-
-
Home » Telangana » Rangareddy » Electric shock to uncle soninlaw-NGTS-Telangana
-
మామా అల్లుడికి విద్యుత్ షాక్
ABN , First Publish Date - 2022-09-17T05:37:41+05:30 IST
మామా అల్లుడికి విద్యుత్ షాక్

- అల్లుడు మృతి.. మామ పరిస్థితి విషమం
- వెంచర్‌లో జెండా పైపులు పాతుతుండగా ఘటన
తలకొండపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వెంచర్ జెండా పైపులు పాతుతుండగా మామా అల్లుళ్లు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో అల్లుడు మృతిచెందగా మామ పరిస్థితి విషమంగా మారింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తలకొండపల్లి ఎక్స్‌రోడ్డు సమీపంలో ఇటీవల 10ఎకరాల్లో నూతనంగా ‘విస్తారా’ పేరుతో వెంచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్‌లో తలకొండపల్లికి చెందిన పెద్దయ్యతో పాటు అతడి అల్లుడు ఎక్వాయిపల్లికి చెందిన గన్నాడి శివలింగంలు పనిచేస్తున్నారు. శుక్రవారం వెంచర్ చుట్టూ ప్రచారం, సుందరీకరణ కోసం మామాఅల్లుళ్లు కలిసి ఇనుప పైపులతో జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులు అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై పడ్డాయి. దీంతో మామ పెద్దయ్యతో పాటు అల్లుడు శివలింగం విద్యాదాఘాతానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో శివలింగం(35) అక్కడికక్కడే మృతిచెందగా ఆయన మామ పెద్దయ్య తీవ్రగాయాలపాలయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం తుక్కగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తమకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులు శివలింగం మృతదేహంతో వెంచర్ వద్ద ఆందోళనకు దిగారు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని రాత్రి వరకు భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న కడ్తాల ఎస్‌ఐ హరిశంకర్‌గౌడ్, తలకొండపల్లి ఎస్‌ఐ వెంకటేశ్‌లు ఘటనాస్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వెంచర్ నిర్వాహకులతో మాట్లాడారు. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తలకొండపల్లి పోలీసులు తెలిపారు.