-
-
Home » Telangana » Rangareddy » Excavations in the Ekwaipalli forest area-MRGS-Telangana
-
ఎక్వాయిపల్లి అటవీ ప్రాంతంలో తవ్వకాలు
ABN , First Publish Date - 2022-06-08T04:23:21+05:30 IST
మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలోని

- గుప్త నిధుల కోసమేనని స్థానికుల అనుమానం
- గతంలో తవ్వినవే అంటున్న అటవీ శాఖ అధికారులు
కడ్తాల్, జూన్ 7: మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామ సమీపంలోని శంకరాయ చెరువు దుబ్బదోన గుట్ట అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఎక్వాయిపల్లి-ముద్విన్ అటవీ సమీపంలోని అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారన్న సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దుబ్బదోన గుట్ట ప్రాంతంలో హిటాచి వాహనం, బోరు డ్రిల్లింగ్ వాహనంతో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కన్పిస్తుండడంతో గుప్తనిధుల కోసమే తవ్వకాలు చేపట్టి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో తవ్వకాలు జరపడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుప్తనిధుల కోసమా లేక మరే ఇతర కారణంతో తవ్వకాలు జరిపారోనన్న చర్చసాగుతోంది. గతేడాది కూడా ఇదేవిధంగా అటవీప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మళ్లీతవ్వకాలు వెలుగు చూడడం చర్చనీయాంశమైంది. కడ్తాల పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కాగా అటవీశాఖ అధికారులు మాత్రం అటవీప్రాంతంలో గతంలో చేసిన తవ్వకాలే తప్ప కొత్తగా ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు. అట్టి ప్రదేశంపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఆమనగల్లు అటవీ క్షేత్రాధికారి కమాలొద్దీన్ తెలిపారు. గతంలో తవ్వకాలు జరిపిన ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అటవీ శాఖ సిబ్బంది రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు కమాలోద్దీన్ తెలిపారు.