నిరాశే మిగిలింది!

ABN , First Publish Date - 2022-08-18T05:11:04+05:30 IST

నిరాశే మిగిలింది!

నిరాశే మిగిలింది!
వికారాబాద్‌ : సమావేశంలో మాట్లాడుతున్న గడ్డం ప్రసాద్‌కుమార్‌

  • సీఎం పర్యటన సందర్భంగా హామీల అమలు, 
  • నిధుల మంజూరుపై జిల్లావాసుల గంపెడాశలు
  • వికారాబాద్‌లో అన్‌ఫిట్‌, అసమర్ధ ఎమ్మెల్యే 
  • ఈ ప్రాంతానికి అన్యాయం చేసింది ముఖ్యమంత్రే!
  • జిల్లా సీఎం ఇచ్చింది కాదు.. కొట్లాడి తెచ్చుకున్నాం..
  • పాలమూరు పాపం ముఖ్యమంత్రి కేసీఆర్‌దే
  • విలేకరుల సమావేశంలో మాజీమంత్రి ప్రసాద్‌కుమార్‌

 వికారాబాద్‌, ఆగస్టు 17: ముఖ్యమంత్రి పర్యటన వికారాబాద్‌ జిల్లా ప్రజలకు నిరాశే మిగిల్చిందని, వికారాబాద్‌లో అన్‌ఫిట్‌, అసమర్ధ ఎమ్మెల్యే ఉన్నాడని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్‌కు గత మంగళవారం సీఎం కేసీఆర్‌ వస్తుండటంతో జిల్లా ప్రజలతో పాటు తాము కూడా ఎంతో ఆశతో ఆత్రుతగా ఎదురుచూశామని, ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి, అభివృద్ధికి సహకరిస్తాడని, గతంలో ఇచ్చిన హామీలపై స్పష్టతనిస్తారని ఆశించినట్లు ప్రసాద్‌కుమార్‌ పేర్కొన్నారు. సీఎం పర్యటన సందర్భంగా పక్క పార్టీల మాదిరిగా తాము అడ్డుకుంటామని చెప్పలేదన్నారు. ప్రధాని మోదీ పగిడీ ధరించి తిరిగితే.. సీఎం కేసీఆర్‌ టోపీ పెట్టుకుని తిరుగుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వికారాబాద్‌ జిల్లా సీఎం ఇచ్చింది కాదని, ఇక్కడి ప్రజలు, తాము కొట్లాడితే వచ్చిందన్నారు. పాలమూరు రంగారెడ్డి గురించి సీఎం మాట్లాడింది పచ్చి అబద్ధమని, దానికీ మోదీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను మంత్రిగా ఉన్నసమయంలో జూరాల నుంచి మమ్మదాబాద్‌ వరకు నీటిని తీసుకొచ్చి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు సాగునీరందించాలని సర్వే చేయడం జరిగిందన్నారు. కానీ, కేసీఆర్‌ దానికి రీడిజైన్‌ చేసి జూరాల నుంచి శ్రీశైలానికి సాగునీరు తీసుకుపోయాడన్నారు.

వికారాబాద్‌ ప్రాంతానికి  రింగ్‌రోడ్డు అవసరం ఉందని, ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్లు కన్పించడం లేదని, టూరిజం అభివృద్ధికి నోచుకోలేదని మాజీ మంత్రి అన్నారు. కేవలం ఎమ్మెల్యే ఇంట్లో చాయ్‌ తాగడానికి, ఇక్కడి భూములు స్వాహా చేసే ఆలోచనతో వచ్చారన్నారు. కలెక్టరేట్‌ వద్ద భూములు కొల్పోయిన ఎస్సీ, ఎస్టీలకు పరిహారం ఇవ్వకుండా కలెక్టరేట్‌ను ప్రారంభించడం అన్యాయమన్నారు. వికారాబాద్‌ జిల్లా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్‌ అని, కేవలం సీఎం తన స్వార్థం కోసం ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 33 జిల్లాలను 18 జిల్లాలు చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు సుధాకర్‌రెడ్డి, రత్నారెడ్డి, కిషన్‌ నాయక్‌, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ విశ్వనాథం సత్యనారాయణలు మాట్లాడుతూ సీఎం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంతానికి రూ.100కోట్ల నిధులు మంజూరు చేస్తారని, వికారాబాద్‌కు మాత్రం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. వికారాబాద్‌ బ్రిడ్జి కోసం రూ.12కోట్లు తెచ్చామని ఎమ్మెల్యే చెప్పినా.. ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. మంగళవారం జరిగిన సభలో సీఎంను చూస్తే టీఆర్‌ఎస్‌ పార్టీ చనిపోయే పరిస్థితి ఆయన ముఖంలో కన్పించిందన్నారు. దక్షిణ తెలంగాణను సీఎం ఏడారిగా మారుస్తున్నారని అన్నారు. నాయకులు ఎర్రవల్లి జాఫర్‌, నర్సిములు, పెండ్యాల అనంతయ్య, దుద్యాల లక్ష్మణ్‌, రఘుపతిరెడ్డి, సతీష్‌, రవిశంకర్‌, శ్రీనుముదిరాజ్‌, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

  • జిల్లాకు వరాలు ప్రకటించని సీఎం : తాండూరు కాంగ్రెస్‌ నాయకులు 

తాండూరు : సీఎం పర్యటన సందర్భంగా అభివృద్ధి పనులు, హామీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లావాసులకు నిరాశే మిగిలిందని పెద్దేముల్‌ జడ్పీటీసీ ధారాసింగ్‌, కాంగ్రెస్‌ తాండూరు పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌, సీనియర్‌ నాయకులు జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. తాండూరులో విలేకరులతో మాట్లాడుతూ వికారాబాద్‌లో సీఎం సభ జనం లేక వెలవెలబోయిందన్నారు. తాండూరుకు మెడికల్‌, నర్సింగ్‌ కళాశాలలు ఇస్తామని రెండుసార్లు తాండూరు పర్యటనలో సీఎం ప్రకటించినప్పటికీ మంజూరు చేయలేకపోయారని, నాపరాయి, సుద్దపై రాయల్టీ తగ్గిస్తానని హామీ ఇచ్చి విస్మరించారని అన్నారు. అలాగే తాండూరు కందికి ప్రాధాన్యత ఇవ్వలేదని, కంది బోర్డు ఏర్పాటుకు హామీ నీటిమూటగా మారిందన్నారు. సీఎం రాచరిక వ్యవస్థను కొనసాగిస్తున్నారని, జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ అలీం, మాజీ కౌన్సిలర్లు పి.బస్వరాజ్‌, సర్ధార్‌ఖాన్‌, నాయకులు నర్సిరెడ్డి, ఇందూరు నరేందర్‌, హబీబ్‌లాలా తదితరులు పాల్గొన్నారు.

Read more