బిందు, తుంపర సేద్యానికి గ్రహణం

ABN , First Publish Date - 2022-11-23T23:47:09+05:30 IST

బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం కరువైంది. డ్రిప్పు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు నిరాశే ఎదురువుతోంది. రెండేళ్లుగా పరికరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బిందు, తుంపర సేద్యానికి గ్రహణం

రెండేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం కరువు

బిందు, తుంపర సేద్యం పరికరాల కోసం రైతుల ఎదురుచూపు

బిందు, తుంపర సేద్యానికి ప్రోత్సాహం కరువైంది. డ్రిప్పు పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు నిరాశే ఎదురువుతోంది. రెండేళ్లుగా పరికరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు డ్రిప్పు పరికరాలు అందిస్తామని చెబుతున్నప్పటికీ.. ఏళ్లు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రాయితీపై బిందు సేద్యం పరికరాలను అందించాలని రైతులు కోరుతున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 23) : పంటల సాగులో నీటి ఆదా, వృఽథాను అరికట్టడానికి, అధిక దిగుబడులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం వంటి పద్ధతులను ప్రోత్సహిస్తోంది. ఇందుకుగాను రాయితీలిచ్చి పరికరాలు అందజేస్తోంది. భూగర్భ జలాల వినియోగం తగ్గించేందుకు ఇది దోహదపడుతుందని భావించారు. అందుకుగాను ప్రత్యేకంగా నిధులు కేటాయించి అందజేసేది. ఈ పథకం రెండేళ్ల నుంచి అమలుకు నోచుకోవడం లేదు. బిందు, తుంపర సేద్యానికి ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. రెండేళ్లుగా జిల్లాలో బిందు సేద్యం గణనీయంగా పడిపోతుంది. బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకుని రోజులు గడుస్తున్నా పరికరాలు అందించకపోవడంతో పంటలకు నీళ్లందించేందుకు రైతన్నలు అవస్థలు పడుతున్నారు.

బిందు, తుంపర సేద్యానికి రాయితీతో పరికరాల పథకానికి.. జిల్లాలో గ్రహణం పట్టింది. పథకం అమలు దాదాపు నిలిచిపోయింది. బిందు సేద్యం ద్వారా మొక్కకు రావాల్సిన నీటిని పైపుల ద్వారా చుక్కలు చుక్కలుగా అందిస్తారు. ఒకే మోతాదులో ప్రతి మొక్కకు నీరు అందడం, రసాయన ఎరువులను సరఫరా చేయడం వల్ల మొక్కలు ఏపుగా ఎదిగి.. అధిగ దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు. సంప్రదాయ పద్ధతిలో నీటి వినియోగ సామర్థ్యం 30 నుంచి 40 శాతం ఉంటే బిందు సేద్యంలో 90 నుంచి 95 శాతం వరకు ఉంటుంది. రైతులకు బిందు సేద్యం పరికరాలు అందకపోవడంతో ఎప్పటికప్పుడు నేలను చదును చేయడం, నీటిని పారబెట్టడం, ఎరువులు వేయడం వంటి పనులకు కూలీలను వినియోగించాల్సి రావడంతో భారంగా మారుతుంది. జిల్లాలో రెండేళ్ల కాలంలో 3,500 మంది రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో 81 హెక్టార్లకు డ్రిప్పు కార్యప్రణాళిక నిర్ణయించారు. 44 మంది రైతులకు పరిపాలన మంజూరు ఇచ్చారు. కానీ.. ఇప్పటివరకు డిప్పు మంజూరు కాలేదు. ఇప్పట్లో డ్రిప్పు పరికరాలు వస్తాయనే భరోసా కూడా రైతులకు కలగడం లేదు.

రెండేళ్లుగా ఇబ్బందులు

సాగునీటి పొదుపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం బిందు, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించింది. దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ రాయితీపై మంజూరు జరిగేది. రెండేళ్లుగా పరికరాలు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు డ్రిప్పు పరికరాలు అందిస్తామని చెబుతున్నప్పటికీ.. ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే రాయితీతో బిందు సేద్యం పరికరాలను అందిస్తే... ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు.

సబ్సిడీ ఇలా..

ఎస్సీ, ఎస్టీకి చెందిన రైతులకు వంద శాతం రాయితీ, వెనుకబడిన తరగతుల వారికి 90శాతం రాయితీ, ఇతరులకు 80శాతం రాయితీ హెక్టారుకు ఇవ్వడం జరుగుతుంది. చిన్న, సన్నకారు రైతులకు 5 హెక్టార్ల వరకు రాయితీ కల్పిస్తున్నారు.

ఉద్యానశాఖ అధికారిని కలిసిన తలకొండపల్లి రైతులు

మేడం మేం.. డ్రిప్పు కోసం దరఖాస్తు చేసుకున్నాము.. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాము. మాకు డిప్పు పరికరాలు అందించాలని తలకొండపల్లి మండలానికి చెందిన హర్టికల్చర్‌ సెరికల్చర్‌ రైతులు ఉద్యానశాఖ అధికారి సునందారాణిని కోరారు. అప్పుచేసి డ్రిప్పు వేసుకుంటాము... మాకు సబ్సిడీ ఇప్పించాలని కోరగా.. అలా కుదరదని చెప్పారు. డ్రిప్పు కోసం కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ను, మంత్రి నిరంజన్‌రెడ్డి కలిసినట్లు తెలిపారు. జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి స్వయంగా సిఫారసు చేసిన లేఖను సమర్పించినట్లు తెలిపారు. త్వరలో డ్రిప్పు మంజూరు కానున్నట్లు, మొదటి ప్రాధాన్యత తలకొండపల్లి రైతులకు ఇస్తానని భరోసా ఇచ్చారు. పట్టు పరిశ్రమను అభివృద్ధి చేసుకుని లాభాలను పొందాలని ఆమె రైతులకు సూచించారు.

అదనపు లక్ష్యం కోసం ప్రతిపాదనలు పంపించాం

డ్రిప్పు, స్ర్పింక్లర్స్‌ కోసం జిల్లాలో గత ఏడాదితోపాటు ఈ సారి కలిపి 3,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 81 హెక్టార్లకు డ్రిప్పు, స్ర్పింక్లర్స్‌ కోసం పాలన అనుమతులు వచ్చాయి. అదనపు పరికరాల కోసం జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ అనుమతితో ఉద్యానశాఖ డైరక్టర్‌కు ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ద్వారా పరికారాలు మంజూరు కాగానే.. ప్రాధాన్యత క్రమంలో బిందు, తుంపర సేద్యం పరికరాలు అందజేస్తాము.

- సునందారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి

Updated Date - 2022-11-23T23:47:10+05:30 IST