నిధుల్లేక నీరసం!

ABN , First Publish Date - 2022-10-12T04:25:27+05:30 IST

ఆదాయ వనరులు అంతగా లేని చిన్న గ్రామ పంచాయతీల పరిస్థితి కత్తిమీద సాములా మారింది. పెద్ద పంచాయతీల్లో నిధుల కొరత అంతగా లేకున్నా చిన్న పంచాయతీలకు మాత్రం నిధుల కొరత వేధిస్తోంది.

నిధుల్లేక నీరసం!

  •  పంచాయతీలకు పైసల్లేవ్‌ 
  • నిలిచిపోయిన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు
  •  చిన్న పంచాయతీల్లో కష్టంగా రోజువారి నిర్వహణ పనులు
  •  రెండు మూడు నెలలుగా అందని నిధులు

 ఆదాయ వనరులు అంతగా లేని చిన్న గ్రామ పంచాయతీల పరిస్థితి కత్తిమీద సాములా మారింది. పెద్ద పంచాయతీల్లో నిధుల కొరత అంతగా లేకున్నా చిన్న పంచాయతీలకు మాత్రం నిధుల కొరత వేధిస్తోంది. ఖాతాల్లో నిధులు లేకపోవడంతో రోజు వారీగా పారిశుధ్య పనుల నిర్వహణ కూడా కష్టంగా మారిందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  కార్మికులకు గౌరవ వేతనం చెల్లించలేని దుస్థితి నెలకొంది. 

వికారాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :గ్రామ పంచాయతీలు నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి విడుదలయ్యే నిధులు కొన్ని నెలలుగా నిలిచిపోవడంతో గ్రామ పంచాయతీలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. పెద్ద గ్రామ పంచాయతీల విషయం ఎలా ఉన్నా ఆదాయ వనరులు అంతగా లేని చిన్న పంచాయతీల్లో కనీసం పారిశుద్ధ్యం పనులు కూడా సక్రమంగా చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. కరెంట్‌ బిల్లులు, ట్రాక్టర్‌ ఈఎంఐ, ట్రాక్టర్‌ నిర్వహణ (డీజిల్‌, డ్రైవర్‌)కయ్యే ఖర్చులు పంచాయతీలకు భారంగా పరిణమించాయి. పారిశుద్ద్యం పనులు చేపట్టే కార్మికులకు గౌరవ వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది.  పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించిన తరువాత ప్రతిరోజూ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఖాతాల్లో నిధులు లేకపోవడంతో రోజు వారీగా పారిశుధ్య పనుల నిర్వహణ కూడా కష్టతరంగా మారిందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్తి పన్ను, ఇతర రూపాల్లో ఆదాయం సమకూరే అవకాశం కలిగిన పంచాయతీలు కూడా నిధులు వాడుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. 

ఆర్థిక సంఘం నిధులతోనే అన్నీ..

గ్రామ పంచాయతీలకు ప్రతినెలా రాష్ట్ర ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యేవి. ఈ నిధులతోనే పంచాయతీల్లో కరెంట్‌ బిల్లులు, ట్రాక్టర్‌ ఈఎంఐ, ట్రాక్టర్‌ నిర్వహణ, పారిశుధ్యం పనులు, కార్మికుల (ఎంపీడబ్ల్యూ) వేతనాలు, వీధి దీపాల మరమ్మతులు తదితర పనులు చేపట్టేవారు. ఇతర అభివృద్ధి పనులకు కూడా ఆ నిధులు వెచ్చించేవారు. రెండు, మూడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీలు నిధుల కటకట ఎదుర్కొంటున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామాల వారీగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలని సూచించడంతో పంచాయతీ పాలకవర్గాలు కొత్త ఖాతాలు తెరిచారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమయ్యేవి. ఆ తరువాత ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసేది.  అయితే పంచాయతీలు కొత్తగా ప్రారంభించిన ఖాతాల్లో ఇంత వరకు నిధులు జమ కాలేదు. 

చిన్న పంచాయతీలకు కత్తిమీద సామే

ఆదాయ వనరులు అంతగా లేని చిన్న గ్రామ పంచాయతీల పరిస్థితి కత్తిమీద సాములా మారింది.  జిల్లాలో 566 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 250 వరకు చిన్న పంచాయతీలు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా జిల్లాలోని పంచాయతీలకు రూ.139 కోట్ల నిధులు వస్తాయి. ప్రతినెలా సుమారు రూ.12 కోట్ల వరకు పంచాయతీలకు నిధులు కేటాయించేవారు. అయితే కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కొన్ని నెలలుగా నిలిచిపోవడంతో పంచాయతీల్లో, ముఖ్యంగా చిన్న పంచాయతీల్లో రోజువారీ పారిశుధ్యం పనుల నిర్వహణ, కార్మికుల వేతనాలు, కరెంట్‌ బిల్లులు, ట్రాక్టర్‌ ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో ఇతర ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీల్లో వారికి కూడా నెలనెలా వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొంది. పారిశుధ్యం పనులు చేపట్టేందుకు ఉపయోగించే ట్రాక్టర్‌కు డీజిల్‌ పోయించలేని పరిస్థితి ఏర్పడిందని సర్పంచులు వాపోతున్నారు. 

ఓ చిన్న పంచాయతీ ఆదాయ, వ్యయాలు

మర్పల్లి మండలం, జంషెడ్‌పూర్‌ పంచాయతీకి ప్రతినెలా ఆర్థిక సంఘం నిధుల రూపంలో రూ.57,667 సమకూరితే, పంచాయతీ నుంచి రూ.59,022 చెల్లింపులు చేస్తున్నారు. సీసీ ఛార్జిలకు రూ.9,500, పారిశుధ్య (మల్టీపర్పస్‌)కార్మికుల వేతనాలకు రూ.15,550, ట్రాక్టర్‌ నిర్వహణకు రూ.12,500, ట్రాక్టర్‌ ఈఎంఐ (మూడు నెలలకు ఒకసారి)రూ. 21,522 ఖర్చు చేస్తున్నారు. కాగా,  ఎంపీడబ్ల్యూలకు వేతనాలు, ట్రాక్టర్‌ ఈఎంఐ చెల్లించేందుకు తమ గ్రామ పంచాయతీకి రూ.3లక్షలు మంజూరు చేయాలని జంషెడ్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ నూరొద్దీన్‌ సోమవారం జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన తన గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ  కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. 

  • కలెక్టర్‌ గారూ... రూ.3 లక్షలు మంజూరు చేయండి: నూరొద్దీన్‌, సర్పంచ్‌, జంషెడ్‌పూర్‌

నాలుగు నెలల నుంచి మా పంచాయతీకి ఎస్‌ఎఫ్‌సీ, 15ఎఫ్‌సీ నిధులు రాలేదు. నిధులు లేని కారణంగా ఎంపీడబ్ల్యూలకు వేతనాలు, ట్రాక్టర్‌ ఈఎంఐ, కరెంట్‌ బిల్లులు చెల్లించేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. నాలుగు నెలలుగా ఎంపీడబ్ల్యులకు వేతనాలు, ట్రాక్టర్‌ ఈఎంఐ చెల్లించలేదు.  ఎంపీడబ్ల్యులకు వేతనాలు, ట్రాక్టర్‌ ఈఎంఐ చెల్లించేందుకు తమ పంచాయతీకి  రూ.3 లక్షలు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరుతున్నా.


Read more