జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-27T04:47:22+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం

జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
యాచారం మండలం కుర్మిద్దలో కురుస్తున్న వర్షం

ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి / యాచారం/ కొత్తూర్‌, సెప్టెంబరు 26 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. సాయంత్రం ఆకస్మాత్తుగా కురిసిన వర్షంతో పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా నగరశివార్లలో కుంభవృష్టి పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి. అనేకచోట్ల గంట నుంచి రెండు గంటల పాటు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. అబ్ధుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 90మి.మీ వర్షం కురిసింది. అలాగే మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలో 83మి.మీ, సరూర్‌నగర్‌లో 72మి.మీ,  కొత్తూరులో  65మి.మీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్‌ అత్తాపూర్‌లో 64.3మి.మీ, కందుకూరులో 51మి.మీ, వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌లో 43మి.మీ. వర్షం కురిసింది. యాచారం, నజ్దిక్‌సింగారం, కుర్మిద్ద, మేడిపల్లి, తాడిపర్తి తదితర గ్రామాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వర్షానికి టమాట, బీర, కాకర, పొట్ల కూరగాయల పంటలకు నష్టం కలిగే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తూర్‌ మున్సిపాలిటీతోపాటు, మండలంలో ఆయా గ్రామాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో చిన్న కాలువలు పొంగిపొర్లాయి. రోడ్ల పక్కన గోతులు వర్షపు నీటితో నిండిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. Read more