షానికి దోమ మండలం, బుద్లాపూర్‌ - బ్రాహ్మణ్‌పల్లి మధ్య వాగు రోడ్డుపై పొంగి ప్రవహించడంతో ఆమార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బొంరా్‌సపేట మండలంలోని  చెరువులన్నీ వరద నీటితో కళకళలాడుతున్నాయి. వాగులు, చెరువులు, కుంటలు నిండుకుండలా ప్రవహిస్తున్నాయి. మండలంలో ప్రధాన కాకరవాణి వాగు వరద నీటితో ఉధృతంగా ప్రవహించడంతో మహంతీపూర్‌ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. దౌల్తాబాద్‌ మండలంలోని ఇమ్డాపూర్‌, బాలంపేట్‌, దేవరఫస్లాబాద్‌, దౌల్తాబాద్‌ చెరువులు కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లుతున్నాయి. దౌల్తాబాద్‌ పెద్ద చెరువులోకి వరద నీరు భారీగా చేరడంతో నిండుకుండలా మారింది.  తాండూరులో రెండు రోజులుగా ఏకధాటిగా వర్షం కురుస్తున్నది. యాలాల, వర్షం కారణంగా రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. కోతకు వచ్చిన పెసర, మినప పంటలు బాగా దెబ్బతిన్నాయి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో అత్యధికంగా 82.0 మి.మీ వర్షపాతం నమోదైంది. కుల్కచర్ల మండలం ముజాహిత్‌పూర్‌లో 66.8 మి.మీ, బొంరా్‌సపేటలో 61.5 మి.మీ, చౌడపూర్‌లో 49.0 మి.మీ, కొడంగల్‌లో 36.5మి.మీ, యాలాల మండలం దవలాపూర్‌లో 33.4మి.మీ, పరిగి మండలం రాపోల్‌లో 31.5మి.మీ, యాలాలలో 26.5మి.మీ, కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌లో 26.0మి.మీ, పూడూరు మండలం పెద్దముల్‌లో 23.3మి.మీ, నవాబుపేటలో 22.2మి.మీ, బొంరా్‌సపేటలో 31.0మి.మీ, వర్షపాతం నమోదైంది. 

దెబ్బతింటున్న రోడ్లు.. రాకపోకలకు ఇబ్బందులు

 పరిగి సబ్‌ డివిజన్‌లో రెండు రోజులుగా కురుస్తున్న ముసుర్ల వర్షంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కురిసిన వర్షానికి పరిగి మండలం లక్నాపూర్‌ ప్రాజెక్టు మళ్లీ పొంగిపొర్లుతోంది.  పరిగి, సుల్తాన్‌పూర్‌ వాగులు ప్రవహిస్తున్నాయి. రోజంతా ముసుర్ల వర్షంతో  జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు, చౌడాపూర్‌ మండలాల్లోనూ వర్షం కురిసింది. అక్కడక్కడ పొలాల్లో నీరు నిలిచింది. పరిగి శివారులోని వాగు ఉధృతంగా ప్రవహిచింది. పరిగి పట్టణంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలువడంతో ఇబ్బందులు పడ్డారు. శ్రీనివాసకాలనీ, బీసీ కాలనీ, బహార్‌పేట్‌ చౌరస్తా, తిరుమల వెంచర్లలో  నీరు నిలిచి జనం ఇబ్బందులు పడ్డారు. పరిగిమునిసిపల్‌ పరిధిలోని పరిగి-లక్నాపూర్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. పెద్దపెద్ద గుంతలుపడి రాకపోకలకు ఇబ్బందిగా  మారింది.

Read more