‘ఆయుష్మాన్‌ భారత్‌’తో ఉచిత వైద్యసేవలు

ABN , First Publish Date - 2022-11-23T00:03:42+05:30 IST

ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందవచ్చని జిల్లా మానిటరింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌ తెలిపారు.

‘ఆయుష్మాన్‌ భారత్‌’తో ఉచిత వైద్యసేవలు

కులకచర్ల/పరిగి/దోమ, నవంబరు 22: ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందవచ్చని జిల్లా మానిటరింగ్‌ అధికారి చంద్రప్రకాశ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుపై ఆరోగ్య సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగ న్‌వాడీ టీచర్ల ద్వారా ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు పొందవచ్చని తెలిపారు. ఈ కార్డు ద్వారా దేశంలో ఎక్కడైనా ఉచితంగా రూ.5లక్షల వరకు వైద్యసేవలు పొందవచ్చని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవలు పొందే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఆరోగ్య మిత్ర బాలరాజు, ఆయుష్‌ డాక్టర్‌ మహేశ్వరి, పల్లె దవాఖానా వైద్యులు ప్రశాంతి, శృతి, సూపర్‌వైజర్లు యాదమ్మ, విజయలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద గ్రామాల్లో రోగులను గుర్తించి, వారికి అవసరమైన వైద్యసేవలు అందిస్తామని పరిగి మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. చిట్యాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆయుస్మాన్‌ భారత్‌ పథకం కింద రోగులకు ఆరోగ్య కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్యకార్యకర్తలు, ఆశవర్కర్లు ఇళ్లకు వెళ్ళి చికిత్సలతో పాటు, మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు ప్రతీ రోజు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించాలని సూచించారు. ఓపీ రోగులు చిట్యాల్‌ కేంద్రానికి వచ్చే విధంగా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో శిక్షణ అధికారి వీరేశం, ఆరోగ్యమిత్ర బాలరాజు, సూపర్‌వైజర్లు, కార్యకర్తలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంపై దోమ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం అవగాహన కల్పించారు. వైద్యుడు మునీబ్‌ పాల్గొని మాట్లాడుతూ నేటి (బుధవారం) నుంచి గ్రామాల్లో ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలతో హెల్త్‌ కార్డుల కొరకు పేర్లు నమోదు చేయించడం జరుగుతుందన్నారు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-23T00:03:43+05:30 IST