ఆహారాన్ని వృథా చేయొద్దు

ABN , First Publish Date - 2022-10-15T04:32:28+05:30 IST

ఆహారాన్ని వృథా చేయొద్దు

ఆహారాన్ని వృథా చేయొద్దు
విజేతలతో కలెక్టర్‌, అధికారులు

ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందేలా చర్యలు  : కలెక్టర్‌ నిఖిల 

వికారాబాద్‌, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఆహార కొరత లేకుండా ప్రతి ఒక్కరికీ పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని  కలెక్టర్‌ కె.నిఖిల అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌ కార్డుల ద్వారా రేషన్‌ సరఫరా చేస్తున్నాయని చెప్పారు. ఆహారం వృథా కాకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు రాబోయే రోజుల్లో మంచి పౌరులుగా ఎదిగేలా పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆహార భద్రతా చట్టంపై రేషన్‌ డీలర్లు, రేషన్‌కార్డు లబ్దిదారులు, అంగన్‌వాడీ  టీచర్లు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లకు వకృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. విజేతలకు జిల్లా కలెక్టర్‌ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో అశోక్‌కుమార్‌, డీఆర్‌డీవో కృష్ణన్‌, డీఆర్‌డీవో రాజేశ్వర్‌, డీడబ్ల్యువో లలితకుమారి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం విమల, డీఈవో రేణుకాదేవి, ఆర్డీవో విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-15T04:32:28+05:30 IST