నిమజ్జనం నిధులు స్వాహా!

ABN , First Publish Date - 2022-09-11T05:25:58+05:30 IST

వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పంచాయితీతో పాలన అస్తవస్తంగా మారింది. దీంతో మునిసిపల్‌ కమిషనర్‌తో పాటు అధికారులకు సందేట్లో సడేమియా అన్న చందంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చైర్‌పర్సన్‌ లొల్లితో మేం ఏం చేస్తే అడిగేవారెవరూ.. అన్నట్లు అధికారులు ఉన్నారు.

నిమజ్జనం నిధులు స్వాహా!
నిమజ్జనం సమయంలో వికారాబాద్‌లో వెలగని విద్యుత్‌ దీపాలు (ఫైల్‌)


  •  రూ. 9 లక్షలు కేటాయింపు 
  •   అంతంత మాత్రమే చేపట్టిన పనులు
  •  పట్టణంలో వెలుగని లైట్లు..పూడ్చని గుంతలు
  •  మున్సిపల్‌ చైర్‌పర్సన్ల లొల్లి.. కమిషనర్‌ ఇష్టారాజ్యం

వికారాబాద్‌, సెప్టెంబరు10: వికారాబాద్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పంచాయితీతో పాలన అస్తవస్తంగా మారింది. దీంతో మునిసిపల్‌ కమిషనర్‌తో పాటు అధికారులకు సందేట్లో సడేమియా అన్న చందంగా  ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చైర్‌పర్సన్‌ లొల్లితో  మేం ఏం చేస్తే అడిగేవారెవరూ.. అన్నట్లు అధికారులు ఉన్నారు. వికారాబాద్‌లో వినాయక నిమజ్జనం కోసం రూ.9 లక్షలు కేటాయించారు. ఆ నిధులను రోడ్లపై గుంతలు పూడ్చడంతో పాటు లైట్ల మరమ్మతులు, తదితర పనులు చేపట్టేందుకు  ఖర్చు చేయాల్సి ఉంది. అయితే శుక్రవారం గణనాథులను నిమజ్జనం చేసే ప్రాంతంలో క్రేన్ల ఏర్పాటు  కోసం రెండింటికి రూ. 1.75 లక్షలు కేటాయించారు. పురపాలక సంఘం స్వాగత స్టేజీ కోసం రూ.65 వేలు కేటాయించారు. అయినా స్టేజీని నామమాత్రంగానే ఏర్పాటు చేసి అందిన కాడికి మింగేశారనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్‌ పట్టణం నుంచి ఎబ్బనూర్‌ చెరువు వరకు  ఆరు కిలోమీటర్లు మేర రోడ్డుకు  ఇరు పక్కల విద్యుత్‌ దీపాల ఏర్పాటుకు కోసం రూ.85 వేలు కేటాయించారు. అయితే  దారిపొడవునా లైట్లు మాత్రం ఏర్పాటు చేయలేదు. చెరువు వద్ద మాత్రమే దీపాలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. చెరువు వరకు వెళ్లే  విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని పోలీసులు, ఎమ్మెల్యే మునిసిపల్‌ అధికారులకు సూచించినా పట్టించుకోలేదు. కురుస్తున్న వర్షాలకు రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు ఏకంగా రూ.5 లక్షల వరకు కేటాయించారు. తూతూ మంత్రంగా అక్కడక్కడ గుంతలు పూడ్చి చేతులు దులుపుకున్నారు. వికారాబాద్‌ పట్టణంలో ఉన్న ప్రధాన విద్యుత్‌ దీపాలు వెలగడం లేదు. మొత్తానికి  ఇటు మున్సిపల్‌ చైర్‌పర్సన్ల పంచాయితీ, అటు నిమజ్జన ఏర్పాట్ల  నేపథ్యంలో అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మునిిసిపాటీ నుంచి నిమజ్జనానికి  కేటాయించిన డబ్బులను ఖర్చు చేయకుండా ఏం చేశారో గణనాథులు, అధికారులకే తెలియాలని పట్టణ వాసులు వాపోతున్నారు. నిమజ్జనానికి కేటాయించిన నిధులు అందినకాడికి దండుకున్నల్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


Read more