క్రమబద్ధీకరణపై వేగంగా అడుగులు

ABN , First Publish Date - 2022-09-22T04:43:33+05:30 IST

క్రమబద్ధీకరణపై వేగంగా అడుగులు

క్రమబద్ధీకరణపై వేగంగా అడుగులు

  • ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని సర్కార్‌ ఆదేశం
  • దరఖాస్తుల విచారణకు 32 ప్రత్యేక బృందాలు  
  • జిల్లాలో 59జీవో కింద 13,229 దరఖాస్తులు 
  • శేరిలింగంపల్లి, అబ్ధుల్లాపూర్‌మెట్‌ నుంచి అత్యధికం
  • సర్కార్‌కు రంగారెడ్డి జిల్లా నుంచే అత్యధిక ఆదాయం


ఇళ్ల కోసం ఏళ్ల కింద ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ప్లాట్ల రెగ్యులరైజేషన్‌ కోసం ఉద్దేశించిన జీవో 59 కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. క్రమబద్ధీకరణ కోసం ప్రజల నుంచి గత ఫిబ్రవరిలోనే దరఖాస్తులను స్వీకరించింది. అయితే క్షేత్రస్థాయిలో అర్హుల పరిశీలన ప్రక్రియ పూర్తికాలేదు. ప్రభుత్వ భూముల్లో పాట్లు, ఇళ్ల క్రమబద్ధీకరణకు రాష్ట్రంలోకెల్లా రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. పెండింగ్‌ దరఖాస్తుల పరిశీలన, క్లియరెన్స్‌కు ప్రభుత్వం 32 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, సెప్టెంబరు 21): గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భూముల క్రమబద్ధీకరణను సత్వరమే పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పై క్షేత్రస్థాయిలో విచారణ జరిపే పక్రియ వేగవంతం చేశారు. ఈ నెలాఖరులోగా అన్ని దరఖాస్తులకు సంబంధించిన విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశింది. దీంతో క్షేత్రస్థాయిలో విచారించేందుకు జిల్లా అధికారులతో 32ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దసరా నాటికి  భూముల క్రమబద్ధీకరణ పక్రియ పూర్తిచేయాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందులో భాగంగా జిల్లా అధికారుల నుంచి ప్రతిపాదనలన్నీ ఈ నెలాఖరు నాటికి అందాలని ఆదేశించింది. ఇదిలా ఉంటే జీవో 59 కింద రంగారెడ్డి జిల్లాలోని27 మండలాల పరిధిలో 13,229 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా అబ్ధుల్లాపూర్‌మెట్‌ లో 3,866 దరఖాస్తులు రాగా తరువాత శేరిలింగంపల్లి లో 3,707 దరఖాస్తులొచ్చాయి. విస్తీర్ణం ప్రకారం చూస్తే శేరిలింగంపల్లిలోనే అత్యధికంగా దరఖాస్తులు అందాయి. జిల్లా వ్యాప్తంగా ఈ జీవో కింద 38,43,899 గజాల ఫ్రభు త్వ భూమి క్రమబద్ధీకరణకు దరఖాస్తులు అందగా ఇందులో శేరిలింగంపల్లి నుంచే అత్యధికంగా 12,73,820 చదరపు గజాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వచ్చా యి. ఈ మండలంలో భూముల ధరలు అత్యధికం కావడంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో అర్హతలు ఉన్న వారి కంటే అర్హతలు లేనివారే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందువల్ల అఽధికారులు ఈ మండలంపై క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్థానిక అధికారులు క్షేత్రస్థాయిలో వీటిపై తూతూ మంత్రంగా విచారణ జరిపి ఆమోదిస్తే రూ.వందల కోట్లు విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యే ఆస్కారం ఉంది. వాస్తవానికి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర సర్కార్‌ జారీ చేసి న 58, 59 జీవోల కింద రాష్ట్రంలో కెల్లా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలోనే అధికంగా దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వారు తమ స్థలాలను 58, 59జీవోల కింద క్రమబద్ధీకరించుకునేందుకు మారోసారి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం 2022 ఫిబ్రవరిలో మరోసారి ఉత్తర్వూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వేలల్లో దరఖాస్తులు చేసుకున్నారు.


  • పాత జీవో నిబంధనల ప్రకారమే ...

గతంలో అంటే 2014 డిసెంబరు 31వ తేదీన భూముల క్రమబద్ధీకరణ కోసం విడుదల చేసిన జీవో నెం.58(ఉచితంగా క్రమబద్ధీకరణ), జీవో నెం.59(నామమాత్రపు ఫీజు విలువతో) నిబంధనలు కూడా మార్చకుండానే వీటికి అనుబంధంగా ఈ ఏడాది ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ధారించిన భూము ల విలువ ఆధారంగా రుసుము వసూలు చేసి క్రమబద్ధీకరిస్తారు. ఈ క్రమబద్ధీకరణ ధరలు ఇలా ఉంటాయి. 126 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువలో 25 శాతం, 251 నుంచి 500 గజాల వరకు 50 శాతం, 500 నుంచి 1000 గజాల వరకు 75 శాతం, 1000 గజాల నుంచి ఆపైన పూర్తి విలువ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఈ జీవోల కింద రాష్ట్రంలోనే అధికంగా రంగారెడ్డి జిల్లాలో 31,830 దరఖాస్తులు రాగా వాటిల్లో జీవో59 కింద 13,229 దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణకు పట్టణ ప్రాంతాల్లోనే అఽధికంగా దరఖాస్తులు రావడం గమనార్హం. ఇదిలా ఉంటే భూముల క్రమబద్ధీకరణ వల్ల రాష్ట్రంలో వచ్చే ఆదాయంలో సింహభాగం రంగారెడ్డి జిల్లా నుంచే రానుంది. ఇందులో శేరిలింగంపల్లి మండ లం నుంచే భారీగా ఆదాయం రానుంది.

Read more