రింగ్‌ పడేనా!

ABN , First Publish Date - 2022-02-20T04:14:48+05:30 IST

వాహనాల రద్దీని నియంత్రించేందుకు వికారాబాద్‌ చుట్టూ ప్రతిపాదించిన రింగ్‌ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది.

రింగ్‌ పడేనా!

  • ప్రతిపాదనలకు మూడేళ్లు..
  • రింగ్‌రోడ్డు ఏర్పాటుతో తగ్గనున్న ట్రాఫిక్‌, కాలుష్యం సమస్య
  • ఈ సారి బడ్జెట్‌లోనైనా ఆమోద ముద్ర పడేనా

వాహనాల రద్దీని నియంత్రించేందుకు వికారాబాద్‌ చుట్టూ ప్రతిపాదించిన రింగ్‌ రోడ్డు నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమవుతోంది. రెండు దశాబ్దాలుగా కలగా మారిన ఈ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపించినా ఇంత వరకు  సర్కారు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈ సారి బడ్బెట్‌ సమావేశాల్లోనైనా  ఆమోద ముద్ర కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. 

వికారాబాద్‌, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : ఏటేటా వికారాబాద్‌కు రద్దీ పెరుగుతూ వస్తోంది. అనంతగిరి కొండలు, రిసార్ట్స్‌, కోట్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చే సందర్శకులు సంఖ్య పెరుతోంది. జిల్లా కేంద్రమైన తరువాత హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేస్తున్నారు. రాకపోకలు బాగా పెరగడంతో వాహనాల రద్దీ బాగా పెరిగింది. వికారాబాద్‌ మీదుగా తాండూరు, మోమిన్‌పేట్‌, మర్పల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు పట్టణంలో నుంచి వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారుతోంది. ఎన్నేపల్లి మీదుగా వికారాబాద్‌ పట్టణంలోకి వచ్చేందుకు ఏర్పాటు చేసిన రోడ్డోవర్‌ బ్రిడ్జి ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న వాహనాల రాకపోకల దృష్ట్యా వికారాబాద్‌ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నా.. ప్రభుత్వాలుపట్టించుకోకపోవడంతో ఈ ప్రతిపాదన కాగితాల వరకే పరిమితమవుతూ వచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ప్రతి జిల్లా కేంద్రం చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించిన విష యం తెలిసిందే. అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రానికి కనెక్టివిటీ పెంచి ట్రాఫిక్‌ సమస్యను అధిగమించేందుకు రింగ్‌ రోడ్డు నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులు వికారాబాద్‌ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదనలు పంపించి మూడేళ్లవుతున్నా రింగ్‌రోడ్డు నిర్మాణంపై ఇంతవరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సంజీవరావు  రింగ్‌రోడ్డు మంజూరు చేయాలంటూ పలుమార్లు సీఎం కేసీఆర్‌, అప్పటి ఆర్‌అండ్‌బీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సీఎం దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఆమోద ముద్ర లభిస్తుందన్న ఆశతో ప్రజలు చూస్తున్నారు. 

ట్రాఫిక్‌, కాలుష్య సమస్యలతో ఇక్కట్లు

వికారాబాద్‌ ప్రాంత ప్రజలకు రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉండడం సంతోషకరమైనా చుట్టూ నాలుగు వైపులా రైలు పట్టాలు ఉండడం పట్టణాభివృద్ధికి విఘాతంగా మారింది. తాండూరు, హైదరాబాద్‌, బుగ్గ, సదాశివపేట వైపు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గాల్లో రైలుమార్గాలు ఉన్నాయి. చుట్టూ రైలు పట్టాలు ఉండడంతో ఆశించిన స్థాయిలో విస్తరణకు నోచుకోలేకపోతోంది. వికారాబాద్‌ పట్టణం ఆశించిన స్థాయిలో విస్తరించక పోవడానికి చుట్టూ ఉన్న రైలు పట్టాలు ఓ ప్రధాన కారణంగా మారాయి. 

రింగ్‌రోడ్డు నిర్మాణం.. వేగంగా విస్తరణ

వికారాబాద్‌ జిల్లా కేంద్రం చుట్టూ 56.90 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌ రోడ్డు ప్రతిపాదించారు. ఈ రోడ్డు నిర్మాణానికి చాలా వరకు తక్కువ భూసేకరణ చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు. భూములు ఎక్కువగా కోల్పోయే విధంగారోడ్డు నిర్మాణం చేపడితే భూ సేకరణలో సమస్యలు ఉత్పన్నమై పనులు చేపట్టడంలో జాప్యం జరిగే అవకాశం ఉంటుందని ఊహించిన అధికారులు తక్కువ విస్తీర్ణంలో భూసేకరణ జరిగే విధంగా రింగ్‌ రోడ్డు పనులు ప్రతిపాదించారు. హైదరాబాద్‌ - బీజాపూర్‌ అంతరాష్ట్ర రహదారి వెళ్లే మన్నేగూడ నుంచి ప్రారంభమయ్యే రింగ్‌ రోడ్డు.. మీర్జాపూర్‌, పీరంపల్లి, చించల్‌పేట్‌, పెండ్లిమడుగు, మూలమడ, నారాయణపూర్‌, బంగారు మైసమ్మ దేవాలయం, అత్తెల్లి, కొంపల్లి, గిరిగెట్‌పల్లి, అనంతగిరిపల్లి, జైదుపల్లి, గోధుమగూడ, బూర్గుపల్లి, గుడుపల్లి, దామగుండం, పూడూరు మీదుగా తిరిగి మన్నెగూడ వద్ద కలిసే విధంగా ప్రతిపాదించారు. త్వరలో బడ్జెట్‌ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇది వరకే ప్రభుత్వ పరిశీలనలో ఉన్న వికారాబాద్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించి అవసరమైన నిధులను కేటాయించే విధంగా  మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకు రావాలని జిల్లాకేంద్రం ప్రజలు కోరుతున్నారు. 

విస్తరణకు నోచని వికారాబాద్‌

జిల్లాలో పట్టణీకరణ విషయానికి వస్తే తాండూరు, పరిగిలతో పోలిస్తే వికారాబాద్‌ ఎంతో వెనకబడింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరణకు నోచుకోవడం లేదు. ఇరుకైనా రోడ్లతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్‌ మునిసిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌లోనూ రింగ్‌రోడ్డు ప్రతిపాదన ఉంది. శాటిలైట్‌ ప్రాజెక్టు పనుల్లో భాగంగా వికారాబాద్‌ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మాణం ప్రతిపాదించగా, మొదటి విడత పనులతోనే శాటిలైట్‌ ప్రాజెక్టు కథ ముగిసింది.  రింగ్‌రోడ్డు కల సాకారం కాలేదు. తాండూరు, సదాశివపేట, హైదరాబాద్‌ నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారుతోంది. తాండూరు నుంచి సిమెంట్‌, నాపరాతి లోడ్లతో వెళ్లే వాహనాలతో ట్రాఫిక్‌ సమస్యతో పాటు కాలుష్య సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. భారీ వాహనాలు పట్టణంలోకి ప్రవేశించకుండా బయటి  నుంచే వాటి గమ్యస్థానాలకు వెళ్లడానికి వీలుగా రింగ్‌ రోడ్డు ప్రతిపాదించారు. 

Updated Date - 2022-02-20T04:14:48+05:30 IST