ప్రభుత్వ భూమినీ వదలడం లేదు

ABN , First Publish Date - 2022-09-12T05:20:56+05:30 IST

నగర శివారులో భూములకు రెక్కలు రావడంతో

ప్రభుత్వ భూమినీ వదలడం లేదు
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి ఇదే..

  • రూ.15 కోట్ల విలువ చేసే స్థలం కబ్జా 
  • స్థానిక నాయకులతో కలిసి ఆక్రమించుకున్న రియల్టర్‌ 
  • పట్టించుకోని రెవెన్యూ అధికారులు 
  • చోద్యం చూస్తున్న ప్రజాప్రతినిధులు 
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు 


శంకర్‌పల్లి, సెప్టెంబరు 11; నగర శివారులో భూములకు రెక్కలు రావడంతో రియల్‌ వ్యాపారుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ఏకంగా రూ.15కోట్లు విలువ చేసే ఎకరం భూమిని కాజేస్తున్నా రెవెన్యూ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. 30సంవత్సరాల క్రితం ఎకరం భూమి 150 సర్వే నెంబర్‌లో ప్రభుత్వ స్థలంగా నిర్ణయించారు. 30ఏళ్లుగా ఖాళీగా ఉన్న స్థలాన్ని నగరానికి చెందిన ఓ బడా నాయకుడి అండదండలతో కబ్జాకు పాల్పడ్డారు. సర్వే నెంబర్‌ 150లోని భూమి తనదే అంటూ ఓ రియల్టర్‌ పత్రాలను చూపిస్తూ కాజేయడానికి చూస్తున్నాడు. ఇటీవల వరకు ఖాళీగా ఉన్న స్థలంలో రేకులతో ప్రహరీ కూడా నిర్మించారు. స్థానికంగా ఉండే కొంతమంది చోటామోట నాయకుల సపోర్ట్‌తో ఈ తతంగం అంతా జరుగుతున్నట్లు స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. 

శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దటూర్‌ గేట్‌ నుంచి పొన్నగుట్ట తండాకు వెళ్ళే దారిలో దొంతాన్‌పల్లి రెవెన్యూలో సర్వే నెంబర్‌ 150లో ఒక ఎకరం వ్యవసాయ భూమి ప్రభుత్వ స్థలమని నాలుగేళ్ల క్రితం అధికారులు నిర్ధారించారు. ఆ స్థలంలో ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు బోర్డు కూడా పాతారు. కానీ నగరానికి చెందిన ప్రముఖ రియల్‌ వ్యాపారి ఆ స్థలం తనదని ధ్రువపత్రాలు చూపడంతో అధికారులు ఖంగుతింటున్నారు. నాడు ప్రభుత్వ స్థలం అని చెప్పిన అధికారులే.. నేడు స్వయంగా బోర్డు తీసేయడం  పట్ల ప్రొద్దటూర్‌, ఇరుక్కుంట తాండ, దొంతాన్‌పల్లి గ్రామల సర్పంచ్‌లు, ప్రజలు అవాక్కవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవకుండా కాపాడేందుకు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.


ఉపేక్షించేది లేదు

ఈ విషయంపై స్థానిక తహసీల్దార్‌ను వివరణ కోరగా.. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. నగరానికి చెందిన ఓ వ్యాపారి సర్వే నెంబర్‌ 150లోని భూమి నాది అంటూ మాకు దరఖాస్తు చేసుకన్నాడని, త్వరలోనే సర్వే చేయించి.. ఆ స్థలం ప్రభుత్వానిదా, లేదా వ్యాపారిదా అని నిర్ధారణ చేస్తాం.

- నయీముద్దీన్‌ , తహసీల్దార్‌, శంకర్‌పల్లి Read more