అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు

ABN , First Publish Date - 2022-03-06T04:24:55+05:30 IST

అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు

అట్రాసిటీ కేసుల్లో అలసత్వం వద్దు
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

  • కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ 

రంగారెడ్డి అర్బన్‌, మార్చి 5: అట్రాసిటీ కేసులపై అలసత్వం వహించకుండా చార్జిషీట్‌లను త్వరితగతిన చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పోలీసులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో 2022 సంవత్సరానికి సంబంబంధించి నూతన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా చేసి సాధ్యమైనంత చార్జిషీట్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే.. పకడ్బందీ దర్యాప్తు జరిపి పూర్తి ఆధారాలతో చార్జిషీట్‌ ఫైల్‌ చేయాలన్నారు. లేకుంటే కేసులు రోజుల తరబడి పెండింగ్‌లో ఉండి బాధితులు నిరుత్సాహానికి లోనవుతున్నారని తెలిపారు. కేసు నమోదైన వెంటనే ఎఫ్‌ఐఆర్‌తో పాటు బాధితుల ఆధార్‌కార్డు, బ్యాంకు వివరాలను కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. ఈ విషయంలో జాప్యం లేకుండా నివేదికలను సమర్పించడం ద్వారా బాధితులకు సకాలంలో పరిహారాన్ని అందించే వీలుగాంటుందని చెప్పారు. ట్రయల్‌ కేసుల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. జిల్లాలో రెండేళ్ల కాలంలో సైబరాబాద్‌ పరిధిలో 253 కేసులు, రాచకొండ పరిధిలో 157 కేసులు నమోదయ్యాయన్నారు. వాటిలో సైబరాబాద్‌, రాచకొండ పరిఽధిలో 87కేసుల చొప్పున పెండింగ్‌లో ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మాట్లాడుతూ సైబరాబాద్‌ పరిధిలో 87కేసులు పెండింగ్‌లో ఉన్నాయని... వాటి పరిష్కారానికి కృషిచేస్తునట్లు చెప్పారు. ప్రతి నెలా అధికారులతో కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు, డీఆర్వో హరిప్రియ, ఎస్టీ వెల్ఫేర్‌ అధికారి శ్రీధర్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు, ఆర్డీవోలు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T04:24:55+05:30 IST