ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీ ఎత్తివేయాలని ఆందోళన ఉధృతం

ABN , First Publish Date - 2022-12-12T23:22:56+05:30 IST

కడ్తాల మండలం అన్యా్‌సపల్లి గ్రామ సమీపంలోని ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని వెంటనే మూసి వేయాలని కడ్తాల, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల, తండాల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉధృతం చేశారు

ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీ ఎత్తివేయాలని ఆందోళన ఉధృతం
కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న అన్మాస్‌పల్లి, సమీప గ్రామాల ప్రజలు

కడ్తాలలోని హైదరాబాద్‌- శ్రీశైలం రహదారిపై ధర్నా, భారీ ర్యాలీ

కడ్తాల, కందుకూరు మండలాల నుంచి కదిలివచ్చిన నేతలు, ప్రజలు

కలెక్టరేట్‌ ఎదుట నిరసన

అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేత

కడ్తాల్‌, డిసెంబరు 12: కడ్తాల మండలం అన్యా్‌సపల్లి గ్రామ సమీపంలోని ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీని వెంటనే మూసి వేయాలని కడ్తాల, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల, తండాల ప్రజలు చేపట్టిన ఆందోళన ఉధృతం చేశారు. ధ్వని, వాయు కాలుష్యాలతో దశాబ్దాలుగా ప్రజా జీవనానికి ఆటంకంగా మారిన మెటల్‌ కంపెనీని ఎత్తివేయాలని సోమవారం పెద్దఎత్తున ప్రజలు కదం తొక్కారు. కడ్తాల మండల కేంద్రంలో హైదరాబాద్‌- శ్రీశైలం హైవేపై బస్టాండ్‌ కూడలిలో బైఠాయించి ధర్నా, నిరసన ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కంపెనీని ఎత్తివేస్తామన్న ప్రకటన చేసేవరకు కదిలేది లేదని ప్రజలు భీష్మించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌కు వినతి పత్రం అందజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ , జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేశ్‌, ఎంపీటీసీలు బొప్పిడి గోపాల్‌, లచ్చిరామ్‌ నాయక్‌, అన్మా్‌సపల్లి సర్పంచ్‌ శంకర్‌, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య లు ఆందోళనకు సంఘీభావం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కడ్తాల మండల అధ్యక్షుడు కంబాల పరమేశ్‌, యువజన సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు ఎర్రోళ్ల రాఘవేందర్‌, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సేవ్యనాయక్‌, కడారి రామకృష్ణ, మహేశ్‌, లక్‌పతి నాయక్‌, ముత్తి కృష్ణ, పాండు నాయక్‌, బిక్షపతి, సుశీల, కుమార్‌,శ్రీరాములు, శ్రీనివాస్‌, లక్ష్మణ్‌, శ్రీకాంత్‌, బాలకృష్ణ, రమేశ్‌, సాయి, బీక్యనాయక్‌, దేవులా నాయక్‌, దాసు పాల్గొన్నారు.

కంపెనీని ఎత్తివేయకపోతే ఆమరణ దీక్ష : ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌

కడ్తాల, కందుకూరు మండలాల పరిధిలోని 50 గ్రామాలు, తండాల ప్రజలకు ఇబ్బందిగా మారిన ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీ మూసి వేయించేందుకు ప్రభుత్వం, ఉన్నతాదికారుల దృష్టికి తీసుకుపోతానని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. కంపెనీని ఎత్తివేయకపోతే కంపెనీ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడుతానని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ పరంగా చర్యలు : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

అన్మా్‌సపల్లి గ్రామ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎక్స్‌ప్లో ఫ్యాబ్‌ మెటల్‌ కంపెనీ గురించి జిల్లా కలెక్టర్‌, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతానని మంత్రి సబితాఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కడ్తాలలో కంపెనీని ఎత్తి వేయాలని ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలో తలకొండపల్లి మండలంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న మంత్రి సబితారెడ్డికి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి ప్రజాప్రతినిధులు, నాయకులు కంపెనీని మూసివేయాలని వినతి పత్రం అందజేశారు.

Updated Date - 2022-12-12T23:22:58+05:30 IST