ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు

ABN , First Publish Date - 2022-08-26T05:19:14+05:30 IST

ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు

ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు

యాచారం/కందుకూరు/ఇబ్రహీంపట్నం, ఆగస్టు 25: తమ డిమాండ్లను పరిష్కరించాలని సమ్మెబాట పట్టిన వీఆర్‌ఏలను సీఎం కేసీఆర్‌ రాక నేపథ్యంలో యాచారం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవానికి వస్తున్న సీఎం కేసీఆర్‌ సభకు వీఆర్‌ఏలు ఆందోళన చేసే అవకాశాలు ఉండడంతో పోలీసులు అప్రమత్తమై గురువారం తెల్లవారు జామున వీఆర్‌ఏలను అరెస్టు చేసి సాయంత్రం విడుదల చేశారు. అరెస్టు అయిన వారిలో జంగయ్య, మహే్‌షకుమార్‌, భాస్కర్‌, నవీన్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌, కిష్టయ్యలు ఉన్నారు. అదేవిధంగా కందుకూరులో బీజేపీ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. ఎంపీపీ మంద జ్యోతితో పాటు ఆ పార్టీ జిల్లా పంచాయతీ సెల్‌ కన్వీనర్‌ సాధ మల్లారెడ్డి, బీజేపీ నేతలు మల్లేష్‌, నర్సింహారెడ్డి, సత్యనారాయణరెడ్డి, కె.జంగారెడ్డి, అంజిరెడ్డి, చెన్నారెడ్డి, వెంకట్‌రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి సాయంత్రం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు చిలుక మధుసుధన్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్‌కుమార్‌, నందకిషోర్‌లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: బొక్క నర్సింహారెడ్డి 

కందుకూరు, ఆగస్టు 25: రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నేతలను అక్రమ అరెస్టులు చేయడంతో బీజేపీ నేతలు భయపడేది లేదని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రంగారెడ్డి కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి వెళ్లకుండా బీజేపీ ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమమన్నారు. తుక్కుగూడ మున్సిపాల్టి చైర్మన్‌ మధుమోహన్‌తో పాటు బీజేపీ కౌన్సిలర్లను అరెస్టు చేయడం సరికాదన్నారు. 

Read more