ఖాళీ జాగా.. వేసెయ్‌ చెత్త

ABN , First Publish Date - 2022-03-17T04:15:17+05:30 IST

అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో

ఖాళీ జాగా.. వేసెయ్‌ చెత్త
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 11వ వార్డు బృందావన్‌ కాలనీలో ఇళ్ల మధ్యనే పేరుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్లు, చెత్త

  • పట్నం మున్సిపాలిటీలో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు
  • రోడ్లపైనే దర్శనమిస్తున్న ప్లాస్టిక్‌ కవర్లు
  • రెండుమార్లు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డు
  • అయినా మారని తీరు 


ఇబ్రహీంపట్నం, మార్చి16: అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఖాళీ జాగా కనిపిస్తే చాలు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇళ్ల మధ్య ఖాళీ స్థలం ఉందా.. వేయండి చెత్త అనే ధోరణి కనిపిస్తోంది. ఇప్పటికీ రెండుసార్లు 2018, 2021లో కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు తీసుకున్న ఈ మున్సిపాలిటీలో కొందరు తమ ధోరణి మార్చుకోవడం లేదు. ఏమైతదిలే అన్నట్లుగా ఇంటి పక్కన ఉన్న స్థలాలను చెత్తకుప్పలుగా మార్చేస్తున్నారు. ప్లాస్టిక్‌ కవర్లు కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా కాలనీల్లో చెట్ల మధ్యన చెత్త ఇరుక్కుని మురుగు కంపు కొడుతోంది. దీంతో ఈగలు, దోమల బెడద కూడా ఎక్కువవుతోంది. మున్సిపాలిటీ చెత్త వాహనాలు బస్తీల్లో తిరుగుతున్నా వాటిలో చెత్త వేయకుండా చెత్తను ఆరుబయటే వేస్తున్నారు. ఈ చెత్త కవర్లను పందులు ఆవాసంగా మార్చుకొని మరింత గలీజ్‌ చేస్తున్నాయి. 11వవార్డు బృందావన్‌ కాలనీ, మార్కెట్‌ యార్డు వెనక భాగాన ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీల్లో కొందరు చేసే నిర్వాకం వల్ల చుట్టుపక్కల జనం ఇబ్బంది పడాల్సి వస్తోంది.

 ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీని సంపూర్ణ పారిశుధ్య పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఓవైపు తగు చర్యలకు ఉపక్రమిస్తున్నా ఆశించిన ఫలితాలు చూపలేకపోతున్నాయి. ఇబ్రహీంపట్నంటౌన్‌తోపాటు శేరిగూడ, మల్‌షెట్టిగూడ, సీతారాంపేట్‌, ఖానాపూర్‌లు ఉండగా 24 వార్డులు ఉన్నాయి. ప్రస్తుత జనాభా సుమారుగా 40వేలు ఉం టుంది. మొత్తంగా 12చెత్త ఆటోలు, రెండు ట్రాక్టర్ల ద్వారా చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు.  


ప్లాస్టిక్‌ కవర్ల వాడకం ఎక్కువే..

 ప్లాస్టిక్‌ కవర్ల వాడకం కూడా విరివిగా ఉంది. ప్లాస్టిక్‌ వాడకాన్ని నిషేధించాలని తగు ప్రచారం కల్పిస్తున్నా అది అమలుకు నోచుకోవడం లేదు. ప్రతిదీ ప్లాస్టిక్‌ కవర్లలోనే ప్యాక్‌చేసి ఇస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు దాడులు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నప్పటికీ వ్యాపారులు, హోటల్‌ యజమానులు, పళ్ల దుకాణదారులు ఒకటేమిటి చికెన్‌, మటన్‌ వ్యాపారులు అంతా ప్లాస్టిక్‌ కవర్లు వాడుతునే ఉన్నారు. బస్తీల్లో రోడ్లపై ఎక్కడ చూసినా ఈ కవర్లే పేరుకుపోయి ఉన్నాయి. ఓ రకంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌కు ఇది అడ్డంకిగా ఉందని చెప్పొచ్చు. 


చెత్త ఆరుబయట వేస్తే చర్యలు 

ఇప్పటికే మున్సిపాలిటీలో ఇంటింటికీ చెత్త బుట్టలు పంపిణీ చేశాం. ఆరుబయట చెత్త వేయొద్దని ప్రచారం చేశాం. ఇంటితోపాటు చుట్టూ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. తమ సిబ్బందితో ఎప్పటికప్పుడు వీధుల్లో కూడా శుభ్రం చేయిస్తున్నాం. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పాం. ఆరుబయట చెత్త వేస్తే జరిమానా విధించి తగు చర్యలు తీసుకుంటాం. 

- ఎండీ యూసుఫ్‌, మున్సిపల్‌ కమిషనర్‌



Updated Date - 2022-03-17T04:15:17+05:30 IST